'ఆకాశమంత' సంతోషమిద్దాం..!

పిల్లల అవసరాలను తీర్చి వారిని ప్రయోజకులుగా చేయడమే తన కర్తవ్యంగా భావిస్తాడు తండ్రి. పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ఎంత కష్టమైనా ఓర్చుకుంటాడు. తాను పడుతున్న ఇబ్బందులు తన కంటిపాపలకు తెలియకూడదనుకుంటాడు. ఎంతటి ఆపద ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. జీవితంలో ఆయన చూసినన్ని ఒడిదొడుకులు ఇంకెవరూ చూసి ఉండకపోవచ్చు.

Updated : 19 Jun 2021 18:53 IST

మన జీవితాన్ని నిలబెడతాడనే గట్టి 'నమ్మకం'..
ఆపదలో వెన్నంటే ఉంటాడనే 'ధైర్యం'..
అడగకుండానే అవసరం తీరుస్తాడనే 'భరోసా'..
తప్పు చేస్తే దండిస్తాడన్న 'భయం'..
హద్దుల్లో ఉండేలా చేసే 'క్రమశిక్షణ'..
ఇవన్నీ కలిస్తే 'నాన్న'.

పిల్లల అవసరాలను తీర్చి వారిని ప్రయోజకులుగా చేయడమే తన కర్తవ్యంగా భావిస్తాడు తండ్రి. పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ఎంత కష్టమైనా ఓర్చుకుంటాడు. తాను పడుతున్న ఇబ్బందులు తన కంటిపాపలకు తెలియకూడదనుకుంటాడు. ఎంతటి ఆపద ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. జీవితంలో ఆయన చూసినన్ని ఒడిదొడుకులు ఇంకెవరూ చూసి ఉండకపోవచ్చు. అందుకే నాన్నే మనకి హీరో..! అలాంటి నాన్నని గౌరవించడానికే ఏటా జూన్ మూడో ఆదివారాన్ని ‘అంతర్జాతీయ పితృ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. ఈ క్రమంలో ఆ రోజున నాన్నకు ఆకాశమంత సంతోషాన్ని కలిగించాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..
ఇష్టమైన వ్యాపకంతో..
పొద్దున్నే లేచి కాఫీ / టీ తాగుతూ పేపర్ చదవడం.. జాగింగ్‌కి వెళ్లడం.. పొలంలో పనులు చేయడానికి ఉపక్రమించడం.. ఇలా ఉదయాన్నే లేచి ఏదో ఒకటి చేయడం నాన్నకి అలవాటుగా ఉండచ్చు. ఆ సమయంలో మీరు వారితో గడిపే కొన్ని క్షణాలైనా సరే రోజంతా వారిలో ఉత్సాహాన్ని నింపుతాయి. అందుకే ఉదయాన్నే నాన్న చేతికి పేపర్ అందించి, మీ చేతులతో చక్కటి కాఫీ లేదా టీ తయారు చేసివ్వండి. నాన్న జాగింగ్‌కి వెళ్తుంటే షూ అందించి మీరు కూడా ఆయనతో పాటు తోడు వెళ్లండి. లేదా పొలం పనుల్లో నాన్నకి సాయం చేయండి. ఈ సమయంలో మీరు నాన్నతో ఎన్నో విషయాలు పంచుకోవచ్చు. అంతే.. నా కూతురు ఇంత ఎదిగిపోయిందా? అని నాన్న మురిసిపోతారంటే నమ్మండి..!


చెప్పకుండానే..
ఏ తండ్రీ తాను చేస్తున్న పనిలో పిల్లల సాయాన్ని కోరుకోడు. కానీ వారు బాధ్యత తెలుసుకోవాలనే ఉద్దేశంతో 'ఆ పని చూడు.. ఈ పని చెయ్' అని చెబుతూ ఉంటారు. రోజూ నాన్న చెబితేనే గానీ ఆ పని చేసే అలవాటు చాలామందికి ఉండదు. కానీ ఆ రోజు నాన్నను పూర్తిగా సంతోషంగా చూడటమే మీ బాధ్యత. అందుకే నాన్న చెప్పక ముందే అటువంటి పనులన్నీ పూర్తి చేసేయండి. దీంతో ఆయన మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంకా నాన్న మనసు గాల్లో తేలేలా చేయాలంటే.. ఈ రోజు స్వయంగా మీరే వంట చేసి నాన్నకు వడ్డించండి. దీంతో నా కూతురు ఎంత పెద్దదయిపోయిందో అని తెగ ఆనందపడిపోతారు. మీకు వంట సరిగ్గా రాకపోతే మాత్రం అమ్మ సాయం తీసుకోవడం మరచిపోకండేం.!
నచ్చిన పని చేస్తూ..
నాన్నకి ఎన్ని బహుమతులు ఇచ్చినా కలగని ఆనందం.. మీరు వారికి నచ్చిన పని చేస్తే కలుగుతుంది. మిమ్మల్ని ఏ విషయంలో ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తారో ఆ పని మీరు ఆ రోజు చేయండి. నాన్న కళ్లలో కనిపించే సంతోషం మీకు ఎంతో తృప్తినిస్తుంది. అప్పటి వరకు మీకు ఆ పని మీద ఇష్టం లేకపోయినా సరే దాని మీద ప్రేమ కలుగుతుంది.


కుటుంబంతో సరదాగా..
పని ఒత్తిడి వల్ల నాన్న కుటుంబంతో సరిగ్గా సమయం గడపలేకపోవచ్చు. తన భార్యాపిల్లలకు ఏ విషయంలోనూ లోటు చేయకూడదనే ఆలోచనతో నిరంతరం కష్టపడుతూ ఉండచ్చు. అందుకే వారికి ఆ రోజు కాస్త విశ్రాంతి కల్పించండి. కుటుంబ సభ్యులందరితో కలసి రోజంతా సరదాగా గడిపేలా ప్లాన్ చేయండి. నాన్నకు నచ్చిన సినిమాలు చూపించడమో, పాటలు వినిపించడమో చేయండి. నాన్నతో కలిసి ఆడుకోండి. మీ చిన్నప్పుడు మీరంతా కలిసి దిగిన ఫొటోలను చూపించి వాటి గురించి నాన్ననే వివరించమని చెప్పండి. 'చాల్లే..' అని ముద్దుగా కసురుకున్నా, తన కుటుంబంతో గడిపిన అప్పటి తియ్యటి జ్ఞాపకాల గురించి, మీ చిన్నప్పటి ముచ్చట్ల గురించి సంతోషంగా చెప్పడం మొదలుపెడతారు. అంతేకాదు.. తనను, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలన్న మీ తపన చూసి నాన్న గర్వంతో ఉప్పొంగిపోతారు.
భరోసానివ్వండి..
వీటన్నింటికంటే నాన్నకి ఎక్కువ సంతోషాన్నిచ్చేదేంటో తెలుసా? అన్ని విషయాల్లోనూ మనం బాధ్యతగా మెలగడమే. బాగా చదువుకుంటూ, కెరీర్లో ముందుకెడుతూ; ఈ పాటికే పెళ్లైపోతే మన పిల్లల్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ మనం బాధ్యతగా ఉండగలిగితే అంతకు మించిన ఆనందం ఆయనకు ఇంకొకటి ఉండదు.

తన తర్వాత కూడా తన కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే నాన్న తన శక్తికి మించి కష్టపడతాడు. మనం కూడా ఆయన బాధ్యతల్లో పాలుపంచుకుంటుంటే అది చూసి ఆయన నిశ్చింతగా ఉంటారు. అందుకే మీ వంతుగా మీ కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నారో.. నాన్నకు వివరించండి. కుటుంబం మీద ప్రేమ, వారి భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు విని ఆయనకు ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలుగుతుంది.

నాన్న విషయంలో మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేసిన తర్వాతే పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి. ఎందుకంటే పొద్దున్నే లేచి 'హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా' అని చెప్పిన సందర్భంలో కంటే.. ఇవన్నీ చేశాక చెబితే కలిగే సంతోషం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి, ఆ ఆనందాన్ని నాన్నకు తప్పకుండా అందిస్తారు కదూ..!

ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకోండి.. అలాగే మీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే అందమైన ఫొటోల్ని contactus@vasundhara.net కు మెయిల్‌ చేయండి. ‘ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం.
హ్యాపీ ఫాదర్స్‌ డే!

 

అభిప్రాయాలను పంచుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్