Published : 18/12/2022 11:56 IST

లూఫా వాడుతున్నారా?

మృతకణాల్ని, పొడిబారిపోయి పొలుసులుగా మారిన చర్మాన్ని తొలగించుకొని మృదుత్వాన్ని సొంతం చేసుకోవడానికి రోజూ స్నానం చేసే క్రమంలో లూఫా వాడడం చాలామందికి అలవాటు. అయితే దీన్ని ఉపయోగించడంతోనే సరిపోదు.. లూఫా శుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు చర్మ సమస్యలు తప్పవంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఇంతకీ లూఫా రోజూ వాడచ్చా? దీన్ని వాడే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి? తెలుసుకుందాం రండి..

బాడీవాష్‌ లేదా సబ్బును శరీరానికి అప్లై చేసుకొని లూఫాతో రుద్దుకొని మరీ స్నానం చేస్తుంటారు చాలామంది. తద్వారా చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్‌, సింథటిక్‌, ఇతర సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన లూఫాలు ప్రస్తుతం బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే మనం వాడేది ఎలాంటి లూఫా అయినా సరే.. దాని పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

8 వారాలు చాలు!

లూఫాతో ఒళ్లు రుద్దుకోవడం, పని పూర్తయ్యాక దాన్ని బాత్‌రూమ్‌లోనే పైపైన శుభ్రం చేసి అక్కడే హ్యాంగర్‌కు తగిలించడం చాలామంది చేసే పనే! అయితే అప్పటికే తడిగా ఉన్న లూఫాను చుట్టూ తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మొటిమలు, ఇతర సౌందర్య సమస్యలకు ఇదే మూలకారణం కావచ్చని చెబుతున్నారు. అందుకే దాన్ని వాడిన వెంటనే శుభ్రపరిచి.. ఎండలో ఉంచడం మంచిది. అలాగని ఒకే లూఫాను నెలల తరబడి వాడినా ఇలాంటి సమస్యలు తప్పవట. కాబట్టి ఎనిమిది వారాల తర్వాత లూఫాను మార్చడం తప్పనిసరి.. అలాగే సింథటిక్‌ లూఫా అయితే రెండు నెలల దాకా వాడుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యలోనే లూఫా నుంచి దుర్వాసన రావడం, రంగు మారడం.. వంటివి గమనిస్తే వెనువెంటనే దాన్ని మార్చేయడం ఉత్తమం.

ఏ లూఫా ఎలా శుభ్రపరచాలి?

లూఫాను శుభ్రం చేయడానికీ ఓ పద్ధతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక ద్రావణాలను ఉపయోగించచ్చని చెబుతున్నారు.

⚛ వాడిన లూఫాపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచ్‌ కలిపిన నీటిలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై చల్లటి నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి.

⚛ గోరువెచ్చటి నీటిలో ఏదైనా అత్యవసర నూనె వేసి ఆ నీటితోనూ లూఫాను శుభ్రపరచచ్చు.

⚛ ఇక సింథటిక్‌ లూఫాలను అవెన్‌లో పెట్టి రెండు నిమిషాల పాటు వేడి చేసినా సరిపోతుంది. అయితే వీటిలో ప్లాస్టిక్‌/లోహాలతో తయారుచేసిన భాగాలు లేకుండా చూసుకోవాలి.

ఇలా ఏ లూఫాలనైనా వారానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రపరిస్తే దానివల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

వాళ్లు వాడకూడదు!

ఏ సౌందర్య ఉత్పత్తైనా, సాధనాలైనా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. లూఫా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అయితే అది ఎంత మృదువుగా ఉన్నప్పటికీ సున్నితమైన చర్మతత్వం ఉన్న వారు లూఫా వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు, వాపు రావడం.. వంటి సమస్యలొస్తాయి. అలాగే చర్మం పొడిబారడం, పొలుసులుగా మారడం కూడా చర్మ సంరక్షణకు పెను సవాలుగా మారతాయి. కాబట్టి సున్నిత చర్మం గల వారు లూఫాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ వాడాలనిపిస్తే.. తరచూ కాకుండా వారానికోసారి లేదంటే నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో వాడడం ఉత్తమం.

ప్రత్యామ్నాయం ఉత్తమం!

మృతకణాల్ని తొలగించుకోవడానికే పదే పదే లూఫా వాడుతుంటారు కొంతమంది. కానీ దీన్ని అప్పుడప్పుడూ వాడుతూ.. మరికొన్నిసార్లు దీనికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం వల్ల చర్మ సంరక్షణను మరింత ప్రభావవంతంగా బ్యాలన్స్‌ చేయచ్చంటున్నారు. ఈ క్రమంలో బయట దొరికే సహజసిద్ధమైన బాడీవాష్‌లు, స్క్రబ్‌లతో పాటు ఇంట్లో కూడా విభిన్న రకాల స్క్రబ్‌లను తయారుచేసుకోవచ్చు. కాఫీ స్క్రబ్‌, షుగర్‌ స్క్రబ్‌, అత్యవసర నూనెలు, ఉప్పుతో తయారుచేసినవి.. ఇవన్నీ అటు చర్మ సంరక్షణకు ఉపయోగపడుతూనే.. ఇటు చర్మంపై ఉండే మృతకణాల్ని సమర్థంగా తొలగిస్తాయి.

సో.. లూఫా వాడాలనుకున్న వాళ్లు దాని శుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం, నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని అర్ధమవుతోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని