బరువు తగ్గితే.. లక్షల్లో బోనస్!

అధిక బరువు.. శారీరకంగానే కాదు, మానసికంగానూ పలు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పరోక్షంగా దీని ప్రభావం పని ఉత్పాదకత పైనా పడుతుంది. ఇది తీసుకొచ్చే అనారోగ్యాల వల్ల ఒక్కోసారి ఆఫీస్‌కి కూడా వెళ్లలేని పరిస్థితి! ఒకవేళ వెళ్లినా పనిపై పూర్తి దృష్టి పెట్టలేం....

Published : 14 Jun 2024 12:25 IST

అధిక బరువు.. శారీరకంగానే కాదు, మానసికంగానూ పలు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పరోక్షంగా దీని ప్రభావం పని ఉత్పాదకత పైనా పడుతుంది. ఇది తీసుకొచ్చే అనారోగ్యాల వల్ల ఒక్కోసారి ఆఫీస్‌కి కూడా వెళ్లలేని పరిస్థితి! ఒకవేళ వెళ్లినా పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. తమ సంస్థలో ఉద్యోగులు పడే ఇలాంటి ఇబ్బందినే అర్థం చేసుకుందో కంపెనీ. అందుకే బరువు తగ్గే దిశగా తమ ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తోంది. అది కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తూ మరీ! అంతేకాదు.. బరువు తగ్గిన వారికి వేలల్లో, లక్షల్లో బోనస్‌ కూడా అందిస్తోంది. అందుకే ఈ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సంస్థలు అప్పుడప్పుడూ ఆరోగ్య శిబిరాలు, ఆయా అంశాల్లో ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించడం మనకు తెలిసిందే! అయితే చైనాకు చెందిన ‘ఇన్‌స్టా 360’ అనే టెక్‌ కంపెనీ కాస్త భిన్నంగా ఆలోచించింది. అధిక బరువు, ఊబకాయంతో బాధపడే ఉద్యోగుల్ని బరువు తగ్గేలా ప్రోత్సహించాలనుకుంది. ఈ క్రమంలోనే వారికి ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు బోనస్‌ రూపంలో పెద్ద మొత్తంలో నగదు బహుమతినీ అందిస్తోంది.

మూడు నెలలు.. సెషన్‌కు 30 మంది!
తమ ఉద్యోగుల్లో అధిక బరువు సమస్యను తగ్గించేందుకు ‘వెయిట్‌ లాస్‌ బూట్‌ క్యాంప్‌’ తరహా విధానాన్ని రూపొందించిందీ సంస్థ. ఇందులో భాగంగా ఒక్కో క్యాంప్‌ మూడు నెలల పాటు నిర్వహిస్తారు. సెషన్‌కు 30 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న వారికే మొదటి ప్రాధాన్యం! వీరిని మూడు గ్రూపులుగా విభజించి.. బరువు తగ్గేందుకు రోజూ సరైన పోషకాహారం అందిస్తూనే.. తగిన వ్యాయామాలు సాధన చేయిస్తారు. ఇలా ప్రతి బృందంలో సభ్యులు వారానికి ఎంత బరువు తగ్గారో పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో వారానికి అరకిలో తగ్గిన వారికి 400 చైనీస్‌ యువాన్లు (సుమారు రూ. 4,600) అందిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువగా తగ్గిన వారికి బోనస్‌ పెంచి ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి తమ నెల జీతానికి అదనంగా సుమారు రూ. 18,400 లను బోనస్‌గా అందుకోవచ్చు. అదే మూడు నెలల కోర్సు పూర్తయ్యేసరికి రూ. 55,200 నగదు బహుమతిని పొందచ్చు. ఇలా బరువు తగ్గే విషయంలో బోనస్‌ అందిస్తూ సంస్థ తమ ఉద్యోగుల్ని ఎలాగైతే ప్రోత్సహిస్తుందో.. ఒకవేళ ఈ శిక్షణ సమయంలో బరువు పెరిగినా వారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో బరువు పెరిగిన వారికి బోనస్‌ దక్కకపోగా.. 500 చైనీస్‌ యువాన్లు (సుమారు రూ. 5,750) ఫైన్‌ కింద చెల్లించాలంటూ కఠిన నియమం కూడా పెట్టిందీ కంపెనీ.

అందరూ తగ్గారట!
నిజానికి గతేడాదే ఈ సంస్థ ఈ వెయిట్‌ లాస్‌ క్యాంప్‌కు శ్రీకారం చుట్టింది. ఇలా ఇప్పటివరకు మూడు నెలల చొప్పున ఐదు క్యాంపులు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఉద్యోగులు పాల్గొని బరువు తగ్గారట! తద్వారా తాము తగ్గిన బరువును బట్టి వేలు, లక్షల కొద్దీ బోనస్‌గా అందుకున్నారట! అంతేకాదు.. ఈ 150 మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ బరువు పెరగలేదని.. అందరూ తగ్గడం పైనే దృష్టి పెట్టి బోనస్‌ను అందుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఇలా వెయిట్‌లాస్‌ బోనస్‌ రూపంలో తమ ఉద్యోగులపై ఇప్పటివరకు సుమారు రూ. 1.10 కోట్ల రూపాయల్ని వెచ్చించిందట ఈ టెక్‌ కంపెనీ. అంతేకాదు.. ఈ వెయిట్‌లాస్‌ ప్రోగ్రామ్‌తో తాము నాజూగ్గా మారడమే కాదు.. చక్కటి ఆరోగ్యాన్నీ సొంతం చేసుకున్నామంటున్నారు పలువురు ఉద్యోగులు. అలాగే వేలు, లక్షల కొద్దీ బోనస్‌ అందుకున్నామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రత్యేకించి ఈ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు తమలో ఒత్తిడి, ఆందోళనలు తగ్గి.. వర్క్-లైఫ్ బ్యాలన్స్ మరింతగా పెరిగినట్లు చెప్పడం గమనార్హం.

ఆలోచన అదుర్స్‌!
ఇలా తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కాంక్షించి ఈ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోన్న వెయిట్‌లాస్‌ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమంది దీనిపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘కంపెనీ ఆలోచన అదుర్స్‌.. నాకూ ఇలాంటి సంస్థలో పనిచేయాలనుంది’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. ‘నేను రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తుతా. ఈ సంస్థ నాలాంటి ఉద్యోగుల్ని పనిలో పెట్టుకుంటే దివాళా తీయడం ఖాయం!’ అంటూ మరొకరు చమత్కరించారు.
ఇదే కాదు.. గతంలో మరో చైనా కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్‌నే అందించింది. ఉద్యోగి నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తితే.. కొంతమొత్తాన్ని బోనస్‌గా అందించనున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్