Updated : 22/09/2021 19:42 IST

అలా వీళ్లిద్దరూ అమ్మల మనసులు గెల్చుకుంటున్నారు!

(Photo: Instagram)

మార్కెట్లో పిల్లలకు సంబంధించి ఎన్నో రకాల ఆహార పదార్థాలు దొరుకుతుంటాయి. గోధుమ, మైదా వంటి రిఫైన్డ్‌ పదార్థాలతో తయారు చేయడం, చక్కెర, ఉప్పు లాంటివి చేర్చడం వల్ల ఇవి పిల్లలకు ఎంతో రుచిగా అనిపిస్తాయి. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్‌, చూడగానే ఆకట్టుకునేలా ఉండేందుకు ఆర్టిఫిషియల్‌ ఫ్లేవర్స్‌, కలర్స్‌ను కలుపుతుంటారు. పిల్లలు తినడానికి ఇవి రుచిగా అనిపించినా కాలక్రమంలో ఊబకాయం తదితర సమస్యలు వారిని వేధిస్తాయి.

పిల్లల ఆరోగ్యం కోసం!

ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌ కలపకుండా పిల్లల ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు శౌరవి మలిక్‌, మేఘనా నారాయణన్‌. రుచికి ప్రాధాన్యమిస్తూనే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతూ అమ్మల మనసు గెల్చుకుంటున్నారు. 
మంచి స్నేహితులుగా మారారు!

బెంగళూరుకు చెందిన మేఘన మంచి స్విమ్మర్‌. జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో కూడా పాల్గొంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేసింది. దిల్లీకి చెందిన శౌరవి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుంది. లండన్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో మొదటిసారిగా వీరు కలుసుకున్నారు. ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరూ కలిసి ఏదైనా స్టార్టప్‌ ప్రారంభిద్దామనుకున్నారు. కానీ అప్పటికే ఇద్దరికీ మంచి ఉద్యోగాలు ఉండడంతో రిస్క్‌ ఎందుకని వెనక్కు తగ్గారు.

పిల్లలు పుట్టడంతో..

ఇది జరిగిన తర్వాత ఎవరి ఉద్యోగాల్లో వారు బిజీ అయిపోయారు శౌరవి, మేఘన. కొన్నేళ్లకు పెళ్లి చేసుకుని అమ్మలుగా ప్రమోషన్‌ కూడా పొందారు. తమ పిల్లల పోషణపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ స్నేహితులు వారికి బలమైన, పోషకాహారం అందించాలనుకున్నారు. కానీ ఏ స్టోర్కెళ్లినా మైదా, గోధుమతో తయారుచేసిన ‘రడీ టు ఈట్’ ఉత్పత్తులే కనిపించాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయని గ్రహించిన వారు ఇంట్లోనే కొన్ని వెజిటబుల్‌ ప్యూరీలు తయారుచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సెరెల్స్‌తో మరికొన్ని ఆహార పదార్థాలను కూడా తయారుచేశారు. క్రమంగా ఇవే ‘Slurrp Farm’ అనే బేబీ ఉత్పత్తుల వ్యాపారానికి పునాది వేశాయి.

600 స్టోర్లలో..

తమ దగ్గర దాచుకున్న డబ్బుతో ఐదేళ్ల క్రితం సంయుక్తంగా ‘Slurrp Farm’ ను ప్రారంభించారు మేఘన, శౌరవి. ఈ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తూ రాగులు, జొన్నలు, ఓట్స్‌, కొర్రలు, అమరంత్‌, బాదం, జీడిపప్పు, పిస్తా, పండ్లు, కూరగాయలతో ఆహార ఉత్పత్తులను తయారుచేశారు. మొదట తమ బంధువులు, స్నేహితులకు వీటిని పంపించారు. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. 2016లో ప్రారంభమైన ఈ ‘Slurrp Farm’ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌....ప్రస్తుతం ఇండియాలో 600 ప్రధాన స్టోర్లలో లభ్యమవుతున్నాయి. యూఏఈ, సింగపూర్‌ దేశాల్లోని సూపర్‌ మార్కెట్లతో పాటు అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలోనూ ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి.

ఇవేవీ వాడం!

‘Slurrp Farm’ వేదికగా కిచిడీ మిక్స్‌, ఓట్స్‌, మిల్లెట్‌ ప్యాన్‌ కేక్స్‌, వాఫెల్‌ మిక్స్‌, బనానా అండ్‌ చాక్లెట్‌ చిప్‌ ప్యాన్‌కేక్స్‌, బీట్‌రూట్‌ ఓట్స్‌ దోశ... ఇలా ఎన్నో రకాల ఆహార ఉత్పత్తులను అందజేస్తున్నాం. మేం రుచితో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అందుకే మైదా, డాల్డా, ఉప్పు, చక్కెర వంటి వాటిని మేం అసలు ఉపయోగించం. అదేవిధంగా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్‌, కలర్స్‌ను కూడా వాడం. ఇక ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయానికొస్తే... ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సప్, ఇ-మెయిల్‌, మార్కెటింగ్‌ సైట్స్‌ ద్వారా మా ఉత్పత్తుల గురించి ప్రచారం చేశాం. ఇండియాతో పాటు విదేశాల్లోనూ మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. కొవిడ్‌ సంక్షోభంలోనూ పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని స్టోర్లలో మా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అంటున్నారీ సూపర్‌ మదర్స్.

‘Slurrp Farm’ వేదికగా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పిల్లలకు అందిస్తున్నారు మేఘన, శౌరవి. తమకున్న నైపుణ్యాలతో అమ్మల మనసులను గెల్చుకుంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని