ప్రయాణాల్లో నెలసరి వచ్చినా నో ప్రాబ్లం!

ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెలసరి వస్తే.. ఆ సమయంలో మన వద్ద శ్యానిటరీ న్యాప్‌కిన్‌ కూడా లేకపోతే..? అమ్మో! ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనిపిస్తోంది కదూ! జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇర్ఫానా జర్గార్‌ కూడా అదే ఆలోచించింది. అందుకే అక్కడి పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద ఉచితంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లను మహిళలకు అందుబాటులో ఉంచుతోంది.

Published : 07 Sep 2021 17:48 IST

(Photo: Twitter)

ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెలసరి వస్తే.. ఆ సమయంలో మన వద్ద శ్యానిటరీ న్యాప్‌కిన్‌ కూడా లేకపోతే..? అమ్మో! ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనిపిస్తోంది కదూ! జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇర్ఫానా జర్గార్‌ కూడా అదే ఆలోచించింది. అందుకే అక్కడి పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద ఉచితంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లను మహిళలకు అందుబాటులో ఉంచుతోంది. అంతేకాదు.. మన జీవితంలో సర్వసాధారణమైన నెలసరి గురించి నలుగురిలో మాట్లాడడానికి సిగ్గెందుకు అని తోటి వారిని ప్రశ్నిస్తోంది. మరో అడుగు ముందుకేసి ఈ మంచి పని కోసం తన జీతంలో నుంచి కొంత మొత్తాన్ని సైతం వెచ్చిస్తోందామె. ‘సమాజం మనకెంతో ఇచ్చింది.. మన వంతుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంద’నే సిద్ధాంతాన్ని నమ్మే ఇర్ఫానా.. నెలసరిపై అపోహలు వీడి అవగాహన పెంచుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమంటోంది.

ప్రస్తుతం శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తోన్న 28 ఏళ్ల ఇర్ఫానాకు సమాజమంటే చిన్నతనం నుంచే ప్రేమెక్కువ. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మన ఆలోచనల్ని మార్చుకోవాలంటోందామె. పెద్దయ్యాక తన వంతుగా సమాజానికి ఏదో ఒక సహకారం అందించాలని నిర్ణయించుకున్న ఆమె.. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత పరిశుభ్రతే లక్ష్యంగా పెట్టుకుంది.

నాన్న మరణంతో..!

చాలామంది ఇంట్లో నెలసరి గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు.. ఇక న్యాప్‌కిన్లు కూడా తామే తెచ్చుకోవడం లేదంటే ఇంట్లో తల్లికో/సోదరికో ఈ పనిని అప్పగించడం.. వంటివి చేస్తారు. అయితే మన జీవితంలో సర్వసాధారణమైన నెలసరి గురించి మగాళ్ల దగ్గర మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదంటోంది ఇర్ఫానా.

‘మన సమాజంలో నెలసరిపై ఎన్నో అపోహలు, మూసధోరణులు ఉన్నాయి. ఇక కశ్మీర్‌లో అయితే వీటికి అడ్డూ-అదుపూ ఉండదు. ఆడవాళ్ల జీవితంలో ఇది అతి సాధారణమైన విషయమే అయినా.. నలుగురిలో మాట్లాడడానికి, ఇంట్లో ఉండే మగాళ్లతో న్యాప్‌కిన్లు తెప్పించుకోవడానికి బిడియపడిపోతూ ఉంటారు చాలామంది అమ్మాయిలు. కానీ నేను మాత్రం ఇందుకు భిన్నం. నాకు మా నాన్నే న్యాప్‌కిన్లు తీసుకొచ్చేవారు. అలాగని ఇందులో సిగ్గు పడాల్సిందేమీ లేదు. పైగా ఈ విషయాన్ని నేను చెప్పుకోవడానికి గర్వపడతా. ఇక నాన్న చనిపోయాక ఆయనకు నివాళిగా సమాజ సేవపై దృష్టి పెట్టాలన్న నా ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చా.. ఈ క్రమంలోనే 2014 నుంచే ‘ఎవా సేఫ్టీ డోర్‌’ పేరుతో శ్యానిటరీ కిట్‌ని అందించడం ప్రారంభించా..’ అంటోందీ కశ్మీరీ అమ్మాయి.

నా కిట్‌లో ఏముంటాయంటే..?!

పేద మహిళలు శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనలేరు.. అందుకే నెలసరి సమయంలో అపరిశుభ్రమైన ఇతర ప్రత్యామ్నాయాలను వాడితే అది వారి ఆరోగ్యానికే నష్టం. ఈ ఒక్క ఆలోచనతోనే ‘ఎవా సేఫ్టీ డోర్‌’ అనే కిట్‌ను అందుబాటులోకి తెచ్చానంటోంది ఇర్ఫానా. 
‘గ్రామీణ మహిళలు, పేద మహిళల కోసమే ఈ ఇనీషియేటివ్‌ ప్రారంభించా. శ్యానిటరీ న్యాప్‌కిన్లు మహిళల వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడతాయి.. ఇదే విషయాన్ని వారికి నా కిట్‌ ద్వారా తెలియజేస్తున్నా. శ్యానిటరీ ప్యాడ్స్‌, హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌, Antispasmodic Drugs.. వంటివన్నీ కిట్‌లో ఉంటాయి. ఇక ఒక్కోసారి ప్రయాణాల్లో అనుకోకుండా నెలసరి రావచ్చు. ఆ సమయంలో మన వద్ద శ్యానిటరీ ప్యాడ్‌ ఉండచ్చు.. ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మహిళలు ఇబ్బంది పడకూడదని పబ్లిక్‌ టాయిలెట్స్‌ దగ్గర కూడా ఈ కిట్స్‌ని అందుబాటులో ఉంచుతున్నా. లాక్‌డౌన్‌ సమయంలోనూ మార్కెట్లో శ్యానిటరీ ప్యాడ్స్‌ కొరత వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనూ నా సేవలు కొనసాగాయి..’ అంటోంది ఇర్ఫానా.

మార్పు మన నుంచే!

నెలసరి కిట్ల కోసం తన జీతంలో నుంచే సుమారు రూ. 5000లను పక్కన పెడుతోన్న ఈ కశ్మీరీ అమ్మాయి.. ఈ విషయంలో సమాజంలో ఉన్న మూసధోరణులు అంతమవ్వాలంటే మార్పు మన నుంచే మొదలు కావాలంటోంది. 
‘మనం ఎన్నో విషయాల్లో అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. వాటిలోంచి కొంత మొత్తం పొదుపు చేసినా అవసరంలో ఉన్న ఇలాంటి మహిళల్ని ఆదుకోవచ్చు. అదేవిధంగా.. నెలసరి గురించి బహిరంగంగా మాట్లాడితే తప్పు.. అన్న ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆడవాళ్ల జీవితంలో ఇది సర్వసాధారణం అయినప్పుడు దీనిపై మన చుట్టూ ఇన్ని మూసధోరణులు ఎందుకు అల్లుకున్నాయో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే! మగాళ్లు కూడా ఈ సమయంలో తమ భార్యలు, కూతుళ్లకు అండగా నిలవాలి. ఇలా అందరి మనసుల్లో మార్పొచ్చినప్పుడే నెలసరిపై ఉన్న మూసధోరణులన్నీ తొలగిపోతాయి..’ అని చెబుతోంది ఇర్ఫానా.

నెలసరి అనేది వయసును బట్టి మనలో వచ్చిన సహజసిద్ధమైన మార్పు అని ఎందుకు అనుకోకూడదు? దాన్ని మన జీవితంలో మకిలిగా ఎందుకు భావించాలి? ఆలోచిస్తే ఇర్ఫానా చెప్పింది అక్షర సత్యం అనిపిస్తోంది కదూ! మరి, దీనిపై మీరేమంటారు? ఈ క్రమంలో మీ అభిప్రాయాలకు అక్షర రూపమివ్వండి.. వాటిని మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్