Updated : 19/08/2021 17:48 IST

ఫొటోగ్రఫీ.. అది నా ఊపిరిలోనే ఉంది!

సాధారణంగా ఏదైనా అకేషన్‌ ఉన్నా, లేకపోయినా మనందరికీ ఫొటోలు దిగడమంటే ఇష్టముంటుంది. కానీ తనకు మాత్రం ఫొటోలు తీయడం; అందమైన లొకేషన్లను, పచ్చటి ప్రకృతిని కెమెరాలో బంధించడమంటేనే ఇష్టమంటోంది హైదరాబాద్‌కు చెందిన యువ ఫొటోగ్రాఫర్‌ శృతి మూర్తి. చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీనే తన ప్రాణంగా భావించిన ఆమె.. అందులోనే తన కెరీర్‌ను వెతుక్కుంది. పెళ్లి, ప్రెగ్నెన్సీ, బేబీ షూట్స్‌, బర్త్‌డే షూట్స్‌.. ఇలా సందర్భం ఏదైనా అందమైన క్షణాలను మరపురాని జ్ఞాపకాలుగా మలిచి అందరి ఆదరణ చూరగొంటోంది. కుటుంబ ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు అరుదైన రంగాల్లోనూ రాణించగలరంటోన్న ఆమె తన ఫొటోగ్రఫీ జర్నీ గురించి ‘వసుంధర’తో ప్రత్యేకంగా పంచుకుంది.

నేను పుట్టిపెరిగిందంతా దిల్లీలోనే! అక్కడే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. నాన్న శ్రీరామమూర్తి. దిల్లీ ఆంధ్రభవన్‌లో పనిచేసేవారు. అమ్మ రమామణి. తను మంచి ఆర్టిస్ట్‌. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు తను తన అభిరుచిని నెరవేర్చుకోలేకపోయింది. అందుకే నేను ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకుంటానన్నప్పుడు నాకు బాగా సపోర్ట్‌ చేసింది. ఈమధ్యే నేను హైదరాబాద్‌ వచ్చి ఇక్కడే సెటిలయ్యాను.

నా ఇష్టానికి నాన్న ప్రోత్సాహం తోడైంది!

నాకు చిన్నతనం నుంచీ ఫొటోగ్రఫీ అంటే మక్కువ. ఫొటోలు దిగడం కంటే.. నేను తీసిన ఫొటోలు చూసి ఇతరులు మురిసిపోతుంటే ఆనందించేదాన్ని. అలా నా వయసుతో పాటే ఫొటోగ్రఫీపై ప్రేమా పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తయ్యాక సివిల్స్‌కి ప్రిపేరయ్యా. అది వర్కవుట్‌ కాకపోవడంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. అయినా మనసులో ఏదో వెలితి.. ఫొటోగ్రఫీపైనే నా ధ్యాసంతా! ఇదే విషయం ఇంట్లో చెప్పాలంటే భయం! కానీ చెప్పకుండా బాధపడడం కంటే చెప్పి ఏదో ఒకటి తేల్చుకోవడం మంచిదనిపించింది. ఏదైతే అదవుతుందని నా మనసులోని మాటను అమ్మానాన్నలతో పంచుకున్నా. కానీ వాళ్లు నా నిర్ణయాన్ని స్వాగతిస్తారని నేను అసలు ఊహించలేదు. ముఖ్యంగా ఈ క్రమంలో నాన్న నన్ను బాగా ప్రోత్సహించారు.

ఇక మా అన్నయ్య డిఫెన్స్‌లో ఫొటో టెక్నీషియన్‌. తన దగ్గర DSLR కెమెరా ఉండేది. చిన్నప్పట్నుంచి తనని చూసే ఫొటోలు తీయడం, ఫొటోగ్రఫీలో కొన్ని మెలకువలు నేర్చుకోవడం.. నాకు అలవాటైంది. ఇలా నా ఫొటోగ్రఫీ జర్నీలో అన్న సహకారం కూడా ఉంది.

వాళ్ల మాటలు పట్టించుకోలేదు!

నేను ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు నా కుటుంబం నన్ను పూర్తిగా సపోర్ట్‌ చేసింది. పెళ్లయ్యాక అత్తింటి వారూ ప్రోత్సహించారు. అయితే కొంతమంది మాత్రం.. ‘ఉద్యోగం చేస్తూనే దీన్నో హాబీలాగా మార్చుకోవచ్చు కదా!’ అన్నారు. అయినా నా నిర్ణయాన్ని నా పేరెంట్స్‌ గౌరవించారు.. అది చాలనిపించింది. 2016లో నాన్న ఫ్రెండ్‌, డైరెక్టర్‌ మణిశంకర్‌ సర్‌.. నేను గతంలో తీసిన కొన్ని ఫొటోలు చూసి ఆయన దగ్గర పనిచేసే అవకాశమిచ్చారు. నాతో AP Tourism ప్రాజెక్ట్‌ చేయించారు. నిజానికి ఆయన దగ్గర చేరే సమయానికి ఫొటోగ్రఫీ గురించి నాకున్న పరిజ్ఞానం అంతంతమాత్రమే! ఈ క్రమంలో యాడ్‌ ఫిల్మ్స్‌, ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌, హోలోగ్రామ్‌, పాట షూట్స్‌, ఆడియో షూట్స్‌.. వంటి చాలా అంశాల్లో నైపుణ్యం వచ్చింది. అసిస్ట్‌ చేయడం దగ్గర్నుంచి షూటింగ్‌కి లైటింగ్‌, ఆడియో సెటప్‌ చేయడం నేర్చుకున్నా. ఈ సమయంలోనే కాజల్‌, రానా.. వంటి సెలబ్రిటీల సినిమా ప్రమోషన్ షూట్స్‌, జాతీయ-అంతర్జాతీయ ఎలక్షన్‌ క్యాంపెయిన్స్‌ని టీమ్‌తో పాటు కలిసి షూట్‌ చేశాం.

