గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?
అవాంఛిత గర్భాన్ని నివారించాలంటే.. ప్రస్తుతం వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటి వాడకంతో అవాంఛిత గర్భం రాకుండా దాదాపు 91 శాతం నిలువరించవచ్చని....
అవాంఛిత గర్భాన్ని నివారించాలంటే.. ప్రస్తుతం వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటి వాడకంతో అవాంఛిత గర్భం రాకుండా దాదాపు 91 శాతం నిలువరించవచ్చని ‘ఆహార-ఔషధ నిర్వహణ మండలి (FDA)’ చెబుతోంది. అయితే చాలామంది విషయంలో ఇవి సమర్థంగా పనిచేసినప్పటికీ.. కొంతమందిలో మాత్రం పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని వాడే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. మరి అవేమిటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
రోజుకొకటి చొప్పున..!
కాంట్రాసెప్టివ్ పిల్స్.. నోటి ద్వారా తీసుకునే మాత్రలివి. వీటిలో కొద్ది మోతాదులో హార్మోన్లు ఉంటాయి. వీటిలో కొన్ని రకాల మాత్రలు అండం విడుదల కాకుండా చేసి.. అవాంఛిత గర్భం రాకుండా అడ్డుకుంటాయి.. మరికొన్ని రకాల గర్భనిరోధక మాత్రలు గర్భాశయ పొరలో తాత్కాలిక మార్పులకు కారణమై.. తద్వారా అండం ఫలదీకరణం చెందకుండా అడ్డుకుంటాయి. వీటిని రోజుకొకటి చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మాత్రకు మాత్రకు మధ్య 24 గంటల వ్యవధితో.. నిర్ణీత సమయంలో వేసుకుంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు.
ఎవరికి ఏవి నప్పుతాయి?
గర్భనిరోధక మాత్రల్లో రెండు రకాలుంటాయి.
1. కాంబినేషన్ పిల్స్ - వీటిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్.. రెండు హార్మోన్లుంటాయి.
2. ప్రొజెస్టిన్-ఓన్లీ పిల్స్ - వీటినే మినీ పిల్స్ అని కూడా అంటారు. ఈ మాత్రల్లో ప్రొజెస్టిరాన్ హార్మోన్లు మాత్రమే ఉంటాయి.
అయితే ఈ రెండు రకాల మాత్రలు అందరికీ సూటవ్వవంటున్నారు నిపుణులు. వారి వారి ఆరోగ్య స్థితి, ఇతర శారీరక పరిస్థితుల్ని బట్టి వైద్యుల సలహా మేరకు తమకు నప్పే గర్భనిరోధక మాత్రను ఎంచుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు.
⚛ నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు ప్రొజెస్టిన్-ఓన్లీ పిల్స్‌ని ఎంచుకుంటే.. అటు బ్లీడింగ్ అదుపులో ఉండడంతో పాటు.. ఇటు గర్భం రాకుండానూ నివారించుకోవచ్చట!
⚛ పాలిచ్చే తల్లులు సహజంగానే గర్భం ధరించే అవకాశాలు తక్కువంటున్నారు నిపుణులు. అయితే గర్భనిరోధక మాత్రనే ఎంచుకోవాలనుకునే వారికి మినీ పిల్ సూటవుతుందని చెబుతున్నారు. దీనివల్ల తల్లిపాల ఉత్పత్తిపై ప్రభావం పడకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు.
⚛ గుండె సంబంధిత సమస్యలు, రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్న వారు ప్రొజెస్టిన్-ఓన్లీ మాత్రలు ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ పలు రకాల క్యాన్సర్లు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడే వారు.. యాంటీబయాటిక్స్/మూలికా సంబంధిత మందులు వాడే వారు గర్భనిరోధక మాత్రలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డాక్టర్‌ను సంప్రదించి.. ఇతర మార్గాల్ని ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు.
దుష్ప్రభావాలూ ఉంటాయట!
