close
Published : 23/06/2021 20:29 IST

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

వంట గది సౌకర్యవంతంగా ఉంటే పనులన్నీ సాఫీగా సాగిపోతాయన్న విషయం మనందరికీ తెలిసిందే.. అందుకే దాన్ని వీలైనంత సౌకర్యవంతంగా ఉంచుకునేందుకే మహిళలు ప్రాధాన్యమిస్తుంటారు. ఇలాంటివారు మాడ్యులర్ కిచెన్స్ నిర్మించుకొనేటప్పుడు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే కిచెన్ అధునాతనంగా కనిపించినా పని చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.

ఎలక్ట్రిక్ కనెక్షన్స్..

వంటగదిలో ప్రస్తుతం గ్రైండర్, ఒవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం మామూలైపోయింది. కాబట్టి ఇలాంటి పరికరాలు వినియోగించడానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఏ వస్తువును ఎక్కడ ఉంచాలనుకొంటున్నారో ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి. లేదా మీ వద్ద ఉన్న, మీరు కొనాలనుకుంటున్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ గురించి ఇంటీరియర్ ఎక్స్‌పర్ట్‌కి ముందుగానే తెలియజేయాలి. ఫలితంగా వాటిని ఉపయోగించేందుకు వీలుగా కనెక్షన్స్ ఏర్పాటు చేస్తారు.

వెలుతురు ప్రసరించేలా..

వంటగదిలోకి సహజసిద్ధమైన వెలుతురు రావడం చాలా అవసరం. అలాగే గాలి కూడా బయటకు వెళ్లేలా ఏర్పాట్లుండాలి. కిటికీలు ఉన్న ప్రాంతంలో సింక్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వీలైతే ఆ కిటీకీలలో చిన్న చిన్న మొక్కలను పెట్టి చూడండి. అందంగా కనిపించడంతోపాటు లోపలికి తాజా గాలి ప్రసరించేలా చేస్తాయి. ఇక వంటగదిలోని పొగలు, ఘాటు వాసనలు ఎప్పటికప్పుడు బయటకు పోవడానికి కిటికీ తలుపులు తీసి ఉంచడంతోపాటు చిమ్నీ కూడా బిగించుకోవాలి.

సర్దుకోవడానికి వీలుగా..

వంటగదిలో రకరకాల పాత్రలు, స్పూన్లు, గరిటెల వంటివి ఉపయోగించడం మామూలే! మాడ్యులర్ కిచెన్స్ నిర్మించుకునేటప్పుడు వీటన్నింటినీ భద్రపరుచుకోవడానికి వీలుగా డ్రాయర్లను అమర్చుకోవాలి. వీటిలో రకరకాల చాకులు, స్పూన్‌లు, గరిటెలు.. మొదలైనవన్నీ వేటికవి విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరికే వీలుంటుంది. అయితే కేవలం ఇలా ర్యాక్స్‌ని అమర్చుకుంటేనే సరిపోదు.. వస్తువులను దేనికది విడదీసి దానికోసం కేటాయించిన స్థలంలోనే అమర్చడం కూడా తప్పనిసరి..

సరుకులు భద్రంగా..

సాధారణంగా ఇంటి అవసరాలకు సరిపడా సరుకులన్నింటినీ మనం నెలకోసారి కొనుగోలు చేస్తుంటాం. అందుకే ఆ సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మరా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. సరుకులను విడివిడిగా సీసాల్లో నింపి వీటిలో పొందిగ్గా సర్దుకోవడం ద్వారా వంటగది నీట్‌గా కనిపించేలా జాగ్రత్తపడచ్చు.

ప్రకాశవంతమైన రంగులు..

వంట గదిలో ఉపయోగించే ఇంటీరియర్స్, గోడకు వేసే పెయింటింగ్స్ రంగులు ప్రకాశవంతంగా ఉండేవే ఎంపిక చేసుకోవాలి. వంటగది కోసం ముదురు రంగులను అస్సలు ఉపయోగించకూడదు. వీటి కారణంగా సహజసిద్ధమైన వెలుతురు తగ్గిపోవడం మాత్రమే కాదు.. ఈ రంగులు గది చీకటిగా కనిపించేలా చేస్తాయి.

చూడచక్కని ఫ్లోరింగ్..

మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఫ్లోరింగ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అభిరుచికి తగినట్లుగా టైల్స్ లేదా వుడెన్ ఫ్లోరింగ్.. వంటివి ప్రయత్నించవచ్చు. అయితే ఫ్లోరింగ్ విషయంలో కూడా శుభ్రం చేయడానికి సౌకర్యవంతంగా ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఇంటిని శుభ్రం చేసేయచ్చు.

చూశారుగా.. మాడ్యులర్ కిచెన్ నిర్మించుకోవాలనుకున్నప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలేంటో! మీరు కూడా వీటిని గుర్తు పెట్టుకోండి. మోడ్రన్ అండ్ స్త్టెలిష్ కిచెన్‌తో ఇంటి అందాన్ని పెంచేయండి.


Advertisement

మరిన్ని