Divorce Photoshoots: విడాకులూ.. వేడుకగానే..!

పెళ్లెంత ఆర్భాటంగా చేసుకుంటారో.. విడాకులు అంత గుట్టుచప్పుడు కాకుండా తీసుకుంటారు చాలామంది. ఇందుకు కారణం.. సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, అవహేళనలే! నిజానికి తప్పు తమది కాకపోయినా.. చాలావరకు మహిళలే ఈ సమస్యలు....

Published : 06 May 2023 12:39 IST

(Photos: Instagram)

పెళ్లెంత ఆర్భాటంగా చేసుకుంటారో.. విడాకులు అంత గుట్టుచప్పుడు కాకుండా తీసుకుంటారు చాలామంది. ఇందుకు కారణం.. సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, అవహేళనలే! నిజానికి తప్పు తమది కాకపోయినా.. చాలావరకు మహిళలే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మౌనం వహించాల్సి వస్తోంది. అయితే ఈ మౌనం వీడి ధైర్యంగా మాట్లాడమంటోంది తమిళ నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ షాలిని. ఇటీవలే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. ఫొటోషూట్‌తో ఈ సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. ‘విడాకులు మన జీవితంలో వైఫల్యం కాదు.. ఒక రకమైన సానుకూల మార్పం’టూ తాను పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇలా తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు మహిళలు తమ విడాకుల ఫొటోషూట్‌తో, ఈ సందర్భాన్ని వెరైటీగా జరుపుకొని వార్తల్లోకెక్కారు.

మన సమాజంలో విడాకులు తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు. ఎన్ని వేధింపులైనా భరిస్తూ కాపురం చేయాలని ఒత్తిడి చేస్తుంటారు. ఒకవేళ ధైర్యం చేసి భర్త నుంచి విడిపోతే తప్పంతా ఆమెదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అయితే అంతగా బాధపడుతూ అదే బంధంలో కొనసాగాల్సిన అవసరం లేదంటోంది షాలిని. తమిళ నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె.. ఇటీవలే తన భర్త నుంచి విడాకులు తీసుకొని.. ఆ సందర్భాన్ని ఫొటోషూట్‌తో ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంది.


ఆ సంతోషానికి మనం అర్హులం!

తమిళంలో పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న షాలినికి రియా అనే కూతురు కూడా ఉంది. అయితే వివిధ కారణాల రీత్యా తన భర్త నుంచి విడిపోయిన ఆమె.. ఇటీవలే విడాకుల ఫొటోషూట్‌ తీయించుకుంది. ఈ క్రమంలో ఎరుపు రంగు మోడ్రన్‌ డ్రస్‌ ధరించిన ఆమె.. Divorce అనే అక్షరాలతో రాసున్న బ్యానర్‌ పట్టుకొని నవ్వుతూ, తన పెళ్లి ఫొటోను కాళ్ల కింద నలిపేస్తూ, తన భర్తతో దిగిన ఫొటోను చింపేస్తూ.. ఇలా విభిన్న పోజుల్లో ఫొటోషూట్‌ చేయించుకుంది.

వీటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నాకు నా జీవితంలో 99 సమస్యలొచ్చాయి.. అందులో నా భర్త ఒకటి కాదు.. సమస్యాత్మక వివాహ బంధంలో మగ్గుతూ మూగబోయిన మహిళలందరికీ ఇదే నా సందేశం.. వేధింపులతో కూడిన వైవాహిక బంధాన్ని వీడడం తప్పు కాదు.. విడాకులు తీసుకొని ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించడానికి మీరు అర్హులు. జీవితంలో అవసరమైన మార్పులు చేసుకొని.. మిమ్మల్ని మీరు ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు మీ పిల్లలకూ మంచి భవిష్యత్తును అందించండి. విడాకులు తీసుకోవడం వైఫల్యం కాదు.. జీవితంలో ఇదో కీలక మలుపు.. సానుకూలమైన మార్పులకు ఇది దారితీస్తుంది. విడాకులతో ధైర్యంగా బయటికొచ్చి.. ఒంటరిగానే తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్న మహిళలందరికీ ఈ పోస్టును అంకితం చేస్తున్నా.. నాలాంటి మహిళలెందరిలోనో నా కథ స్ఫూర్తి నింపుతుందనుకుంటున్నా..’ అంది షాలిని. ఇలా ఈ సింగిల్‌ మామ్‌ పెట్టిన పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘మీరు చాలా ధైర్యవంతురాలు’, ‘సూపర్‌ ఉమన్‌’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఈ నాలుగేళ్లలో ఎంతో మార్పు!

సాధారణంగా వివాహ వార్షికోత్సవాన్ని ఏటేటా వేడుకగా జరుపుకొంటాం. కానీ విడాకులు తీసుకొని నాలుగేళ్లైనా.. ఏటేటా ఈ రోజును వేడుకగా చేసుకుంటోంది ముంబయికి చెందిన శాశ్వతి శివ. అలా ఇటీవలే నాలుగో విడాకుల వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందామె. అయితే నచ్చని బంధం నుంచి విముక్తి పొంది.. ఈ నాలుగేళ్లలో వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎంతో పరిణతి సాధించానంటూ.. ఆ ఫొటోలను పంచుకుంటూ, తన అనుభవాలను ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో లింక్డిన్‌లో పంచుకుందామె.

‘నేను విడాకులు తీసుకొని నాలుగేళ్లవుతోంది. ఏటా ఈ ముఖ్యమైన సందర్భాన్ని స్వేచ్ఛకు ప్రతిరూపంగా, సంతోషంగా జరుపుకొంటాను. గత 1460 రోజుల్లో ఏ రోజూ నా జీవితానికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఉండలేదు. కొన్నిసార్లు ప్రణాళిక వేసుకోకుండా మొదలుపెట్టిన పనులే సఫలీకృతమవుతుంటాయి. నా జీవిత ప్రయాణంలో ఈ నాలుగేళ్లలో అలాంటి ఎన్నో పనులు మొదలుపెట్టి సక్సెసయ్యాను. వ్యక్తిగా, వక్తగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా సక్సెసయ్యాను. నాకొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలిగాను. బృందంతో కలిసి పనిచేస్తూ నా నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూ సరికొత్త అవకాశాలను అందుకోగలిగాను. సొంతింటి కలను నెరవేర్చుకోగలిగాను. స్వీయ ప్రేమను పెంచుకునేందుకు, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యమిచ్చాను..’ అంటూ విడాకుల తర్వాత తన పాజిటివ్‌ లైఫ్‌స్టైల్‌ గురించి చెప్పుకొచ్చింది శాశ్వతి. ఇలా ఈ ముంబయి బ్యూటీ పెట్టిన పోస్ట్‌ ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపింది.


డ్రస్‌తో పాటు జ్ఞాపకాల్నీ కాల్చేస్తూ..!

తన పదేళ్ల వైవాహిక బంధంలో సుఖాలకు నోచుకోలేదు సరికదా.. ఎన్నో సమస్యలతో సతమతమైంది అమెరికాకు చెందిన లారెన్‌ బ్రూక్‌. దీంతో తన భర్త నుంచి విడిపోవడానికి 2021లో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కగా.. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు విడాకులు మంజూరయ్యాయి. దీంతో ఈ సందర్భాన్ని వేడుకగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంది బ్రూక్‌. ఈ ఆలోచనతోనే ఇటీవలే విడాకుల ఫొటోషూట్‌ తీయించుకుంది. తన వెడ్డింగ్‌ డ్రస్‌ని కాల్చుతూ, తన పెళ్లి ఫొటోల్ని చించేస్తూ.. తద్వారా తన వివాహ బంధం తాలూకు చేదు జ్ఞాపకాల్ని తన జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేస్తున్నట్లుగా పలు పోజుల్లో దిగిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోలు స్వయంగా ఆమె తల్లి ఫెలీషియా బౌమన్‌ తీయడం మరో విశేషం.
‘అందరి దృష్టిని నా వైపు తిప్పుకోవడానికే నేనీ ఫొటోషూట్‌ చేయించుకుంటున్నానని చాలామంది అన్నారు. కానీ వైవాహిక బంధంలో నేనెదుర్కొన్న సమస్యలేంటో నాకు మాత్రమే తెలుసు. అందులో నుంచి బతికి బయటపడ్డాను కాబట్టే ఈ సందర్భాన్ని ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నా..’ అంది బ్రూక్‌. విమర్శల్ని పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. తన ఇద్దరు పిల్లలకు ఉన్నత భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది.


13 ఏళ్ల బంధానికి స్వస్తి!

తన 13 ఏళ్ల వైవాహిక బంధానికి గ్రాండ్‌గా స్వస్తి పలికింది 47 ఏళ్ల మారీ లోలిస్‌. తన పెళ్లి జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్న ఆమె.. రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని.. ఈ సందర్భాన్ని ఫొటోషూట్‌ తీయించుకొని మరీ సెలబ్రేట్‌ చేసుకుంది. తన పెళ్లి ఫొటోల్ని కాలి కింద నలిపేస్తూ-కాల్చుతూ, వైన్ తీసుకుంటూ, విడాకుల పత్రాల్ని ప్రదర్శిస్తూ.. ఇలా విభిన్న పోజుల్లో ఫొటోలు దిగింది మారీ. ఇక ఈ ఫొటోల్ని స్వయంగా ఆమె మాజీ భర్త సోదరి నటాషా లోలిస్‌ తీయడం గమనార్హం.

‘విడాకుల్ని చాలామంది విషాదంగా భావిస్తుంటారు. కానీ నేను సంతోషంగా తీసుకున్నా. ఎందుకంటే విడాకుల తర్వాత నేను మరింత దృఢంగా మారాను. సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించా.. నా స్నేహితులతో ఎన్నో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది మారీ.

ఇలా విడాకుల్ని సానుకూలంగా తీసుకుంటూ.. ఈ సందర్భాన్ని ఫొటోషూట్లతో సెలబ్రేట్‌ చేసుకుంటోన్న ఈ మహిళల పాజిటివిటీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

పెళ్లినే కాదు.. విడాకులను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న నవతరం.. ఈ నయా ట్రెండ్ పైన మీ అభిప్రాయం ఏమిటి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్