ఏఐతో ఆ సమస్యలకు చెక్‌ పెడుతున్నారు!

కొన్ని సమస్యలకు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.. ఆలోచనల్ని ఆచరణలో పెడితే మరికొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రెండింటికీ ఆధునిక టెక్నాలజీని జోడించి ఏకంగా వ్యాపార ప్రయాణమే ప్రారంభించారు ఇద్దరు మహిళలు. తమ అంకుర సంస్థలతో ఎంతోమందిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు.

Published : 22 Jun 2024 19:49 IST

(Photos: Twitter)

కొన్ని సమస్యలకు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.. ఆలోచనల్ని ఆచరణలో పెడితే మరికొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రెండింటికీ ఆధునిక టెక్నాలజీని జోడించి ఏకంగా వ్యాపార ప్రయాణమే ప్రారంభించారు ఇద్దరు మహిళలు. తమ అంకుర సంస్థలతో ఎంతోమందిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. సమాజంలో మార్పు దిశగా వీళ్లు చేస్తోన్న ఈ ప్రయత్నమే తాజాగా విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్‌ - 2024’ జాబితాలో చోటు దక్కేలా చేసింది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)’ విడుదల చేసిన ఈ జాబితాలో మన దేశం నుంచి 10 స్టార్టప్స్‌కి చోటు దక్కగా.. అందులో రెండు మహిళలు ప్రారంభించినవి కావడం విశేషం! ఇంతకీ, ఎవరా ఇద్దరు మహిళలు? వాళ్ల వ్యాపార ప్రయాణమేంటో తెలుసుకుందాం రండి..

కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిందీ టెక్నాలజీ. దీని సహాయంతో సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ.. సమాజంలో మార్పు దిశగా కృషి చేస్తోన్న టాప్-100 స్టార్టప్స్‌ జాబితాను ‘టెక్నాలజీ పయనీర్స్‌ - 2024’ పేరిట ‘ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశానికి చెందిన 10 అంకుర సంస్థలకు చోటు దక్కింది. వీటిలో రెండు మహిళలు ప్రారంభించిన స్టార్టప్స్‌ ఉన్నాయి.


రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించే ‘నిరమాయ్‌’!

రొమ్ము క్యాన్సర్‌.. మహిళల పాలిట శాపంగా మారిందీ మహమ్మారి. మన దేశంలో ఏటికేడు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)’ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందుకు కారణం.. ఈ క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించకపోవడం! ఇదే అనారోగ్యంతో కన్నుమూసిన తన ఇద్దరు కజిన్స్‌ పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆలోచించేలా చేసిందని చెబుతున్నారు బెంగళూరుకు చెందిన గీతా మంజునాథ్‌. ఈ క్రమంలోనే రొమ్ము క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించే ‘థర్మలిటిక్స్‌’ అనే పరికరాన్ని తన నిపుణుల బృందంతో కలిసి రూపొందించారామె. వక్షోజాల్లో ఉష్ణోగ్రతను బట్టి క్యాన్సర్‌ను గుర్తించే ఈ పరికరాన్ని ఏఐ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. తాము రూపొందించిన ఈ పరికరం క్యాన్సర్‌ లక్షణాలు బయట పడకముందే వ్యాధిని నిర్ధరించడంలో సమర్థంగా పనిచేస్తుందంటున్నారు గీత.

‘నా కజిన్స్‌ ఇద్దరూ 45 ఏళ్ల లోపు వారే. తరచూ మమోగ్రామ్‌ పరీక్ష కూడా చేయించుకునేవారు. అయితే యుక్త వయసులో ఉన్న వారిలో ఒక్కోసారి మమోగ్రామ్‌ పరీక్షలోనూ క్యాన్సర్‌ కణతులు బయటపడవు. ఇదే వారిద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుడే ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనిపించింది. ఈ ఆలోచనే 2016లో ‘నిరమాయ్‌ హెల్త్‌ అనలిటిక్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించేలా చేసింది. ఈ వేదికగానే థర్మల్‌ ఇమేజింగ్‌ పద్ధతికి, కృత్రిమ మేధను జోడించి ‘థర్మలిటిక్స్‌’ అనే పరికరాన్ని అభివృద్ధి చేశాం..’ అంటున్నారు గీత.

నొప్పి లేకుండానే..!

రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలనగానే చాలామంది తీవ్రమైన నొప్పి వస్తుందని, తమ ప్రైవసీ దెబ్బతింటుందని భయపడతారు. కానీ థర్మలిటిక్స్‌తో ఈ సమస్యలేవీ ఉండవని చెబుతున్నారు గీత.

‘థర్మలిటిక్స్‌ ఒక చిన్న సైజు కెమెరాను పోలి ఉంటుంది. దీన్ని సులభంగా పట్టుకోవడానికి ఒక హ్యాండిల్‌నీ అనుసంధానించాం. క్యాన్సర్‌ పరీక్ష చేయించుకునే వారికి ఈ పరికరాన్ని మూడు అడుగుల దూరంలో ఉంచాలి. ఇందులోని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు వక్షోజాల్లో వేర్వేరు భాగాల్లో ఉన్న ఉష్ణోగ్రతను రికార్డ్‌ చేస్తాయి. ఈ ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల్ని బట్టి ఓ థర్మల్‌ ఛాయాచిత్రం సిద్ధమవుతుంది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ పరికరం రొమ్ములో ఉన్న ఉష్ణోగ్రతల్ని బట్టి మూడు పేజీల క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ రిపోర్టును తయారుచేస్తుంది. ఈ ఫొటోల్ని, రిపోర్ట్‌ను డాక్టర్‌కు చూపిస్తే వ్యాధి ఉందో, లేదో సులభంగా నిర్ధరిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఇతర పరీక్షలు చేయించుకోమని సూచిస్తారు. ఈ పరికరంతో స్వయంగా కూడా రొమ్ము క్యాన్సర్‌ పరీక్ష చేసుకోవచ్చు.. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్లచ్చు కూడా! అంతేకాదు.. ఈ పరికరాన్ని నాలుగ్గోడల ముందు పేషెంట్‌ ముందు అమర్చితే చాలు.. టెక్నీషియన్‌తో పనిలేకుండా రిపోర్టును తయారుచేస్తుంది. తద్వారా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగదు. అలాగే ఇది రేడియేషన్‌ రహిత క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష. కాబట్టి దీంతో ఎలాంటి నొప్పి కూడా ఉండదు..’ అంటోన్న గీత.. ఈ పరికరంతో ఎన్నో సంస్థల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయా ప్రాంతాల్లో క్యాన్సర్‌ పరీక్షా శిబిరాల్ని ఏర్పాటుచేసి ఉచితంగానూ పరీక్షలు చేస్తున్నారు.

ఇప్పటికే 30కి పైగా పేటెంట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న ఈ పరికరంతో రొమ్ము క్యాన్సర్‌నే కాదు.. ఇతర క్యాన్సర్లనూ కచ్చితత్వంతో గుర్తించచ్చంటున్నారు గీత. ఇలా తన సృజనాత్మకత, సేవలకు గుర్తింపుగా పలు ప్రతిష్టాత్మక అవార్డులూ అందుకున్న ఈ టెకీ.. ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన గీత.. వ్యాపారం ప్రారంభానికి ముందు పాతికేళ్ల పాటు ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేశారు.


‘సహజ’ పోషకాలు తయారుచేస్తూ..!

ఈ భూమిపై జీవజాతులు మనుగడ సాధించాలంటే ఒక దానిపై మరొకటి ఆధార పడక తప్పదు! ఈ ఫుడ్‌ చెయిన్‌ పర్యావరణంపైనా పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికే పర్యావరణహిత పోషకాలు తయారుచేస్తున్నారు డాక్టర్‌ ఎజిల్‌ సుబ్బేన్‌. జంతువులు, మనుషులు.. ఆహారం కోసం పరస్పరం ఆధారపడకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో పర్యావరణహిత పోషకాల్ని ఉత్పత్తి చేసేందుకు 2013లో ‘స్ట్రింగ్‌ బయో’ పేరుతో ఓ బయోటెక్నాలజీ సంస్థను ప్రారంభించారామె. వ్యవసాయం కోసం వాడే ఎరువుల్లో రసాయనాల ఉపయోగం లేకుండా, సౌందర్యోత్పత్తుల తయారీలోనూ రసాయన/జంతు ఉత్పత్తులు వాడకుండా.. వీటి కోసం కూడా సహజ పదార్థాల్నీ అందుబాటులోకి తీసుకొచ్చారామె. కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీని ఉపయోగించి మీథేన్‌ వంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల్ని పులియబెట్టి ఈ పోషకాల్ని తయారుచేస్తున్నారామె.

జీవశాస్త్రంపై మక్కువతో..!

‘చిన్నతనం నుంచి జీవశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంటర్‌ పూర్తిచేసిన సమయంలోనే దేశంలో బయోటెక్నాలజీ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ మన జీవితాల్ని మరింత సులభతరం చేస్తుందనేది నా భావన. ఈ ఆసక్తితోనే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. ఆపై అమెరికాలోని ఓ యూనివర్సిటీలో అణు జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చదివా. ఆపై 15 ఏళ్ల పాటు అక్కడి బయోటెక్‌ స్టార్టప్స్‌లలో పనిచేశా. ఇలా గడించిన అనుభవంతోనే నా భర్తతో కలిసి స్ట్రింగ్‌ బయో సంస్థను ప్రారంభించా. ప్రస్తుతం మీథేన్‌ వాయువును ఉపయోగించి.. మనుషులు, జంతువులు, మొక్కల కోసం సహజసిద్ధమైన పోషకాల్ని తయారుచేస్తున్నాం. అలాగే సౌందర్యోత్పత్తుల తయారీ కోసం ఎకో-ఫ్రెండ్లీ పదార్థాల్ని ఉత్పత్తి చేస్తున్నాం.. జీవులన్నీ ఒక దానిపై మరొకటి ఆధారపడకుండా ఉండేందుకు.. భవిష్యత్‌ తరాల కోసం సస్టెయినబుల్‌ ఆహార పద్ధతుల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..’ అంటోన్న ఎజిల్‌.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి మరిన్ని సృజనాత్మక పద్ధతులు అందుబాటులోకి రావాలని చెబుతున్నారు. స్టెమ్‌ రంగంలో మహిళల శాతం పెరిగినప్పుడే ఇది సాధ్యమవుతుందంటున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్