‘కంటే కూతుర్నే కనాలం’టున్నాయ్ ఈ గ్రామాలు!
ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటారు.. ఈ ఆనందంలో పాపాయికి పూల తివాచీ పరిచి మరీ స్వాగతం పలకడం, హెలికాప్టర్లో ఇంటికి తీసుకురావడం.. వంటి ఘటనలు మనం చూసే ఉంటాం. ఇలా వ్యక్తిగతంగానే కాదు.. ఆడపిల్ల పుట్టుకను ఓ వేడుకలా జరుపుకొనే గ్రామాలు....
(Photo: Instagram)
ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటారు.. ఈ ఆనందంలో పాపాయికి పూల తివాచీ పరిచి మరీ స్వాగతం పలకడం, హెలికాప్టర్లో ఇంటికి తీసుకురావడం.. వంటి ఘటనలు మనం చూసే ఉంటాం. ఇలా వ్యక్తిగతంగానే కాదు.. ఆడపిల్ల పుట్టుకను ఓ వేడుకలా జరుపుకొనే గ్రామాలు కూడా మన దేశంలో కొన్నున్నాయి. అమ్మాయిలు ప్రతి రంగంలో అందలమెక్కుతున్నా.. నేటికీ వారిని భారంగా, గుండెలపై కుంపటిలా భావించే తల్లిదండ్రులకు ఈ గ్రామాలే ఆదర్శం అని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేయడం, పెంచి పెద్ద చేసే క్రమంలో గుండెలపై కుంపటిలా భావించడం, బాల్య వివాహం చేసి భారం దించుకోవడం.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలెన్నో జరుగుతున్నాయి. కానీ కొన్ని గ్రామాలు మాత్రం ఆడపిల్ల పుట్టుకను ఓ వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాయి.
111 మొక్కలు నాటాల్సిందే!
‘ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి.. పచ్చదనం భవిష్యత్ తరాలకు ధనలక్ష్మి..’ ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది రాజస్థాన్‌లోని పిప్లాంత్రీ అనే గ్రామం. గత కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టుకను వేడుకగా, విభిన్నంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలో ఏ జంటకు ఆడపిల్ల పుట్టినా మొదట చేసే పనులు రెండే రెండు. ఒకటి-ఆ గ్రామ ప్రజలంతా 111 మొక్కలు నాటడం, రెండోది-పుట్టిన పాపాయి పేరు మీద రూ. 31,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. ఈ క్రమంలో పాప తల్లిదండ్రుల దగ్గర్నుంచి రూ. 10,000 సేకరించి.. గ్రామస్థులంతా కలిసి రూ. 21,000 సేకరించి.. ఈ మొత్తాన్ని పాప పేరు మీద FD చేస్తారు. పాప పుట్టిన రోజు నుంచే చెల్లుబాటయ్యే ఈ అకౌంట్‌ను ఆ గ్రామ పంచాయతీనే నిర్వహిస్తుంది. ఆ అమ్మాయికి 20 ఏళ్లు వచ్చాక ఇందులో జమైన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు.. తమ కూతురికి ఉన్నత విద్యను అందిస్తామని, పెళ్లి విషయంలో ఒత్తిడి చేయమని, చట్టపరంగా వివాహ వయసొచ్చేవరకు పెళ్లి చేయమని.. ఇలా కొన్ని ఒప్పందాలతో కూడిన పత్రంపై ఆమె తల్లిదండ్రులు సంతకం కూడా చేయాల్సి ఉంటుంది.
ఆయనే ఆది!
ఈ గ్రామంలో ఈ పద్ధతి గత కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ శ్యామ్‌సుందర్ పలివాల్ కుమార్తె కిరణ్ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో.. ఆమె జ్ఞాపకార్థం ఆయనీ కార్యక్రమాన్ని ప్రారంభించారట! ఇలా ఇటు ఆడపిల్ల పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూనే.. మరోవైపు పచ్చదనానికీ శ్రీకారం చుడుతోన్న ఈ గ్రామం ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందిందని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 2.5 మిలియన్ల కలబంద మొక్కలు నాటారట! వీటి నుంచి వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేస్తూ మార్కెట్లో విక్రయిస్తూ బోలెడంత డబ్బు సమకూర్చుతున్నారని, ఇదే ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి కారణమని చెబుతున్నారు.
బాజాభజంత్రీలు - స్వీట్లతో వేడుకలు!
