Updated : 07/06/2022 18:01 IST

Social Media: స్నేహం ముసుగులో కాటేస్తారు.. జాగ్రత్త!

భాగ్యనగరంలో రోజుకో అత్యాచార సంఘటన వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలో మరో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్ పరిచయమే కారణంగా తెలుస్తోంది. బాధిత బాలికతో ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. ఆ తర్వాత వీడియోలు తిరిగి ఇస్తామని పిలిచి స్నేహితులతో కలిసి మరోమారు దారుణానికి పాల్పడ్డారు. దాంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌కు గురైంది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిలు సామాజిక మాధ్యమాలపై  మరింత అవగాహన పెంచుకుని, ఈ వేదికల ద్వారా ఏర్పడే స్నేహాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.

సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్ చేయడం.. స్నేహితులతో చాటింగ్ చేయడం.. తమ అభిప్రాయాలను పంచుకోవడం.. మొదలైనవి ఈ రోజుల్లో చాలా కామన్. అయితే ఈక్రమంలో కొంతమంది అమ్మాయిలు తమకు తెలియని వ్యక్తులతో సైతం పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. అది కాస్తా ఆకర్షణగా మారిపోతోంది. అయితే ప్రేమకి, ఆకర్షణకి మధ్య ఉన్న సన్నని తెరలాంటి తేడాను గమనించకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొందరైతే ప్రాణాలనే కోల్పోతున్నారు.

జాగ్రత్తగా ఉండాల్సిందే!

ఒంటరితనం, అనారోగ్యం, ఇంటి సమస్యలు, ప్రేమలో మోసపోవడం, కుటుంబ సభ్యులపై వ్యతిరేకత.. వంటి సమస్యలన్నీ సామాజిక మాధ్యమాల్లో పంచుకునే యువత, మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివారు ఇతరుల నుంచి సాంత్వన, ఓదార్పు, ప్రేమ కోరుకుంటారు. ఈ క్రమంలో సులువుగా ఆకతాయిల బారిన పడతారు. వారు చెప్పే ఓదార్పు మాటలకు కరిగిపోతారు. అనుబంధాలు, భావోద్వేగాల నుంచి బయటపడలేనంతగా వారికి దగ్గరవుతారు. వీరిలో వివాహితులు కూడా ఉండొచ్చు. ఈ బంధాలు చివరికి వివిధ నేరాలకు, ఘోరాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

అభిరుచులు ఒకేలా ఉన్నాయని..

సామాజిక మాధ్యమాల్లో ఒకే తరహా అభిరుచులు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు తారసపడటం అంత వింత విషయం ఏమీ కాదు. అయితే ఇక్కడే చాలామంది అమ్మాయిలు బోల్తా పడుతున్నారు. అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయన్న కారణంతో ముక్కూ, మొహం తెలియని వారిని సైతం తమ స్నేహితుల జాబితాలో చేర్చుకుంటున్నారు. ఇలా చేసేటప్పుడు చాలామంది వారి ప్రొఫైల్‌ని చెక్ చేస్తున్నామని చెబుతూ ఉంటారు. కానీ నాలుగైదు పోస్టులు చూసి వారి గురించి ఒక నిర్ధరణకు వచ్చేస్తుంటారు. దీంతో తెలియకుండా మనమే కొంతమంది దుర్మార్గులకు మనకు సంబంధించిన విషయాలను తెలుసుకొనే అవకాశం కల్పిస్తున్నాం. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎవరినైనా ఫ్రెండ్స్‌గా అంగీకరించాలంటే ముందు వారి ప్రొఫైల్ మొత్తం చదవాలి. అంతటితో సరిపెట్టుకోకుండా.. వారి టైమ్‌లైన్ మొత్తం చెక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వారి అభిరుచులు తెలుసుకోవడంతో పాటు వారి వ్యక్తిత్వంపై ఓ అంచనాకు వస్తాం. ఆ తర్వాతే మన స్నేహితులుగా చేర్చుకోవాలా? వద్దా? అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం ఇబ్బందుల్లో పడకుండా ఉంటాం. అసలు నిజ జీవితంలో తెలియనివారిని సోషల్ మీడియాలో స్నేహితులుగా చేసుకోవడం మానేస్తే ఏ గొడవా ఉండదు.

