Shy Girl Workout : అలాంటి మహిళల కోసమే ఇది!

ఏ పనైనా నలుగురిలో చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. చుట్టూ ఉన్న వారు తమను గమనిస్తున్నారన్న భావనతో అసౌకర్యానికి గురవుతుంటారు. చేసే పనిపైనా పూర్తి దృష్టి పెట్టలేరు. జిమ్‌లో వ్యాయామాలు చేసే క్రమంలోనూ....

Updated : 04 Jul 2023 18:03 IST

ఏ పనైనా నలుగురిలో చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. చుట్టూ ఉన్న వారు తమను గమనిస్తున్నారన్న భావనతో అసౌకర్యానికి గురవుతుంటారు. చేసే పనిపైనా పూర్తి దృష్టి పెట్టలేరు. జిమ్‌లో వ్యాయామాలు చేసే క్రమంలోనూ కొందరు మహిళలు ఇలాగే ఫీలవుతుంటారు. ‘జిమ్‌ యాంగ్జైటీ’గా పిలిచే ఈ పరిస్థితి వల్ల అటు వ్యాయామాలపై దృష్టి పెట్టలేరు.. ఇటు సమయానికి తమ ఫిట్‌నెస్‌ లక్ష్యాల్నీ అందుకోలేరు. అందుకే ఇలాంటి వారికోసమే ‘షై గర్ల్‌ వర్కవుట్‌’ ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. దీంతో మహిళలు సౌకర్యంగా వ్యాయామాలు చేయడమే కాదు.. ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోగలుగుతారంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటీ సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

అసలెందుకీ యాంగ్జైటీ?

జిమ్‌లో నలుగురి ముందు మహిళలు వ్యాయామాలు చేయకపోవడానికి వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

బరువు, శరీరాకృతి పరంగా నేటి మహిళలు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఒత్తిడి, ఆత్మన్యూనతకు గురై.. ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోతుంటారు. ఇలాంటి వారు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ శరీరాకృతిని చూసి నలుగురూ ఏమనుకుంటారోనన్న భయంతో జిమ్‌లో అందరి ముందు వ్యాయామాలు చేయడానికీ వెనకాడుతుంటారు.

ఇక కొంతమంది మహిళలు తమ అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరినప్పటికీ.. తోటి వారి నుంచి విమర్శలు, వేధింపులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారూ నలుగురిలో జిమ్‌ చేయలేరు.

విమర్శలు, వేధింపులతో సంబంధం లేకుండా.. కొంతమంది నలుగురిలో ఏ పనీ చేయలేరు.. ఇలాంటి స్వభావం ఉన్న వారు జిమ్‌లో నలుగురి మధ్య వ్యాయామాలూ చేయలేరు. దీన్నే ‘హైపర్‌ విజిబులిటీ’గా పేర్కొంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. పురుషాధిపత్యంతో కూడిన జిమ్‌ వాతావరణాన్ని చూసి మహిళల్లో ఇలాంటి భావన కలగచ్చంటున్నారు.

కొంతమంది జిమ్‌ ట్రైనర్స్‌, తోటి పురుషులు తమతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కూడా జిమ్‌ యాంగ్జైటీకి గురయ్యే మహిళల సంఖ్య పెరుగుతుందంటున్నారు నిపుణులు.

ఫిట్‌నెస్‌.. ఆత్మవిశ్వాసం!

ఇలా కారణమేదైనా.. జిమ్‌లో నలుగురి ముందు వ్యాయామాలు చేయడానికి ఇష్టపడని మహిళల కోసం ‘షై గర్ల్‌ వర్కవుట్‌’ అనే కొత్త ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. గతేడాది నుంచే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోన్న ఈ ఫిట్‌నెస్‌ పద్ధతి.. ఇటు మహిళలకు సౌకర్యవంతంగా ఉంటూనే.. అటు వారి ఫిట్‌నెస్‌ లక్ష్యాల్ని చేరుకునేందుకు దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న ప్రదేశాన్ని లేదా గదిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదేశంలో డంబెల్స్‌, కెటిల్‌బెల్స్‌, జంపింగ్‌ రోప్‌, స్టెబిలిటీ బాల్‌.. వంటి ప్రాథమిక జిమ్‌ సామగ్రిని అమర్చుతారు. అంటే.. వ్యాయామాలు చేయడం ప్రారంభించే వారు కాస్త అలవాటు పడడానికి ఎలాంటి ప్రాథమిక వర్కవుట్స్‌ అయితే చేస్తారో.. ఈ మహిళలతోనూ నిపుణులు అలాంటి చిన్న పాటి వ్యాయామాలే చేయిస్తారట! ఈ క్రమంలో వీరు చిన్న చిన్న ఫిట్‌నెస్‌ లక్ష్యాల్ని ఏర్పరచుకొని.. వాటిని చేరుకునేందుకు ట్రైనర్స్‌ సహకరిస్తారు. తద్వారా మహిళలు ఫిట్‌గా మారడంతో పాటు.. లక్ష్యాల్ని చేరుకునే క్రమంలో వారిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసమూ అలవడుతుంది.

వారికీ స్ఫూర్తిగా..!

అయితే ఇలా తమకు సౌకర్యవంతమైన ప్రదేశంలో వ్యాయామాలు చేస్తూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న మహిళలు.. ఆ తర్వాత్తర్వాత సాధారణ జిమ్‌లోనూ వర్కవుట్స్‌ చేయడానికి సిగ్గుపడరంటున్నారు నిపుణులు. తద్వారా నలుగురితోనూ సులభంగా కలిసిపోగలుగుతారు. అంతేకాదు.. తమ వ్యాయామ యాంగ్జైటీని, షై గర్ల్‌ వర్కవుట్‌ ట్రెండ్‌తో తమలో వచ్చిన మార్పుల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. నలుగురిలోనూ స్ఫూర్తి నింపచ్చు. తద్వారా వారిలో ఉన్న జిమ్‌ యాంగ్జైటీనీ దూరం చేస్తూ.. వారినీ తమ ఫిట్‌నెస్‌ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించచ్చు. ఇలా ఎలా చూసినా.. ఈ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ ఇటు వ్యక్తిగతంగా, అటు తోటి మహిళలకు మేలు చేస్తుందని చెప్పచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని