పరగడుపున ఈ పనులు చేయద్దు!

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు/ఆకలేసినప్పుడు ఇలా మనం తీసుకునే కొన్ని పదార్థాలు/చేసే పనులు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజ. పరగడుపున/ఆకలేసినప్పుడు తీసుకోకూడని పదార్థాలు, చేయకూడని పనులేంటో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Published : 30 Aug 2021 17:43 IST

నిద్ర లేవగానే కప్పు కాఫీ కడుపులో పడందే ఏ పనీ మొదలుపెట్టాలనిపించదు..

బాగా ఆకలిగా ఉన్నప్పుడు చేతికందింది నోట్లో వేసేసుకుంటాం.. అది ఆరోగ్యానికి మంచిదా, కాదా అన్న విషయం ఆలోచించం.

హా.. ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో ఖాళీ కడుపుతోనే కొంతమంది కొన్ని రకాల మాత్రలు వేసుకుంటుంటారు.

నిజానికి మనం ఈ విషయాలేవీ అంతగా పట్టించుకోం కానీ.. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు/ఆకలేసినప్పుడు ఇలా మనం తీసుకునే కొన్ని పదార్థాలు/చేసే పనులు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజ. పరగడుపున/ఆకలేసినప్పుడు తీసుకోకూడని పదార్థాలు, చేయకూడని పనులేంటో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. వంటి విషయాల్లో సెలబ్రిటీలనే కాదు.. మనలాంటి సామాన్యులనూ అలర్ట్‌ చేస్తుంటారు పూజ. ఈ క్రమంలోనే ఇన్‌స్టా వేదికగా వివిధ రకాల వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇందులో భాగంగానే పరగడుపున తీసుకోకూడని పదార్థాలేంటో, చేయకూడని పనులేంటో మరో సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో ఇలా చెప్పుకొచ్చారామె.

కాఫీ ఎందుకు వద్దంటే..?!

ఉదయం లేచి బ్రష్‌ చేసుకోగానే చాలామంది చేసే పని కాఫీ తాగడం.  నిజానికి ఓ కప్పు కాఫీ శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందనిపిస్తుంది.. అందుకే ఇది కడుపులో పడందే ఏ పని పైనా దృష్టి పెట్టలేం. అయితే ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఇది పొట్టలో హైడ్రోక్లోరికామ్లం (HCL) విడుదలను ప్రేరేపిస్తుంది. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, వాటిలోని పోషకాలు శరీరం గ్రహించేలా చేయడంలో HCL ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొట్ట లోపలి పొరను సంరక్షించడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌.. వంటి వ్యాధి కారక క్రిముల్ని బయటికి పంపించడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది. అలాగని ఇది మరీ ఎక్కువగా విడుదలైతే మాత్రం జీర్ణాశయ లోపలి పొర దెబ్బతింటుంది. కాబట్టి పరగడుపునే కాఫీ తాగి సమస్యలు కొనితెచ్చుకునే కంటే ఏదైనా తిన్నాక తాగడం మంచిది.

చూయింగ్‌ గమ్‌ నములుతున్నారా?

ఖాళీ కడుపుతో చూయింగ్‌ గమ్‌ నమలడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే నమిలే ప్రక్రియ వల్ల పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఆ సమయంలో జీర్ణం చేయడానికి కడుపులో ఎలాంటి ఆహార పదార్థాలు ఉండవు.. కాబట్టి ఇవి పొట్ట లోపలి పొరలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా అల్సర్లు ఏర్పడతాయి.

ఆ మాత్రలు మంచివా? కాదా?

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు/మాత్రలు వేసుకోవడం వల్ల కూడా కొందరిలో దుష్ప్రభావాలు ఎదురు కావచ్చునంటున్నారు నిపుణులు. అయితే వయసు, వీటిని ఎన్ని రోజుల పాటు వాడుతున్నారు? ఎంత డోస్‌ తీసుకుంటున్నారు..? అన్న విషయాల పైనే దుష్ప్రభావాలు ఎదురవుతాయా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలం పాటు వీటిని వాడడంతో పాటు, అధిక మోతాదులో వీటిని పరగడుపున తీసుకున్న వారిలో ఉదర సంబంధిత సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అల్సర్లు, గుండెలో మంట, వికారం-వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌.. వంటి దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. కాబట్టి పరగడుపున వేసుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిపుణులకు తెలియజేసి వారి సలహా మేరకు ఎంత డోసు వాడాలి, ఎప్పుడు వాడాలో తెలుసుకోవడం మంచిది.

ఆకలేసినప్పుడు షాపింగా?

ఆకలేసినప్పుడు చిరుతిండ్ల పైకి మనసు మళ్లడం సహజం. అందుకే బాగా ఆకలితో ఉన్నప్పుడు దగ్గర్లోని సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి తమకు నచ్చిన పదార్థాలు కొనుక్కోవడం కొంతమందికి అలవాటు! కానీ ఇది మంచిది కాదని చెబుతున్నాయి కార్నెల్‌ యూనివర్సిటీ వాళ్లు నిర్వహించిన రెండు అధ్యయనాలు. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు షాపింగ్‌కి వెళ్తే ఎక్కువ క్యాలరీలున్న పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ వంటి వాటికే అధిక ప్రాధాన్యమిస్తామట! తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదో ఒక పండు తినడం, ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది.

గొడవ పడద్దు!

ఆకలితో ఉన్నప్పుడు/పరగడుపున రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది కోపాన్ని ప్రేరేపించే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే కోపం ఇద్దరి మధ్యా గొడవకు దారితీయచ్చు. అదే ఏదైనా స్నాక్‌ తీసుకుంటే కొన్నిసార్లు ఆ కోపం తగ్గిపోవచ్చు కూడా! కాబట్టి ముందుగా ఏదైనా తీసుకున్నాకే ఇతరులతో మాట్లాడడం వల్ల గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!

* పరగడుపున వ్యాయామం చేస్తే శరీరంలోని శక్తి మరింతగా క్షీణించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా పండు, నట్స్‌.. వంటివి తీసుకుంటే తక్షణ శక్తి అంది మరింత చురుగ్గా వ్యాయామం చేయచ్చు.

* ఆకలితో ఉన్నప్పుడు నిద్రకు ఉపక్రమించడం వల్ల సుఖ నిద్ర పట్టకపోగా.. శరీరంలో ఆకలి హార్మోన్‌ గ్రెలిన్‌ స్థాయులు పెరుగుతాయట! ఫలితంగా నిద్ర లేచాక ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది. కాబట్టి పడుకునే ముందు కనీసం పాలైనా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

* ఖాళీ కడుపుతో నిమ్మజాతికి చెందిన పండ్లరసాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోని ఆమ్లత్వం పొట్టపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం నీళ్లు, పండ్ల రసం.. రెండూ సమాన మొత్తాల్లో కలుపుకొని తాగచ్చు.

వీటితో పాటు మసాలాలు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు.. వంటివి పరగడుపున తీసుకోకపోవడమే మంచిది. అయితే ఈ విషయంలో మీకేమైనా సందేహాలున్నా, లేదంటే ఆయా పదార్థాలు తీసుకోవడం వల్ల పొట్టలో అసౌకర్యం, నొప్పి వంటి సమస్యలొచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్