Akshaya Tritiya: ‘డిజిటల్‌ గోల్డ్‌’ కొంటున్నారా?

బంగారం తరగని సంపదకు చిహ్నం. అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా సంపద వెల్లివిరుస్తుందని ఎంతోమంది విశ్వసిస్తారు. అందుకే రోజురోజుకీ కొండెక్కుతోన్న....

Published : 22 Apr 2023 12:37 IST

బంగారం తరగని సంపదకు చిహ్నం. అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా సంపద వెల్లివిరుస్తుందని ఎంతోమంది విశ్వసిస్తారు. అందుకే రోజురోజుకీ కొండెక్కుతోన్న ధరను లెక్క చేయకుండా ఈ రోజున గ్రాము బంగారమైనా కొంటుంటారు. అయితే బంగారం లోహరూపంలో మన దగ్గర ఉందంటే ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. అందుకే ఈసారి ‘డిజిటల్‌ బంగారం’ (Digital Gold) కొనమంటున్నారు ఆర్థిక నిపుణులు. తద్వారా దీన్ని సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు దీని విలువను కూడా పెంచుకోవచ్చంటున్నారు. అయితే డిజిటల్‌ గోల్డ్‌ కొనే క్రమంలో పలు విషయాలు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

అసలేంటీ డిజిటల్‌ గోల్డ్?

ప్రస్తుతం చాలామంది ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కొనుగోళ్లైనా, అమ్మకాలైనా కూర్చున్న చోటే సులభంగా చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ పద్ధతిలో బంగారం కూడా కొనచ్చంటున్నారు నిపుణులు. దీన్నే ‘డిజిటల్‌ గోల్డ్’(Digital Gold)గా పిలుస్తారు. వివిధ సంస్థలు ఇలా 'డిజిటల్ గోల్డ్’ కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్‌ ఈ-వ్యాలెట్స్‌.. ద్వారా ఈ బంగారం కొనుగోలు చేయచ్చు. అంతేకాదు.. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి ఎంత బంగారమైనా కొనచ్చు. ఈ పద్ధతిలో కనిష్టంగా రూపాయి బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ డిజిటల్‌ బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. అలాగే మార్కెట్‌ ధరల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ.. ధరలు పెరిగినప్పుడు దీన్ని అమ్ముకోవచ్చు కూడా!

ఇవి గుర్తుపెట్టుకోండి!

అయితే డిజిటల్‌ బంగారం (Digital Gold) కొనుగోలు చేసే క్రమంలో కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

పైన చెప్పుకున్నట్లుగా డిజిటల్‌ బంగారాన్ని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. అయితే మీరు లావాదేవీలు జరిపేందుకు ఉపయోగించే ఈ-వ్యాలెట్స్‌, షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్స్‌.. వంటివి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రణలో పనిచేసేవై ఉండాలి. తద్వారా ఆన్‌లైన్‌ మోసాలకు తావు లేకుండా జాగ్రత్తపడచ్చు.

డిజిటల్‌ పద్ధతిలో కొన్న బంగారం డీమ్యాట్ అకౌంట్‌లో భద్రపరచుకుంటే సురక్షితంగా ఉంటుంది. పైగా దీనికి లాకర్‌ ఛార్జీలు కూడా ఉండవు.

డిజిటల్‌ బంగారం (Digital Gold) కొనడానికి ఎలాంటి పరిమితులు లేవు. అంటే కనిష్టంగా రూ.1తో మొదలుపెట్టి ఎంత విలువైన బంగారమైనా కొనచ్చు. అయితే రూ. 1.5 లక్షలకు పైగా విలువైన బంగారం కొంటే వినియోగదారులు ఆయా సంస్థలకు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ తరహాలో కొన్న బంగారం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైనదే అయినా.. కొనే ముందు సంబంధిత సంస్థల నుంచి ధృవీకరణ పత్రాల్ని పరిశీలించడం ముఖ్యం.

ఆయా సంస్థల నుంచి కొన్న బంగారాన్ని డిజిటల్‌ వాల్ట్‌లో నిల్వ చేస్తారు. నామమాత్రపు ఛార్జీలు చెల్లించి ఈ బంగారాన్ని కావాల్సినప్పుడు భౌతికంగా పొందచ్చు.

డిజిటల్‌ గోల్డ్‌ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు ఇందులో పెట్టుబడి పెడితేనే మంచి రాబడి వస్తుంది. కాబట్టి తక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారు డిజిటల్‌ గోల్డ్‌ను ఎంచుకోకపోవడమే మంచిది.

స్వచ్ఛమైనది.. సురక్షితమైనది!

డిజిటల్‌ పద్ధతిలో కొనే బంగారం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

ఆన్‌లైన్‌ రుణాలు తీసుకున్నప్పుడు డిజిటల్‌ గోల్డ్‌ను తనఖాగా పెట్టుకోవచ్చు.

డిజిటల్‌ బంగారాన్ని భౌతికంగా కూడా పొందే వీలుంది. మనకు కావాల్సినప్పుడు సంస్థలు దీన్ని నేరుగా మన ఇంటికే పంపిస్తాయి.

ఈ తరహా బంగారాన్ని నగలు, గోల్డ్‌ కాయిన్స్‌ రూపంలో మార్చుకునే వీలుంది.

ఇది వంద శాతం స్వచ్ఛమైనదే కాదు.. వంద శాతం సురక్షితంగా భద్రపరచుకోవచ్చు.

వినియోగదారులు తమ డిజిటల్‌ గోల్డ్‌ను మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.

ఈ బంగారాన్ని మన ప్రియమైన వారికి కానుకగా కూడా అందించచ్చు. అది కూడా సింపుల్‌గా ఓ వాట్సాప్‌ సందేశం ద్వారా!

అయితే బహుళ ప్రయోజనాలున్న ఈ డిజిటల్‌ గోల్డ్‌ను భద్రపరిచే విషయంలో కొన్ని సంస్థలు తక్కువ కాల పరిమితిని అందిస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాల పరిమితి దాటిన తర్వాత ఆ బంగారాన్ని భౌతిక రూపంలో తీసేసుకోవడం లేదంటే అమ్మడం చేయాలి.. అలాగే డిజిటల్‌ గోల్డ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ సంస్థలు లేకపోవడం లోటనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్