వ్యాక్సింగ్ ఎక్కువ రోజులు నిలవాలంటే..!

శ్రావణి ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. కాలేజీలోని అమ్మాయిలందరిలా తాను కూడా అందంగా రడీ అవుతుంది. నెలకోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఫేషియల్, వ్యాక్సింగ్‌లాంటి ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటుంది. అయినా అవాంఛిత రోమాల సమస్య మాత్రం ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంది.

Published : 04 Jan 2022 20:59 IST

శ్రావణి ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. కాలేజీలోని అమ్మాయిలందరిలా తాను కూడా అందంగా రడీ అవుతుంది. నెలకోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఫేషియల్, వ్యాక్సింగ్‌లాంటి ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటుంది. అయినా అవాంఛిత రోమాల సమస్య మాత్రం ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంది. వ్యాక్సింగ్ చేసిన కొద్దిరోజులకే తిరిగి రోమాలు వచ్చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య కేవలం శ్రావణిది మాత్రమే కాదు.. మనలో చాలామంది ఎదుర్కొనేదే.. చర్మంపై అవాంఛిత రోమాలు లేకుండా మృదువుగా కనిపించేలా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. అయితే చాలామందిలో చేయించుకున్న కొద్దిరోజులకే వెంట్రుకలు మళ్లీ పెరిగి ఇబ్బంది పెడుతుంటాయి. అలాకాకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవకుండా జాగ్రత్తపడవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా?

ఎక్స్‌ఫోలియేషన్ తప్పనిసరి..

వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వారం ముందు నుంచి చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. దాని కింద ఇరుక్కున్న వెంట్రుకలేవైనా ఉంటే అవి కూడా బయటకు వస్తాయి కాబట్టి వాటిని తొలగించడం సులభమవుతుంది. అలాగే ఈ ప్రక్రియ వల్ల చర్మంపై ఎలాంటి మురికి, మృతకణాలు ఉండకపోవడం వల్ల వెంట్రుకల్ని తొలగించడం సులువవుతుంది. దీంతో నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ మాత్రం వీలైనంత సున్నితంగా జరిగేలా జాగ్రత్తపడాలి.

ఆరోగ్యంగా ఉంటేనే..

చర్మం ఆరోగ్యంగా ఉంటే వ్యాక్సింగ్ ఫలితం ఎక్కువకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. వ్యాక్సింగ్ వల్ల చెమట బయటకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. అందుకే చర్మానికి ఎప్పుడూ మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. చర్మ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అవసరమైతే డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే రోజూ సరిపడినన్ని నీళ్లు తాగడం, పండ్లు, పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఆర్యోగంగా, నిగనిగలాడుతూ కనిపించే అవకాశం ఉంటుంది.

రెగ్యులర్‌గా..

వ్యాక్సింగ్ ప్రతి నెలా ఒక నియమిత షెడ్యూల్ ప్రకారం చేయించుకోవడం వల్ల రోమాలు ఎక్కువగా పెరగకుండా జాగ్రత్తపడవచ్చు. దీనికోసం ప్రతి నాలుగు వారాలకోసారి వ్యాక్సింగ్ చేయించుకుంటూ ఉండాలి. వ్యవధి మరీ ఎక్కువైతే వెంట్రుకలు పొడవుగా పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువైతే వ్యాక్సింగ్ చేయడానికి వీలుగా రోమాలు ఎదిగి ఉండవు కాబట్టి కొన్ని అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిర్ణీత వ్యవధిలో మాత్రమే వ్యాక్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇవీ పాటించండి..

వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితం ఎక్కువకాలం పాటు ఉంటుంది.

* వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. దీనివల్ల దుస్తులకు, చర్మానికి రాపిడి లేకుండా చూసుకోవచ్చు. ఇలా దుస్తుల రాపిడి ఉన్నట్లయితే చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

* వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత 24 గంటల పాటు ఎండలోకి వెళ్లకపోవడం మంచిది.

* వ్యాక్సింగ్ వెంటనే ఎక్సర్‌సైజ్ చేయకూడదు.

* వ్యాక్సింగ్ చేయించుకున్న రోజు స్టీమ్ బాత్, ఆవిరిపట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్