close
Published : 15/10/2021 13:56 IST

ఇరవైల్లో ఇవి చేయాల్సిందే..!

ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన వయసు ఏది? అంటే ఇరవైలని చెప్పుకోవచ్చు. 20-29 ఏళ్ల వయసును ఇరవైల వయసుగా పరిగణిస్తాం.. ఈ వయసులోనే జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. అమ్మాయిలకైతే ఇవి మరింత ఎక్కువని చెప్పుకోవచ్చు. చదువు, ఉద్యోగం, వివాహం.. మరికొందరికైతే పిల్లలు కూడా..! అందుకే ఈ వయసు చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది ఇరవైల్లో చేయాల్సిన కొన్ని పనులను మాత్రం చేయకుండా వదిలేస్తుంటారు. దీనివల్ల కాస్త వయసు పెరిగిన తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఇరవైల్లోనే చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో.. తెలుసుకుందాం రండి..

పొదుపు తప్పనిసరి..

పుట్టుకతో ఎవరికీ పొదుపనేది అబ్బదు. దాన్ని కొద్దికొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ.. అమల్లో పెడుతూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇరవైల్లోనే చాలామందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అయితే ఇప్పటి నుంచే పొదుపెందుకులే.. ముందు కాస్త ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచనతో పొదుపును పక్కన పెట్టారా? అంతే సంగతులు.. భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా ముందు నుంచి చేస్తేనే ఎక్కువ లాభాలు పొందగలుగుతాం. ఇది పొదుపు విషయంలో బాగా వర్తిస్తుంది. అందుకే ఇరవైల్లో ఉన్నప్పుడే పొదుపు చేయడం తప్పక నేర్చుకోవాలి. దీనిపైనే ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందనే విషయం ఆధారపడి ఉంటుంది.

బంధాలకు దగ్గరవుతూ..

పిల్లలకు కొత్తగా రెక్కలొచ్చేది కూడా ఇరవైల వయసులోనే. చాలామంది ఈ వయసులోనే కాలేజీలో, ఉద్యోగంలో స్థిరపడి కొత్త జీవితాన్ని చూస్తారు. దీంతో కొత్త కొత్త స్నేహాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ స్నేహాలు మనల్ని ముందుకు నడిపించేవైతే ఫర్వాలేదు. కానీ మనల్ని మనం వెళ్లే దారి నుంచి పక్కకు తోసేవైతే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులను చేసుకోగలగాలి. ఆ స్నేహితులు మీ గురించి.. మీ బలాలు, బలహీనతలు.. మంచిచెడ్డలు.. అన్నీ తెలిసినవారై ఉండాలి. అయినా.. మీకు ఎలాంటి ద్రోహం తలపెట్టకుండా ప్రతి అంశంలోనూ మీకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. కేవలం స్నేహితులతోనే కాదు.. కుటుంబ సభ్యులతోనూ మరింత దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలాగే స్నేహితులు, లేదా పని ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల బంధువులకు దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. వారితోనూ చక్కటి సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి.

వీరికి దూరమవండి..

ప్రేమ.. ఈ రోజుల్లో యూత్‌కి సర్వసాధారణంగా మారిపోయింది.. ఆ ప్రేమ మంచిదే అయితే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఒకవేళ మీకు అవతల వ్యక్తి నుంచి సమస్యలను సృష్టిస్తోంటే మాత్రం అలాంటి బంధం నుంచి దూరంగా పోవడం మంచిది. ఇలాంటి వ్యక్తులకు దూరం జరగకుండా.. పెళ్త్లెతే వారే మారతారులే.. అన్న ఉద్దేశంతో వివాహం చేసుకుంటే మాత్రం జీవితాంతం ఇబ్బంది పడాల్సింది మీరేనని గుర్తుంచుకోండి.. అందుకే ఇలాంటి బంధాల నుంచి వీలైనంత త్వరగా దూరమవ్వాలి. అంతేకాదు.. విడిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలను కూడా వీలైనంత తొందరగా మనసులోంచి తీసేసే ప్రయత్నం చేయాలి. అయితే ఇలాంటి బంధం నుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు.

డబ్బుతో పాటు ఆసక్తి కూడా..

చాలామందికి ఇరవైల్లో ఉన్నప్పుడు తమకు ఇష్టం ఉన్న రంగంలోకి అడుగు పెట్టాలా? లేక డబ్బు ఎక్కువగా సంపాదించగలిగే రంగంలోకి వెళ్లాలా? అన్న సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇందులో ఎక్కువమంది డబ్బుకే ఓటేస్తుంటారు. కానీ డబ్బు వస్తుంది కదా.. అని ఇప్పుడు ఆ కెరీర్ ప్రారంభించినా.. ముప్ఫైలకు చేరే సమయానికి అది మనల్ని ఇబ్బందిపెడుతుంది. ఇష్టం లేని పని చేస్తున్నామనే ఆలోచన మనల్ని ఆ పనిలో ఎదగనివ్వదు. ఎదుగుదల లేని ఉద్యోగం చేయాలనిపించక జీవితం నరకంగా మారుతుంది. అయితే డబ్బు లేకుండా కేవలం మీకు ఇష్టం అని చెప్పి మరో రంగంలోకి వెళ్తే జీవితంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ తర్వాత ఈ ఆలోచన వెర్రితనంగా తోస్తుంది. అందుకే మీకు ఇష్టముండి, ఆ రంగంలో పనిచేయాలనే తపన ఉండి.. సరిపడా డబ్బు అందించే రంగాన్ని ఎంచుకోండి. అప్పుడు జీవితాంతం హాయిగా పనిచేసేందుకు వీలుంటుంది.

చూశారుగా.. ఇరవైల్లో తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పనులేంటో.. వీటితో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, జీవితాన్ని ఆస్వాదించడం.. వంటివి కూడా ఈ వయసులో చేయాల్సిందే..!


Advertisement

మరిన్ని