వాళ్ల ఓదార్పు వద్దు...

అలాగే బాయ్ ఫ్రెండ్, భర్త, ఇతర కుటుంబ సభ్యులతో ఉండే మనస్పర్థలను దృష్టిలో పెట్టుకుని, వారికి వ్యతిరేకంగా పోస్టులు, స్టేటస్‌లు పెట్టకూడదు. గొడవలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలి. అంతేకానీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. తాత్కాలిక ఆనందం, ఇతరుల ఓదార్పు కోసం తాపత్రయపడొద్దు.

అలాగే చాలామంది మహిళలు తమది సున్నిత మనస్తత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా కాకుండా వాస్తవిక ధోరణితో ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలతో ఎక్కువ సమయం వృథా చేస్తున్నామనిపిస్తే.. ఇతర విషయాల వైపు దృష్టి మళ్లించాలి. అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఆకతాయిల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలి.

అలాంటి ఫొటోలు వద్దే వద్దు...

సోషల్‌ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిగత ఫొటోలు, అసభ్యకరమైన పోస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయద్దు. మీరు మాధ్యమాల్లో పంచుకునే ఫొటోలకు వచ్చే లైకులు తాత్కాలికంగా ఆనందం కలిగించొచ్చు. కానీ అవి దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే నగలు, డబ్బు, ఇతర ఆర్థిక వివరాలు, ఆస్తిపాస్తులకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం మానుకోవాలి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలూ పంచుకోకూడదు.

వాళ్ల అసలు ఉద్దేశమేంటి?

మాధ్యమాల్లో.. ఒక వ్యక్తి దురుద్దేశంతో మీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా స్నేహంతో, చనువుతో సన్నిహితంగా మాట్లాడుతున్నాడా అనేది బేరీజు వేసుకోవాలి. అనుమానం వస్తే దూరంగా ఉంచాలి. కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఏకాంత ప్రదేశాల్లో ఇలాంటి వారిని కలవడం ఎంతమాత్రం మంచిది కాదు.

వీడియో కాల్స్ విషయంలో జాగ్రత్త!

సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసేవారు.. స్నేహితులతో సాధారణ విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. సన్నిహితంగా చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్లను బహిరంగపరిచి, అవమానించడం కష్టమైన పని కాదు. అందుకే.. చాటింగ్ లో అవతలి వ్యక్తి హద్దు మీరుతున్నాడని అనుమానం వచ్చిన మరుక్షణమే ఆ ఖాతాను బ్లాక్‌ చేయాలి. అలాగే అత్యవసరమైతేనే వీడియో కాల్స్‌ మాట్లాడాలి. ఇప్పుడు వస్తున్న ఫోన్లలో స్క్రీన్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌తో వీడియో కాల్స్‌నూ రికార్డు చేయొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీడియో కాల్‌లో అసభ్యకరంగా ప్రవర్తించడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం.. వంటి వాటికి పూర్తి దూరంగా ఉండాలి.

ఇతరులపై ఆధారపడద్దు..

మానసికంగా, భావోద్వేగాల పరంగా ఇతరులపై ఆధారపడే గుణాన్ని తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్యలను సోషల్‌ మీడియాలో పెట్టి సానుభూతి సంపాదించాలనే ఉద్దేశం కొంతమందికి ఉండొచ్చు. కానీ అది సానుభూతి నుంచి ఓదార్పు, సాంత్వన, స్నేహం.. ఇలా మరింత దూరం వెళ్లే అవకాశం ఉందని గ్రహించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని