కూతురి కోసం తల్లి పడిన తపనే ఈ ‘మెల్లో’!

ఉంగరాల జుట్టు అమ్మాయిలకు మరింత అందాన్ని తెస్తుంది. మరి, అలాంటి కేశ సంపద క్రమంగా క్షీణిస్తుంటే మనకే కాదు.. మన అమ్మలకూ మనసొప్పదు. తమకు తెలిసిన పాత పద్ధతుల్ని, సౌందర్య చిట్కాల్ని ప్రయత్నిస్తూ సమస్యకు పరిష్కారం వెతుకుతుంటారు. రాజస్థాన్‌కు చెందిన సుజాతా శార్దా కూడా తన కూతురి.....

Published : 31 Aug 2022 13:21 IST

(Photos: Instagram)

ఉంగరాల జుట్టు అమ్మాయిలకు మరింత అందాన్ని తెస్తుంది. మరి, అలాంటి కేశ సంపద క్రమంగా క్షీణిస్తుంటే మనకే కాదు.. మన అమ్మలకూ మనసొప్పదు. తమకు తెలిసిన పాత పద్ధతుల్ని, సౌందర్య చిట్కాల్ని ప్రయత్నిస్తూ సమస్యకు పరిష్కారం వెతుకుతుంటారు. రాజస్థాన్‌కు చెందిన సుజాతా శార్దా కూడా తన కూతురి విషయంలో ఇలాగే చేసింది. మొదట్నుంచీ పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం.. అన్నింటికంటే ముఖ్యంగా సంప్రదాయ ఆరోగ్య పద్ధతుల్ని ఎక్కువగా నమ్మే ఆమె.. తన కూతురి కేశ సమస్య కోసం ఏకంగా ఓ నూనెనే తయారుచేసింది. ఇప్పుడదే ఓ వ్యాపార బ్రాండ్‌గా పేరు పొంది.. ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ప్రస్తుతం తన కూతురితో కలిసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన సుజాత బిజినెస్‌ జర్నీ ఎలా సాగుతోందో తెలుసుకుందాం రండి..

సుజాత కూతురికి అప్పుడు 11 ఏళ్లు. ఒత్తైన ఉంగరాల జుట్టుతో తన కూతురు సందడి చేస్తుంటే భలే ముచ్చటపడేవారామె. అయితే ఉన్నట్లుండి జుట్టు రాలడం, కేశ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం గమనించారు సుజాత. దీంతో ఎలాగైనా సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు.

నాలుగు వారాల్లోనే ఫలితం!

సుజాతకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అందులోనూ ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద పుస్తకాలు ఎక్కువగా ఇష్టపడేవారామె. ఈ క్రమంలోనే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆయుర్వేద వైద్యులు, మూలికా నిపుణుల్ని కలిసేవారు. నిజానికి ఈ అభ్యాసమే తన కూతురు కేశ సమస్యలకు పరిష్కారం చూపడానికి ఉపయోగపడిందంటారామె.

‘అప్పుడు నాకు 33 ఏళ్లు. గృహిణిగా, అమ్మగా బిజీగా ఉన్నా. మా ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా స్వతంత్రంగా, సహజసిద్ధంగా పరిష్కరించుకోవడానికే మొగ్గు చూపేదాన్ని. ఎందుకంటే నాకు ప్రకృతి వైద్యమంటే అంత నమ్మకం. నా కూతురు జుట్టు సమస్యనూ ఇలాగే పరిష్కరించాలనుకున్నా. ఈ క్రమంలో నేను చేసిన శోధనకు ప్రతిఫలమే నువ్వుల నూనెతో నేను తయారుచేసిన హెయిర్‌ ఆయిల్‌. ఆయుర్వేద నిపుణులు, మూలికా వైద్యుల సలహా తీసుకొని దీన్ని నా కూతురికి ఉపయోగించడం మొదలుపెట్టా. నాలుగు వారాల్లోనే మెరుగైన ఫలితం రావడం గమనించా. దీంతో మా ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఈ నూనె గురించి ఆరా తీయడం, కావాలనడంతో వాళ్లకూ తయారుచేసిచ్చా. దాంతో వాళ్ల దగ్గర్నుంచీ పాజిటివ్‌ ఫలితాలు రావడంతో ఈ నూనెతోనే ఓ వ్యాపార బ్రాండ్‌ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అలా 2008లో ‘మెల్లో’ ప్రారంభమైంది..’ అంటూ చెప్పుకొచ్చారు సుజాత.

లాయర్‌ వృత్తిని వదిలి..!

తొలుత హెయిర్‌ ఆయిల్‌, జుట్టు సంరక్షణ ఉత్పత్తులతో ప్రారంభమైన ఈ బ్రాండ్‌.. క్రమంగా ముఖ, చర్మ సంరక్షణ ఉత్పత్తులకూ విస్తరించింది. ఇవన్నీ ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన మూలికలతో తయారుచేసినవే! ఇలా వ్యాపారంలో దూకుడు మీదున్న సమయంలోనే కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం మెల్లో సంస్థ పైనా పడింది. అప్పుడే రంగంలోకి దిగింది ఆమె కూతురు వైశాలీ శార్దా. మానవ హక్కుల లాయర్‌గా పనిచేస్తోన్న ఆమె.. 2020లో మాస్టర్స్‌ కోసమని లండన్‌ వెళ్లింది. అయితే లాక్‌డౌన్‌ ప్రభావంతో తిరిగి స్వదేశం చేరుకున్న ఆమెకు.. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి తన తల్లి వ్యాపారం తిరిగి గాడిలో పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటోంది.

అమ్మ కోసమే ఈ అడుగు!

‘అసలు నాకు వ్యాపారంలోకి రావాలన్న ఆలోచనే లేదు. నా మనసంతా ఎప్పుడూ న్యాయవాద వృత్తి, మానవ హక్కులు, మహిళా సాధికారత.. వీటి చుట్టూనే తిరుగుతుండేది. కానీ కరోనా సమయంలో అమ్మ వ్యాపారాన్ని దగ్గర్నుంచి గమనించా. ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద పద్ధతుల్ని కొత్త తరం వారికి పరిచయం చేసే క్రమంలో ఆమె పడే తపన నన్ను ఆలోచనలో పడేసింది. పైగా ఆ సమయంలో కరోనా ప్రభావంతో వ్యాపారం కాస్త మందగించింది. ఎలాగైనా దీన్ని తిరిగి గాడిలో పడేయాలని అనుకున్నా. ఇందుకోసం ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకున్నా. బ్రాండ్‌ పేరుతో వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా పేజీల్ని క్రియేట్‌ చేశాం. ఉత్పత్తుల్ని వాటి ద్వారా విక్రయించడంతో పాటు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అమ్మడం ప్రారంభించాం. వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలా తిరిగి వ్యాపారంలో నిలదొక్కుకోగలిగాం.. నిజానికి ఈ క్రమంలో వినియోగదారులిచ్చే ఫీడ్‌బ్యాక్‌, సలహాలు.. ఈ వ్యాపార రంగంలో నిలదొక్కుకోవడానికి నాకెంతో ఉపయోగపడ్డాయి..’ అంటుంది వైశాలి.

‘మన శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ వృథా కావు. స్వీయ నమ్మకం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది..’ అంటూ తమ మాటలతోనూ ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతున్నారీ తల్లీకూతుళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని