రిజైన్ చేస్తున్నప్పుడూ.. హుందాగానే..!

కంపెనీ మారాలనుకున్నా, కెరీర్‌లో విరామం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజం. ఈ క్రమంలో సంస్థ నిబంధనల ప్రకారం నోటీస్‌ పిరియడ్‌లో భాగంగా ఉద్యోగి ఒకటి లేదా రెండు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

Published : 19 Aug 2023 19:39 IST

కంపెనీ మారాలనుకున్నా, కెరీర్‌లో విరామం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజం. ఈ క్రమంలో సంస్థ నిబంధనల ప్రకారం నోటీస్‌ పిరియడ్‌లో భాగంగా ఉద్యోగి ఒకటి లేదా రెండు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఎలాగూ కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నామన్న ఉద్దేశంతో పని విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. సంస్థకు, నాకు ఇక చెల్లు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. నిజానికి దీనివల్ల సదరు ఉద్యోగిపై సంస్థకు నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఉద్యోగి అప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, కెరీర్‌కూ ఈ ప్రవర్తన మంచిది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో నోటీస్‌ పిరియడ్‌లో ఉద్యోగి ఎలా నడచుకోవాలో, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం రండి..

మీదైన పనితీరుతో..!

అప్పటిదాకా పనిచేస్తోన్న కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నామన్నా లేదంటే కొత్త ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో.. ప్రస్తుతం చేసే పని నుంచి దృష్టి మరలడం సహజం. ఈ క్రమంలో చేసే పనిపై ఒక రకమైన అలసత్వం ఆవహిస్తుంది. ఇది పనితనంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. దీనివల్ల సదరు సంస్థకు మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడుతుంది. అంతేకాదు.. మీ కెరీర్‌ రికార్డు పైనా ఇదో మచ్చలా ఉండిపోతుంది. అందుకే నోటీస్‌ పిరియడ్‌లో ఉన్నప్పుడు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అంతకుముందు ఎంత ఉత్సాహంగా పని పూర్తిచేసే వారో, సమయ పాలన పాటించే వారో.. ఇప్పుడూ అంతే ఉత్సాహం, ఆసక్తిని కనబర్చాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సంస్థ నుంచి బయటికి వెళ్లినా మీకు, సంస్థకు ఓ స్నేహపూర్వక బంధం కొనసాగుతుంది. భవిష్యత్తులో తిరిగి ఇదే సంస్థలోకి రావాలనుకున్నప్పుడూ మీ నిబద్ధతే మీకు ప్లస్‌ అవుతుంది.

మధ్యలో వదిలిపెట్టద్దు!

సంస్థ నుంచి బయటికి వెళ్లిపోతున్నామన్న హడావిడి, ఆనందంలో వాళ్లకు అప్పగించిన పనుల్ని మధ్యలోనే వదిలి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అయితే ఫలానా పని చేయడానికి మీరే సమర్థులు అనే నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనులు/బాధ్యతల్ని అలా వదిలి వెళ్లడం ఎంతమాత్రమూ సరికాదంటున్నారు నిపుణులు. ఒకరకంగా అలాంటి పనులు పూర్తి చేసుకోవడానికి ఈ నోటీస్‌ పిరియడ్‌ సరైన సమయమని, కాబట్టి ఈ కాలంలో మీరు వ్యక్తిగతంగా, బృందంతో కలిసి చేయాల్సిన పనుల్ని అంతే ఆసక్తి, శ్రద్ధతో పూర్తి చేయడం కెరీర్‌ పరంగా మీకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు.

ఇది హాలిడే కాదు..!

కొత్త సంస్థలోకి మారుతున్నప్పుడు.. ప్రస్తుతం పనిచేస్తోన్న కంపెనీ అందించే సెలవులు మిగిలిపోతే వాటిని ఈ నోటీస్‌ పిరియడ్‌లో విచ్చలవిడిగా వాడుకునే వారూ లేకపోలేదు. కొంతమందైతే వారాలకు వారాలు సెలవులు పెట్టి మరీ వెకేషన్లకు చెక్కేస్తుంటారు. దీనివల్ల మీరు పూర్తిచేయాల్సిన పనులు/ఇతర బాధ్యతలు పెండింగ్‌లో పడిపోతాయి. అంతేకాదు.. ఆయా పనులు పూర్తి చేసేందుకు వీలుగా కొన్ని కంపెనీలు మీ నోటీస్‌ పిరియడ్‌ కాలాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మీరు అనుకున్న సమయానికి కొత్త కంపెనీకి వెళ్లడం కుదరకపోవచ్చు. కాబట్టి మరీ అత్యవసరమైతే తప్ప ఈ కాలంలో సెలవులు పెట్టకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా సకాలంలో పనులు పూర్తవడంతో పాటు మీ పని సామర్థ్యాన్నీ నిరూపించుకోవచ్చు.

హుందాగా గుడ్‌బై చెప్పండి!

కొత్తగా కంపెనీలోకి వచ్చినప్పుడు బాస్‌తో, సహోద్యోగులతో ఎంత హుందాగా వ్యవహరిస్తారో.. కంపెనీని వీడేటప్పుడూ అంతే హుందాగా ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ బాస్‌, బృందం, ఇతర ఉద్యోగులందరికీ ఓ చిన్న ట్రీట్‌ ఏర్పాటుచేయచ్చు. ఇందులో భాగంగా కంపెనీతో మీరు పెంపొందించుకున్న అనుబంధం, నేర్చుకున్న నైపుణ్యాలు, వ్యక్తిగతంగా నేర్చుకున్న పాఠాలు.. వంటివన్నీ ఆ మీటింగ్‌లో పంచుకోండి. మీ కెరీర్‌ ఉన్నతికి దోహదం చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే మీ కింది స్థాయి ఉద్యోగులకు పనికి సంబంధించిన మెలకువలు, మీ నాలెడ్జ్‌నీ షేర్‌ చేయచ్చు. అంతేకాదు.. ఉద్యోగులు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ప్రయోజనం పొందేలా కంపెనీలో ఎలాంటి మార్పులు తీసుకురావాలని మీరు అనుకుంటున్నారో కూడా మీరు వీడబోయే కంపెనీకి వివరించచ్చు. లేదంటే హుందాగా ఓ లెటర్‌ రూపంలో మీ అనుభవాల్ని పొందుపరిచి మీ బాస్‌కి/యాజమాన్యానికి అందించచ్చు. ఇలా మీరిచ్చే సెండాఫ్‌ మీకు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగానూ ప్లస్‌ అవుతుందంటున్నారు నిపుణులు.

అలాగే కొత్త కంపెనీలోకి వెళ్లినా పాత కంపెనీ సహోద్యోగులు/బాస్‌తో టచ్‌లో ఉండడం, కెరీర్‌ పరంగా మీరు సాధిస్తోన్న విజయాలు వాళ్లతో షేర్‌ చేసుకోవడం వల్ల ఉద్యోగ పరంగా మీ సర్కిల్‌ విస్తరిస్తుంది. ఇది మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని