ఇద్దరు మిత్రుల ఆలోచన.. ఎంతోమందికి సంతోషాన్ని పంచుతోంది!

మనసులోని బాధను మరొకరితో పంచుకుంటేనే గుండె భారం తగ్గుతుంది.. అదే గతంలో అలాంటి బాధను అనుభవించిన వారితో పంచుకుంటే.. వారి సలహాతో దాన్నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.. తద్వారా మనసుకు ఉపశమనమూ...

Published : 26 Apr 2023 12:34 IST

(Photos: Instagram)

మనసులోని బాధను మరొకరితో పంచుకుంటేనే గుండె భారం తగ్గుతుంది.. అదే గతంలో అలాంటి బాధను అనుభవించిన వారితో పంచుకుంటే.. వారి సలహాతో దాన్నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.. తద్వారా మనసుకు ఉపశమనమూ లభిస్తుంది. తమ స్టార్టప్‌తో ఈ ప్రయత్నమే చేస్తున్నారు ఇద్దరు మిత్రులు. వివిధ రకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటోన్న వారి కోసం ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ప్రారంభించిన ఈ స్నేహితురాళ్లు.. దాని ద్వారా ఎంతోమందికి తమ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఇందుకు రెండు పద్ధతుల్ని పాటిస్తోన్న ఈ ఫ్రెండ్స్‌ స్టార్టప్‌ ఐడియా ఇటీవలే ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ బిజినెస్‌ షోలో భాగంగా రూ. 50 లక్షల పెట్టుబడిని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐఐటీ మిత్రుల స్టార్టప్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

పునీతా మిట్టల్‌, మహక్‌ మహేశ్వరి.. వీరిద్దరూ స్నేహితులు. బెంగళూరుకు చెందిన పునీత ఐఐటీ దిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. మహక్‌ ఐఐటీ ముంబయిలో చదివింది. చదువు పూర్తయ్యాక పలు సంస్థల్లో, స్టార్టప్స్‌లో పనిచేసిన వీరు.. ముందు నుంచీ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతోనే ఉన్నారు. అయితే ఆయా సంస్థల్లో, స్టార్టప్స్‌లో పనిచేయడం వల్ల వ్యాపారానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన పెంచుకున్నారు.

అదే టర్నింగ్‌ పాయింట్!

పదేళ్లకు పైగా కార్పొరేట్‌ రంగంలో పనిచేసి అనుభవం గడించిన పునీత.. 2020లో ఓ వలంటీర్‌ ట్రిప్‌లో భాగంగా తమిళనాడులోని ఆరొవిల్ వెళ్లింది. కులమతాలకు, దేశభాషలకు, సమస్యలకు అతీతంగా అక్కడి ప్రజల ప్రశాంతమైన జీవనశైలి ఆమెను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన బృంద చర్చల్లోనూ పాల్గొందామె. ‘ఆరొవిల్ లో ఓ కొత్త ప్రపంచాన్ని చూశా. దేశవిదేశీయులు నివసించే అక్కడి ప్రజల ఐకమత్యం, శాంతియుత బృంద చర్చలు నన్ను కట్టిపడేశాయి. ఇంతటి ప్రశాంతతను చుట్టూ ఉన్న వారికీ అందించాలనుకున్నా. అప్పటికే ఆరోగ్య రంగంలో వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నా. అయితే ఆరొవిల్ ను సందర్శించాక నా వ్యాపార ఆలోచనపై ఓ స్పష్టత వచ్చింది. దీని గురించి నా స్నేహితురాలు మహక్‌తో పంచుకున్నా. ఇలా ఇద్దరి చర్చల ఫలితమే 2021లో ‘సోల్‌అప్‌’ అనే స్టార్టప్‌కు బీజం వేసింది. వివిధ మానసిక సమస్యలకు పరిష్కారం చూపే ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ఇది..’ అంటూ చెప్పుకొచ్చింది పునీత.

చర్చలతోనే ఉపశమనం!

మానసిక సమస్యలకు నిపుణుల పరిష్కారాలు అందించే స్టార్టప్‌లు/వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అయితే సోల్‌అప్‌ అందుకు భిన్నం. ఇక్కడ బృంద చర్చలతోనే బాధితుల మనసులో ఉన్న మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారీ ఇద్దరు మిత్రులు. ఇందుకోసం రెండు మార్గాల్ని అనుసరిస్తున్నామని చెబుతున్నారు.

‘మనసులోని బాధ/సమస్య ఏదైనా సరే.. ఇతరులతో పంచుకుంటేనే గుండె భారం తగ్గుతుంది.. తగిన పరిష్కారమూ దొరుకుతుంది. అందుకే ఆయా సమస్యల గురించి బృందంగా చర్చించడమే ముఖ్యోద్దేశంగా మా స్టార్టప్‌ పనిచేస్తోంది. ఇందుకు రెండు పద్ధతుల్ని అనుసరిస్తున్నాం.