నా క్రియేటివిటీకి ప్రతిరూపమది!

ఇలా ఈ రెండేళ్ల కాలంలో ఫొటోగ్రఫీలో చాలా విషయాలు నేర్చుకున్నా. అయితే ఆ తర్వాత నాలో ఉన్న క్రియేటివిటీతో ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 2018లో ‘Candids By Her’ పేరుతో ఫొటోగ్రఫీ బిజినెస్‌ ప్రారంభించా. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పేజీల్ని క్రియేట్‌ చేసి అందులో నేను తీసిన ఫొటోల్ని పోస్ట్‌ చేయడం మొదలుపెట్టా. మొదట్లో చాలా తక్కువ ఆఫర్స్‌ వచ్చేవి.. తక్కువ బడ్జెట్‌కు పనిచేసిన రోజులూ ఉన్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా ఇందులో నిలదొక్కుకోవడం, ఎక్కువ మందిని ఆకర్షించడం, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం పైనే పూర్తి దృష్టి పెట్టా. కొన్నాళ్లకు అది వర్కవుట్‌ అయింది. ప్రస్తుతం ప్రి-వెడ్డింగ్స్‌, వెడ్డింగ్స్‌, పోస్ట్‌-వెడ్డింగ్స్‌, ఫ్యామిలీ షూట్స్‌, ప్రెగ్నెన్సీ షూట్స్‌, న్యూ బోర్న్‌ బేబీస్‌, బేబీ షూట్స్‌, బర్త్‌ డే షూట్స్‌, కేక్‌ స్మాష్‌ షూట్స్‌, పోర్ట్‌ఫోలియో, ప్రొడక్ట్‌ షూట్స్‌, రియల్‌ ఎస్టేట్‌-ఫుడ్‌ షూట్స్‌.. వంటివి చేస్తున్నా.

ఆ పెళ్లిళ్లలో మాకే డిమాండ్!

ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా, అదీ హైదరాబాద్‌లో జరిగే ముస్లిం పెళ్లిళ్లలో మహిళా ఫొటోగ్రాఫర్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఎందుకంటే.. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లలో బ్రైడల్‌ షూట్స్‌ కోసం మహిళా ఫొటోగ్రాఫర్లైతేనే వాళ్లు సౌకర్యవంతంగా ఫీలవుతుంటారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా జరిగే ముస్లిం పెళ్లిళ్లలో షూట్స్‌ కోసం ఎక్కువగా నన్ను పిలుస్తుంటారు. ఇక ఫొటోషూట్స్‌ కోసం నేను ఎక్కువగా పచ్చటి ప్రకృతికే ప్రాధాన్యమిస్తా. నేచర్‌తో మమేకమై దిగిన ఫొటోలు అంతే సహజసిద్ధంగా వస్తాయనేది నా నమ్మకం. ఒకవేళ క్లైంట్స్‌ ఫలానా లొకేషన్‌ని ఎంచుకున్నామంటే.. అక్కడికెళ్లి ఫొటోషూట్‌ చేయడానికీ వెనకాడను. ఏదేమైనా షూట్‌ చేయించుకునే వాళ్ల సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటా.

అదే నా ఫొటోగ్రఫీ సీక్రెట్!

నా ఫొటోగ్రఫీకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. క్లైంట్స్‌తో ఓ ఫొటోగ్రాఫర్‌గా కాకుండా ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌లా కలిసిపోవడానికి ప్రాధాన్యమిస్తా. వాళ్లకు అలాంటి కంఫర్ట్ ఇచ్చినప్పుడే ఫొటోలు కూడా అంతే న్యాచురల్‌గా వస్తాయనేది నా నమ్మకం. ఇలా చేయండి, అక్కడ చూడండి.. అంటూ ఆర్టిఫిషియల్‌ పోజులు చెప్పకుండా.. వాళ్లు మనస్ఫూర్తిగా ఫీలై.. సహజసిద్ధంగా నవ్వడం, మాట్లాడుకోవడం.. వంటివి చేసినప్పుడే కెమెరాను క్లిక్‌మనిపిస్తా. ఇలా తీసిన ఫొటోల్లోనే సహజత్వం ఉట్టిపడుతుంది. వాళ్ల మనసులోని భావాలు ఫొటోలో ప్రదర్శితమవుతాయి. నా ఫొటోగ్రఫీకి ‘CANDID’ అనే పేరు పెట్టడానికి ఈ ఆలోచనే కారణం!

కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకూ ఇదే విషయం చెప్తా. సీనియర్‌ ఫొటోగ్రాఫర్స్‌తో మాట్లాడడం, మొహమాటాన్ని పక్కన పెట్టి మీ మనసులోని ఆలోచనల్ని వారితో పంచుకోవడం, వాళ్లిచ్చే సలహాల్ని పాటించడం.. ఇవన్నీ పాటిస్తే ఆడ/మగ అన్న తేడా లేకుండా కచ్చితంగా ఈ రంగంలో రాణించచ్చు. ఈ రంగంలోకి కొత్తగా వచ్చినప్పుడు నేను గ్రహించిన విషయమిదే!

భవిష్యత్తులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలన్న ఆలోచన ఉంది. అలాగని ఫొటోగ్రఫీని వదులుకోను.. ఎందుకంటే అదే నా ఊపిరి!B-_p-naAwzQ

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి