అందుకే వీళ్ల కాఫీకి అంత డిమాండ్!

‘ఓ కప్పు కాఫీ మనసును ఉత్తేజపరుస్తుంది..’ ఇది యాడ్‌ ట్యాగ్‌లైన్‌ కాదు.. ఈ మహిళల వ్యాపార మంత్రం. కాఫీ ప్రియులకు సరికొత్త కాఫీ పరిమళాలు పరిచయం చేస్తున్నారు కొందరు అతివలు. ఈ క్రమంలో వ్యాపారాలు ప్రారంభించి కోట్లు గడిస్తోన్న వారు కొందరైతే.. స్వశక్తితో ఎదిగి మరెంతోమందికి.....

Updated : 01 Oct 2022 13:29 IST

(Photos: Instagram)

‘ఓ కప్పు కాఫీ మనసును ఉత్తేజపరుస్తుంది..’ ఇది యాడ్‌ ట్యాగ్‌లైన్‌ కాదు.. ఈ మహిళల వ్యాపార మంత్రం. కాఫీ ప్రియులకు సరికొత్త కాఫీ పరిమళాలు పరిచయం చేస్తున్నారు కొందరు అతివలు. ఈ క్రమంలో వ్యాపారాలు ప్రారంభించి కోట్లు గడిస్తోన్న వారు కొందరైతే.. స్వశక్తితో ఎదిగి మరెంతోమందికి ఉపాధి కల్పిస్తున్న వారు మరికొందరు. ‘కాఫీతో ప్రయోగాలు చేయడం మాకిష్టం!’ అంటోన్న ఈ కాఫీ లేడీస్‌ ‘అంతర్జాతీయ కాఫీ దినోత్సవం’ సందర్భంగా గురించి తెలుసుకుందాం రండి..

ఇద్దరు స్నేహితుల ‘కాఫీ’ ట్రీట్!

‘కాఫీ వాసన చూస్తేనే కడుపు నిండిపోవాలం’టారు సాధ్వి అశ్విని, మృణాళ్‌ శర్మ. దిల్లీకి చెందిన వీళ్లిద్దరూ కాలేజ్‌ ఫ్రెండ్స్‌. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే కూర్గ్‌ ట్రిప్‌కు వెళ్లారు. సాధారణంగానే కాఫీని ఇష్టపడే ఈ స్నేహితులు అక్కడి కాఫీ తోటల్ని సందర్శించి.. కాఫీ రుచినీ ఆస్వాదించారు. అది వారికెంతో నచ్చింది. అలాగని రుచి చూసి వదిలేయకుండా.. దీనిపై ఓ చిన్నపాటి పరిశోధనే చేశారీ ఇద్దరు స్నేహితురాళ్లు. ఈ క్రమంలో కాఫీ పండించే రైతుల్ని కలిసి.. కాఫీ ఉత్పత్తి విషయంలో తమకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నారు. అంతేకాదు.. అక్కడి రెస్టరంట్లలో కాఫీ తయారుచేసే చెఫ్‌లనూ కలిసి పలు మెలకువలు తెలుసుకున్నారు. ఈ విజ్ఞానమే వారిని 2013లో ‘బాబా బీన్స్‌’ పేరుతో కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పురికొల్పింది. దేశంలోని అత్యుత్తమమైన కాఫీ తోటల నుంచి కాఫీ గింజల్ని సేకరించి.. వాటిని వేయించి.. బ్లెండ్‌ చేసి తయారుచేసిన విభిన్న కాఫీ పొడుల్ని కాఫీ ప్రియులకు చేరువ చేస్తున్నారు అశ్విని-మృణాల్.

‘కాఫీ సంగీతం లాంటిది. ఇట్టే మనసును ఉత్తేజపరుస్తుంది. ప్రస్తుతం మా వద్ద తయారయ్యే విభిన్న కాఫీ పొడులు.. ఇక్కడి కేఫ్‌లు, రెస్టరంట్లతో పాటు ఇతర వేడుకల కోసం సప్లై చేసే క్యాటరింగ్‌ సంస్థలకూ అందిస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ మా సేవలు అందుబాటులో ఉన్నాయి. పాలు, ఇతర పదార్థాలు కలిపినా మా కాఫీ రుచి ఏమాత్రం తగ్గకపోవడమే మా వద్ద తయారయ్యే కాఫీ పొడుల ప్రత్యేకత! నిద్ర లేచీ లేవగానే ఓ కమ్మని కాఫీతో కాఫీ ప్రియుల్ని పునరుత్తేజితం చేయాలన్నదే మా ఆశయం. ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాం.. త్వరలో దిల్లీలో సాగు చేసే కాఫీ గింజలతోనూ సరికొత్త కాఫీ రుచుల్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..’ అంటున్నారు ఈ ఇద్దరు ఫ్రెండ్స్.

 


రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తూ..!

