సొంత ఇంటి ప్లానింగ్‌లో ఇవి తప్పనిసరి..!

సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ...

Published : 01 Jun 2023 19:02 IST

సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావల్సిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత, ఇల్లు కట్టాలన్న ఆలోచన రాగానే ఆర్కిటెక్ట్‌తో మాట్లాడటానికి వెళ్తారు చాలామంది. కానీ ప్లానింగ్‌లో లోపాలు, ఆర్కిటెక్ట్‌తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యేవారు ఎందరో. అందుకే ఆర్కిటెక్ట్‌తో మాట్లాడే ముందు కొన్ని విషయాలలో అవగాహన, స్పష్టత అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ఇల్లు.. మీ సంప్రదాయం..!

చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన రాగానే వాస్తు పండితులను సంప్రదిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ఆర్కిటెక్ట్ లేదా బిల్డర్ సలహా మేరకు వాస్తు పండితుల సూచనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించుకోడానికి సిద్ధపడతారు. తీరా ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఏదైనా చిన్న అపశకునం కనబడినా... వాస్తు పాటించనందుకే ఇలా జరిగిందంటూ మథనపడతారు. అలా జరగకుండా ఉండాలంటే వాస్తు పట్ల మీకు మీ నమ్మకం ఎంత ముఖ్యమో ముందే ఆర్కిటెక్ట్‌కి తెలియజేయండి. అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టండి. ఇందులో ఎటువంటి మొహమాటమూ అవసరం లేదు.

వాళ్ల అభిప్రాయమూ అవసరమే..

కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, త్వరలో కొత్తగా కుటుంబంలోకి ఎంతమంది చేరే అవకాశం ఉందో లెక్కించండి. పెళ్లి చేసుకోబోయే వారు లేదా కొత్తగా పెళ్త్లె పిల్లల కోసం ఆశిస్తున్న వారు రాబోయే వారిని కూడా లెక్కించాలి. వ్యక్తిగత స్థలం విషయంలో ఇంట్లో ఉండే వారి అవసరాలను, అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ప్రత్యేకమైన కప్‌బోర్డ్, టేబుల్ కావాలన్నా, చెట్ల పెంపకం, పెయింటింగ్, ఆర్ట్ మొదలైన అభిరుచులకు ప్రత్యేకమైన స్థలం కేటాయించుకోవాలన్నా ఆ విషయాల గురించి ఆర్కిటెక్ట్‌తో ముందుగా చర్చించాలి.

ఫర్నిచర్ ఎలా..?

కొత్త ఇంటికి పూర్తిగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటున్నారా.. లేక పాత ఫర్నిచర్‌నే కొనసాగించాలనుకుంటున్నారా అన్న విషయం ఆర్కిటెక్ట్‌తో చెప్పాలి. మీ దగ్గర ఉన్న ఫర్నిచర్ సైజుని కూడా నోట్ చేసి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ ఫర్నిచర్ అమర్చుకోడానికి వీలుగా ఇంటిని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది.

పెంపుడు జంతువులు ఉంటే..

జంతువులను పెంచే అలవాటు ఉన్నవారు సొంత ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే వాటికి ప్రత్యేకమైన చోటు ఉంచడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండడమే కాకుండా వాటి పోషణ, రక్షణ సులభమవుతాయి. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఎటువంటి ఇబ్బందీ కలగదు.

ముందు జాగ్రత్త..

ఇంటి స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు రకరకాల కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్, స్పేస్ సేవింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి. లేదా ఆర్కిటెక్ట్‌తో మాట్లాడండి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నట్టయితే యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ ఎంచుకోండి. అలాగే భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిక్‌ వర్క్ ప్లాన్ చేయాలి.

బడ్జెట్, డిస్కౌంట్ల గురించి...

మీ బడ్జెట్ గురించి ఆర్కిటెక్ట్‌తో చర్చించేటప్పుడు కచ్చితంగా ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి చిన్నదే కదా అనుకున్న ఖర్చు నిర్మాణం పూర్తయ్యేసరికి తలకు మించిన భారమవుతుంది. చేతిలో ఉన్న ఆఖరి రూపాయి వరకూ ఖర్చు చేసి ఇల్లు కట్టాలన్న ఆలోచన మానుకోండి. అది అత్యంత ప్రమాదకరం.

అలాగే ఇంటి నిర్మాణంలో మీకు ఏదైనా మెటీరియల్ చవకగా లభించేట్టయితే ఆ విషయాన్ని ఆర్కిటెక్ట్‌తో చర్చించండి. దీనివల్ల ఇంటి ప్లాన్ వేసేటప్పుడు ఆ మెటీరియల్ విషయంలో బడ్జెట్‌కు మాత్రమే కాకుండా, అవసరాలకూ ప్రాధాన్యమిచ్చి డిజైన్ చేసేందుకు వీలుంటుంది.

మీ సొంతింటి కల నెరవేర్చుకునే ఆనందంలో ఇలాంటి ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అవసరమైన జాగ్రత్తలను పాటించి మీ జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని