కుంగిపోయిన మనసుకు భరోసా ఇస్తున్నారు!
మనసులో బాధ పంచుకుంటేనే తగ్గుతుందంటారు.. మరి, పంచుకోవాలని ఉన్నా.. మన గోడు వినే వారెవరు? విన్నా.. తగిన సలహా ఇస్తారో? లేదో? అన్న సందేహం! అందుకే ‘ఇలా నలుగురిలో పలుచనయ్యే బదులు ఆ బాధను మనలోనే దాచుకోవడం మంచిది..’ అనుకుంటూ కుంగుబాటుకు గురయ్యే వారు....
(Photos: Instagram)
మనసులో బాధ పంచుకుంటేనే తగ్గుతుందంటారు.. మరి, పంచుకోవాలని ఉన్నా.. మన గోడు వినే వారెవరు? విన్నా.. తగిన సలహా ఇస్తారో? లేదో? అన్న సందేహం! అందుకే ‘ఇలా నలుగురిలో పలుచనయ్యే బదులు ఆ బాధను మనలోనే దాచుకోవడం మంచిది..’ అనుకుంటూ కుంగుబాటుకు గురయ్యే వారు చాలామందే ఉంటారు. పురుషులతో పోల్చితే మహిళలే ఈ సమస్య బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇదిగో ఇలాంటి వాళ్లకు ఆపద్బాంధవుల్లా నిలుస్తున్నారు కొందరు మహిళలు. తమ మాటలు, చేతలతో మానసిక సమస్యలు, వాటి వల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి వివరిస్తూనే.. మానసిక ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తోన్న కొంతమంది మహిళా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుందాం..!
దివిజా భాసిన్
వ్యక్తిగత సమస్యలు, వృత్తిఉద్యోగాల్లో ఒత్తిళ్లు, అనుబంధంలో గొడవలు.. మన నిత్య జీవితంలో మానసిక సమస్యలకు ఇలాంటివెన్నో కారణమవుతుంటాయి. చాలామందిని వీటికి దూరం చేసి మానసిక ఆరోగ్యానికి చేరువ చేసే బాధ్యతను తన భుజాలపై వేసుకుంది దిల్లీకి చెందిన దివిజా భాసిన్. మానసిక ఆరోగ్యంపై తనకున్న మక్కువతో ఇంగ్లండ్‌లోని బాత్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిందామె. ఆపై ‘Awkwardgoat3’ పేరుతో ఇన్‌స్టా పేజీని తెరిచింది. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు ఫన్‌ను జోడిస్తూ చిన్న చిన్న వీడియోలు రూపొందిస్తోంది దివిజ.
‘ఏవైనా అనారోగ్యాలు ఎదురైతే డాక్టర్ దగ్గరికెళ్తాం. అదే మానసిక సమస్యలతో బాధపడే వారు సంబంధిత నిపుణుల వద్దకు వెళ్లడం, సరైన చికిత్స తీసుకోవడం.. వంటివి అరుదుగా చూస్తుంటాం. దీనికి కారణం.. సమాజంలో దీనిపై ఉన్న ప్రతికూల భావనే! అందుకే ఈ ఆలోచనల్ని దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని చేరువ చేయడానికి లఘు వీడియోలు రూపొందిస్తున్నా. వీటికి మూలం సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలే! మందుల కంటే థెరపీనే దీనికి సమర్థంగా పనిచేస్తుందన్నది నా నమ్మకం..’ అంటోంది దివిజ. ఇలా ఓవైపు సోషల్ మీడియా వేదికగా మానసిక సమస్యలున్న వారిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ సైకాలజిస్ట్.. మరోవైపు ‘ది ఫ్రెండ్లీ కోచ్’ అనే సంస్థనూ నడుపుతోంది. అనుభవజ్ఞులైన నిపుణులతో బాధితులకు కౌన్సెలింగ్ సేవలందించే వేదిక ఇది!
సోనాలీ గుప్తా
తల్లి స్ఫూర్తితో మానసిక శాస్త్రంలో రాణించాలని 8 ఏళ్ల వయసులోనే సంకల్పించుకుంది ముంబయికి చెందిన సోనాలీ గుప్తా. క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్, కౌన్సెలింగ్ స్కిల్స్‌లో డిప్లొమా పూర్తిచేసిన ఆమె.. ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో కొన్నాళ్ల పాటు స్టూడెంట్ కౌన్సెలర్‌గా పనిచేసింది. ఆపై ‘మెంటల్ హెల్త్ విత్ సోనాలీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాల్ని తెరిచిన సోనాలీ.. ఆ వేదికలుగా మానసిక బాధితుల్లో ప్రేరణ కలిగిస్తోంది. ముఖ్యంగా వర్క్‌ప్లేస్ బర్నౌట్, యాంగ్జైటీ, వర్క్-లైఫ్ బ్యాలన్స్, ఇతర వృత్తిపరమైన సమస్యలు, దంపతుల కౌన్సెలింగ్, లైంగిక పరమైన సమస్యలపై స్ఫూర్తిదాయక వీడియోలు రూపొందిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. మరోవైపు కాలేజీలు, కార్యాలయాల్లోనూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తుంటుంది సోనాలీ.