అన్ని గర్భనిరోధక పద్ధతుల్లోకెల్లా మాత్రలే సమర్థమైన ఫలితాలనిస్తాయంటున్నారు నిపుణులు. డాక్టర్ సూచనల మేరకు వీటిని నిర్ణీత వ్యధుల్లో వేసుకోవడం వల్ల.. 91 శాతం గర్భం రాకుండా అడ్డుకోవచ్చని FDA చెబుతోంది. అయితే వీటిని డోసును బట్టి వేసుకున్నా/మోతాదుకు మించి వాడినా కొంతమందిలో కొన్ని రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
⚛ అవాంఛిత గర్భాన్ని నివారించడమే కాదు.. ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యకూ చెక్ పెడతాయి ఈ మాత్రలు. అయితే ఈ సమస్యతో ఇబ్బంది పడుతోన్న టీనేజీ అమ్మాయిలు వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉండచ్చంటున్నారు నిపుణులు.
⚛ ఈ మాత్రల వల్ల కొంతమందిలో నెలసరికి, నెలసరికి మధ్య స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుందట! అది కూడా గోధుమ రంగులో లేదంటే సాధారణ బ్లీడింగ్ కావచ్చంటున్నారు నిపుణులు.
⚛ ఈ మాత్రలు బరువు పెరిగేందుకు కారణమవుతున్నట్లు మరికొంతమంది చెబుతుంటారు. అయితే ఇది కొంతవరకు నిజమే అయినా.. ఇంకా దీనిపై లోతుగా పరిశోధనలు జరపాలంటున్నారు నిపుణులు.
⚛ మరికొంతమందిలో నెలసరి సమయంలో మునుపటి కంటే రక్తస్రావం తక్కువవడం/ఎక్కువవడం లేదంటే పూర్తిగా ఆ నెల పిరియడ్ మిస్సవడం.. వంటివీ ఈ మాత్రల దుష్ప్రభావాల్లో భాగమేనట!
⚛ కంటి సమస్యలు, రక్తం గడ్డ కట్టడం, వికారం, తలనొప్పి.. వంటివీ కొంతమందిలో కనిపిస్తాయట!
⚛ పొత్తి కడుపులో-వక్షోజాల్లో నొప్పి, లైంగిక కోరికలు తగ్గిపోవడం.. మొదలైన లక్షణాలూ ఈ మాత్రల వాడకం వల్ల కొంతమందిలో గమనించచ్చంటున్నారు నిపుణులు.
పిల్.. మిస్సయితే..?
గర్భనిరోధక మాత్రల్ని కచ్చితంగా వాడితే ఎంత సమర్థంగా పనిచేస్తాయో.. మర్చిపోయి/నిర్లక్ష్యం చేస్తే.. గర్భం ధరించే అవకాశాలు అంతగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. వాడే మాత్రను బట్టి అంటే.. ప్రొజెస్టిన్-ఓన్లీ పిల్ అయితే.. మాత్ర వేసుకుని రోజు దాటాక 3 గంటల్లోపు వేసుకోవాలి.. అదే కాంబినేషన్ పిల్ అయితే.. మాత్ర వేసుకుని రోజు దాటాక 12 గంటల్లోపు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి కేవలం గర్భధారణనే అడ్డుకుంటాయని, లైంగిక సంక్రమణ వ్యాధులు రాకుండా ఇవి ఎలాంటి ప్రభావం చూపలేవని నిపుణులు చెబుతున్నారు. ఇక మాత్రలు ఆపేసిన తర్వాత కొంతమంది 1-3 నెలల్లో, మరికొంతమంది ఏడాది లోపు గర్భం ధరించే అవకాశాలుంటాయట! అయితే.. చాలామందిలో వీటిని ఎన్నాళ్ల పాటు వాడచ్చన్న సందేహం ఉంటుంది. ఈ క్రమంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నాళ్ల పాటు మాత్రలు వేసుకోవచ్చో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఈ పిల్స్ వాడే క్రమంలో ఇతర దుష్ప్రభావాలేవైనా తలెత్తితే.. వెంటనే వీటిని ఆపేసి డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
గమనిక :
వివిధ నివేదికలు / అధ్యయనాల్లో వెల్లడైన అంశాల ఆధారంగా ఇది కేవలం గర్భనిరోధక మాత్రల వినియోగానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రమే. వీటి వాడకం వల్ల కలిగే ఫలితాలు, తలెత్తే దుష్ప్రభావాలు... మొదలైనవన్నీ వ్యక్తికీ వ్యక్తికీ మారే అవకాశం ఉండచ్చు. అందువల్ల వీటి వాడకం విషయంలో వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.