ఒకటి - సమస్య ఉన్న వారు.. గతంలో అదే సమస్యను ఎదుర్కొన్న కొంతమంది వ్యక్తులతో తమ బాధను పంచుకోవడం, దాని గురించి చర్చించడం, తద్వారా వారి నుంచి పరిష్కార/ఉపశమన మార్గాలు పొందడం. ఈ క్రమంలో ఒకరు-ఒకరితోనే సంభాషించడం లేదంటే బృందంతో సంభాషించడం.. చేయచ్చు. ఈ క్రమంలో గతంలో ఆయా సమస్యలు ఎదుర్కొన్న వారికి సంబంధించిన వివరాలు మా వెబ్‌సైట్లో పొందుపరుస్తాం. దాన్నుంచి తమ సమస్యకు సంబంధించిన వ్యక్తుల్ని ఎంచుకోవచ్చు.

ఇక రెండోది - ఒకే రకమైన సమస్యలున్న కొంతమంది వ్యక్తులు సంబంధిత నిపుణులతో మాట్లాడడం. వారి నుంచి పరిష్కార మార్గాలు పొందడం, వివిధ యాక్టివిటీల్లో భాగమవడం..

ఈ రెండు సందర్భాల్లోనూ వీడియో కాల్స్‌ ద్వారానే ఆయా వ్యక్తులతో/నిపుణులతో కాంటాక్ట్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్లో రిజిస్టర్‌ చేసుకొని.. మీ వివరాలు, సమస్యకు సంబంధించిన విషయాలను పొందుపరచాల్సి ఉంటుంది..’ అంటూ తమ స్టార్టప్‌ పనితీరు గురించి చెబుతున్నారీ ఇద్దరు స్నేహితురాళ్లు.

విభిన్న అంశాలపై..!

మన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంశాలు, అలవాట్లు.. వివిధ రకాల మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి. అలాంటి ఎన్నో సమస్యలకు తమ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా పరిష్కార మార్గం చూపుతున్నారు పునీత-మహక్. ఈక్రమంలో అనుబంధాలు, మానసిక-ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, స్నేహితుల మధ్య తలెత్తే సమస్యలు, కెరీర్‌-ఆఫీస్‌ పరంగా ఎదుర్కొనే సమస్యలు, పిల్లల పెంపకంలో ఎదురయ్యే సమస్యలు.. మొదలైన వాటికి పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా పరిష్కారం చూపి.. ఎంతోమంది బాధితుల మనసుకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్ల కాలంలో సుమారు వెయ్యి మందికి పైగా.. ఆయా సమస్యలతో పాటు.. పోర్న్‌ అడిక్షన్‌, యాంగ్జైటీ.. వంటి బయటికి చెప్పుకోలేని సమస్యలకూ తమ వేదిక పరిష్కారం చూపిందంటున్నారీ ఐఐటీ ఫ్రెండ్స్.

ఆ ‘షార్క్‌’ మనసు కొల్లగొట్టారు!

తమ వినూత్న ఆలోచనతో ఎంతోమందికి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తోన్న ఈ ఇద్దరు ఫ్రెండ్స్.. ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో ఇటీవలే పాల్గొన్నారు. తమ వ్యాపార ప్రయాణాన్ని న్యాయనిర్ణేతల ముందుంచారు. ఈ క్రమంలో ఆ న్యాయ నిర్ణేతల్లో ఒకరైన నమితా థాపర్‌కు ఈ ఫ్రెండ్స్‌ ఆలోచన నచ్చింది. దీంతో ఈ స్టార్టప్‌లో రూ. 50 లక్షల పెట్టుబడి పెట్టడానికి ఆమె ముందుకొచ్చారు. ఇది తమ వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారీ స్నేహితురాళ్లు.

‘భవిష్యత్తులో మా కమ్యూనిటీని విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నాం. మానసిక సమస్యల్లో భాగంగా ఎక్కువమంది యాంగ్జైటీతో బాధపడుతున్నట్లు కాస్త లోతుగా పరిశోధిస్తే మాకు అర్థమైంది. అందుకే ఇక ముందు ఈ సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు కృషి చేస్తాం. అలాగే భవిష్యత్తులో అన్ని దేశాల వారితోనూ సంభాషించే అవకాశమూ కల్పించాలనుకుంటున్నాం..’ అంటూ చెప్పుకొచ్చారీ ఇద్దరు ఫ్రెండ్స్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్