‘నా 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది మానసిక బాధితుల్ని చూశా. తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కునే దిశగా వారిని చైతన్యపరిచాను. ఆయా సమస్యను బట్టి థెరపీలు, పద్ధతులు, టూల్స్‌తో చికిత్స చేస్తూనే.. వాళ్లు తమ భావోద్వేగాల్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నా. ఏ థెరపీ అయినా కొంతవరకు మార్పు తీసుకురావచ్చు.. కానీ అంతిమంగా సమస్యను దూరం చేసుకోవాలంటే ఏది ఉత్తమమైన మార్గమో వారికి అవగాహన రావాలి. ఆ దిశగానే నా కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగుతాయి..’ అంటోంది సొనాలీ.
ఇలా మానసిక నిపుణురాలిగానే కాదు.. రచయిత్రిగానూ పేరు తెచ్చుకుందామె. ఈ క్రమంలో మానసిక రుగ్మతలపై అవగాహన కల్పించే దిశగా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూనే.. పుస్తక రచన పైనా దృష్టి పెట్టారు. అలాగే ఆమె రాసిన ‘Anxiety: Overcome It and Live without Fear’ పుస్తకం ఇటీవలే విడుదలై పాఠకాదరణను పొందింది. ప్రస్తుతం తన రెండో పుస్తకంపై కసరత్తు చేస్తున్నారంటున్నారీ సైకాలజిస్ట్.
ఆకాంక్ష భాటియా
అనుభవమైతే గానీ తత్వం బోధపడదంటారు. తానూ యాంగ్జైటీ బారిన పడితే గానీ మానసిక సమస్యలు, వాటి పర్యవసానాల గురించి తెలుసుకోలేకపోయానంటోంది చెన్నైకి చెందిన పాతికేళ్ల ఆకాంక్ష భాటియా. 16 ఏళ్ల వయసులో ఈ సమస్యను ఎదుర్కొన్న ఆమె.. ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతున్నానంటోంది. అయితే ప్రస్తుతం తనను తాను అంగీకరిస్తూ సమస్యను అదుపులో ఉంచుకున్నానంటోంది ఆకాంక్ష. అంతేకాదు.. మానసిక రుగ్మతలపై అందరిలోనూ అవగాహన పెంచాలనుకుంది. ఈ క్రమంలోనే ‘thatsappywriter’ పేరుతో ఇన్‌స్టా పేజీ ప్రారంభించింది. అందులో గతంలో తానెదుర్కొన్న మానసిక సమస్య తాలూకు అనుభవాలు పంచుకుంటూనే.. ఇతర మానసిక సమస్యలకు సంబంధించిన అంశాలపై వీడియోలు, కవితల రూపంలో అవగాహన కల్పిస్తోందామె. ‘యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్.. ఈ రెండు సమస్యలు నా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే క్రమంగా వాటిని అదుపులో పెట్టుకుంటూనే నన్ను నేను అంగీకరించడం మొదలుపెట్టా. మన జీవనశైలి మార్పులతోనే చాలా సమస్యల్ని ఎదుర్కోవచ్చు/అదుపు చేసుకోవచ్చు. యాంగ్జైటీ కూడా అంతే! నా క్లైంట్స్‌కి కూడా నేను ఇదే చెబుతుంటా..’ అంటోంది ఆకాంక్ష.
అర్పితా నాయక్
ఈ సృష్టిలో ఎవరూ ఒంటరి కాదంటోంది బెంగళూరుకు చెందిన అర్పితా నాయక్. యుక్త వయసులో తానెదుర్కొన్న ఓ సంఘటన తనకు స్వీయ ప్రేమ నేర్పిందని, ఇదే మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా పురికొల్పిందని చెబుతోంది. ‘నేను చిన్న వయసు నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లో చేరాక నేను వేసుకున్న ఫ్యాషనబుల్ దుస్తులు చూసి చాలామంది నా అధిక బరువు గురించి కామెంట్లు చేసేవారు. కానీ ఆ తర్వాత స్వీయ పరిశీలన చేసుకున్న నేను.. ఎలా ఉన్నా నన్ను నేను ప్రేమించడం, అంగీకరించడం అలవాటు చేసుకున్నా. ఈ క్రమంలోనే మానసిక సమస్యలపై అందరిలో అవగాహన పెంచేందుకు ‘ది బయోస్కోప్‌డ్ లైఫ్’ పేరుతో ఓ సోషల్ మీడియా పేజీ/బ్లాగ్‌ని ప్రారంభించా..’ అంటోంది అర్పిత. ఈ వేదిక ద్వారా బుల్లీయింగ్, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం.. వంటి అంశాలపై కంటెంట్‌ని రూపొందిస్తోందామె. ‘మానసిక సమస్యలతో పోరాడే వారు ఒంటరితనంతో కుంగిపోతుంటారు. కానీ ఈ సృష్టిలో ఎవరూ ఒంటరి కాదనేది నా భావన. సమస్యను ఇతరులతో పంచుకుంటేనే దానికి పరిష్కారంతో పాటు మనశ్శాంతీ దొరుకుతుందం’టూ తన మాటలతోనూ నలుగురిలో చైతన్యం తీసుకొస్తోందీ యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్. మానసిక నిపుణురాలైన అర్పిత.. మంచి చిత్రకారిణి కూడా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.