చాలామంది అబ్బాయి పుడితే స్వీట్లు పంచి పెడుతుంటారు.. కానీ తెలంగాణ మెదక్ జిల్లాలోని హరిదాస్పూర్ గ్రామంలో అమ్మాయి పుడితే వేడుకలు జరుపుకొంటారు. ఆడపిల్ల పుట్టుకకు గుర్తుగా బాజాభజంత్రీలు మోగించడం, యువత-విద్యార్థులతో ఆ గ్రామ పంచాయతీ ఇంటింటికీ స్వీట్లు పంచడం.. వంటి వేడుకలు నిర్వహిస్తుంటుంది. ఇక ఆ రోజు రాత్రి పంచాయతీ కార్యాలయం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. మరోవైపు అమ్మాయిని కన్న తల్లిదండ్రులకు నగదు బహుమతి సైతం అందిస్తారు. పుట్టిన ఆడపిల్ల పేరు మీద ఆ గ్రామ పంచాయతీ రూ. 1000 తొలి డిపాజిట్‌గా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరుస్తుంది. ఇక ఏటా ఫిబ్రవరి 21న చిలుకూరు బాలాజీ ఆలయం ఆవరణలో ‘కన్యావందనం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని అమ్మాయిల్ని మహాలక్ష్మిగా భావించి ఆలయ పూజారి ఆ ఆడపిల్లలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా అమ్మాయిల ఉనికి చాటుతోన్న ఈ గ్రామానికి గతేడాది ఓ అరుదైన గుర్తింపు దక్కింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పుస్తకంలో ఈ గ్రామం గురించి ఓ పాఠ్యాంశంగా పొందుపరిచారు.
ఆడపిల్లను.. దేవత వరంగా..!
కొన్ని విషయాల్లో చదువుకున్న వాళ్ల కంటే చదువులేని గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల వారే నయమనిపిస్తుంది. ఒడిశాలోని మజిపరా అనే గిరిజన గ్రామం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పచ్చు. ఇప్పటికీ చాలా గ్రామాలు, పట్టణాలు మగ పిల్లాడు పుడితే వేడుకలు చేసుకుంటుంటే.. ఈ గిరిజన గ్రామంలోని ప్రజలు మాత్రం ఆడపిల్ల పుట్టుకను ఆ దేవుడు అనుగ్రహించి తమకు ప్రసాదించిన వరంగా భావిస్తుంటారు. అమ్మాయిని కన్న తల్లికి ఆ రోజంతా గ్రామస్థులు కొత్త బట్టలు, స్వీట్లు, ధాన్యాలు.. వంటివి అందిస్తూ శుభాకాంక్షలు చెబుతారు. ఇక్కడ 320 మంది జనాభా ఉంటే.. అందులో 180 మంది.. అంటే సగానికి పైగా మహిళలుండడం స్త్రీ సాధికారతకు నిదర్శనంగా చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఏ కుటుంబమైనా కట్నం అడగరు.. తీసుకోరు.
మామిడి మొక్కతో శ్రీకారం!
బిహార్‌లో ఆడపిల్లలపై వివక్ష ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో అమ్మాయిలు పుడితే వేడుక చేసుకునే గ్రామం కూడా ఒకటుంది. అదే ధర్హారా గ్రామం. అక్కడ ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా శుభంగా భావించి.. ఆమె తల్లిదండ్రులు మామిడి, లిచీ మొక్కలు నాటడం ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. బిడ్డతో పాటే ఆ మొక్కలూ పెరిగి పెద్దవవుతాయి. ఇలా ఈ మొక్కలతో అక్కడి ప్రతి ఇల్లూ ఓ చిన్న సైజు అడవిని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక వీటికి పండిన పండ్లతో వచ్చిన ఆదాయాన్ని ఆ అమ్మాయి చదువు, పెళ్లికి కూడా వినియోగిస్తుంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 2010లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించారు. అయితే అదే రోజు అక్కడి ఓ కుటుంబంలో అమ్మాయి పుట్టడంతో ఆమె పేరు మీద ఆయనే ఓ మొక్క నాటారట! ఇక అక్కడ మహిళలపై హింస, ఇతర వివక్ష ఉండదని చెబుతుంటారు. ఇలా అటు ఆడపిల్లల అభ్యున్నతికి, ఇటు పర్యావరణ పరిరక్షణకూ కృషి చేస్తోందీ గ్రామం.
వీటితో పాటు రూరల్ మహారాష్ట్రలోని వెల్గావ్ గ్రామంలో కూడా ఆడపిల్ల పుడితే వేడుక చేసుకుంటారు. ఆ గ్రామానికి చెందిన మహిళలంతా కొత్తగా తల్లైన మహిళకు స్వీట్లు, బహుమతులు అందజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతారు. ఇలాంటి వేడుకల వల్ల ఇక్కడ స్త్రీపురుష నిష్పత్తి కూడా పెరిగిందంటున్నాయి అధ్యయనాలు. 2005 (867:1000)తో పోల్చితే ఇప్పటికి (924:1000) ఈ నిష్పత్తి పెరగడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పచ్చు.
ఇలా మొత్తానికి ఈ గ్రామాలన్నీ ఆడపిల్లల అభ్యున్నతికి పాటుపడుతూ.. ఇటు దేశానికి, అటు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
- చెమట వాసనా..!
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
- ఆ సమయంలో సౌకర్యంగా ఉండాలంటే..!
- ప్రొటీన్ ఎక్కువ వద్దు..
అనుబంధం
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
- ఈ పాలు పిల్లలకు ఇస్తున్నారా... ఒక్క నిమిషం!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
- తెలుపు దుస్తులే ఎందుకు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!