కాఫీ రుచిగా ఉందని కప్పుల కొద్దీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ‘కోల్డ్‌ బ్రూ కాఫీ’ రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తుందంటున్నారు దిల్లీకి చెందిన పూర్ణిమా కత్యాల్‌. న్యూయార్క్‌లో ఈ కాఫీ రుచిని ఆస్వాదించిన ఆమె.. దీనికి ఫిదా అయిపోయింది. తిరిగి దిల్లీకి చేరుకున్నాక ‘థర్డ్‌ రోస్ట్‌’ పేరుతో కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించిందామె.

‘నేను ముందు నుంచీ కాఫీ లవర్‌ని. అయితే మావారితో న్యూయార్క్‌ వెళ్లినప్పుడు కోల్డ్‌ బ్రూ కాఫీ నాకు పరిచయమైంది. దాని రుచి నాకెంతో నచ్చింది. ఇది గమనించిన మావారు ఈ కాఫీ శాషేలు, ఓ బ్రూ మేకర్‌ తీసుకొచ్చారు. ఇక్కడికొచ్చాక ఇదే అలవాటును కొనసాగించా. అంతేకాదు.. దీనిపై ఓ చిన్నపాటి పరిశోధనే చేశా. ఈ క్రమంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ కాఫీ మేలు చేస్తుందని తెలుసుకున్నా. అలాగే మార్కెట్లో దీని ఉత్పత్తి తక్కువగా ఉందని తెలుసుకున్న నేను.. మరింత పెంచాలనుకున్నా. ఈ క్రమంలోనే విభిన్న రుచులతో కోల్డ్‌ బ్రూ కాఫీ తయారుచేసి నా స్నేహితులు, సన్నిహితులకు పంపించేదాన్ని. అలా వారికి అది నచ్చడం, ఆర్డర్లు పెరగడంతో.. క్రమంగా వ్యాపారాన్నీ అభివృద్ధి చేశా. ప్రస్తుతం మా వద్ద విభిన్న రుచుల్లో కోల్డ్‌ బ్రూ కాఫీని తయారుచేస్తూ.. నేరుగా తాగేందుకు వీలుగా బాటిల్‌లో ప్యాక్‌ చేసి అందిస్తున్నాం. ఇదనే కాదు.. ప్రస్తుతం మా వద్ద ఆరోగ్యకరమైన డెజర్ట్స్‌, స్నాక్స్‌, పానీయాలూ తయారవుతున్నాయి..’ అంటూ తన వ్యాపారం గురించి చెప్పుకొచ్చారు పూర్ణిమ.


ఆ వర్క్‌షాప్‌తో మొదలైంది!

చిన్నతనం నుంచి వ్యాపారమైతే చేయాలనుకుంది.. కానీ ఏ బిజినెస్‌ చేయాలో ఓ స్పష్టత వచ్చింది మాత్రం స్థానికంగా జరిగిన ఓ కాఫీ వర్క్‌షాప్‌కు హాజరయ్యాకే అంటోంది నాగాలాండ్‌ దిమాపూర్‌కు చెందిన జకిత్సోనో జమీర్‌. ఈ వర్క్‌షాప్‌లో భాగంగా కాఫీ తయారీ, ఇతర ప్రత్యేకతల్ని తెలుసుకున్న ఆమె.. కాఫీ లవర్‌గా మారిపోయింది. ఈ మక్కువతోనే ‘ఫార్మర్స్‌ స్క్వేర్‌’ అనే కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించింది జమీర్.

‘కాఫీతో ప్రయోగాలు చేయడమంటే నాకిష్టం. అయితే ఆర్థిక కారణాల వల్ల వ్యాపారం ప్రారంభించిన కొన్ని నెలలకే షాప్‌ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. అదే ఏడాది స్థానికంగా ఏర్పాటుచేసిన ఓ వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా. గతంలో నేను చేసిన తప్పొప్పులు తెలుసుకొని.. వ్యాపార నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నా. ఆపై 2019లో తిరిగి నూతనోత్సాహంతో నా షాపును తెరిచా. కాఫీ బీన్స్‌ని అప్పటికప్పుడు పొడి చేసి తాజాగా, రుచికరమైన కాఫీని తయారుచేసి, డెకరేట్‌ చేసి అందించడం మా ప్రత్యేకత. ఈ క్రమంలో కాఫీ తయారీ దగ్గర్నుంచి వినియోగదారులకు అందించడం దాకా.. ప్రతి దశలోనూ పర్యావరణహితమైన వస్తువుల్నే వాడుతున్నాం. అంతేకాదు.. స్థానికంగా తయారుచేసిన పచ్చళ్లు, క్యాన్‌డ్‌ పైనాపిల్స్‌, సాస్‌తో పాటు ప్రత్యేకంగా పండించిన పుట్టగొడుగులూ మా షాపులో దొరుకుతున్నాయి..’ అంటోన్న జమీర్‌ ‘కాఫీ లేడీ ఆఫ్‌ నాగాలాండ్‌’గా పేరుపొందారు. ప్రస్తుతం తన వ్యాపారంతో మరికొంతమంది స్థానిక యువతీయువకులకు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని