ఆ చీరతో మా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది!

రెండేళ్ల క్రితం విడుదలైన ‘శకుంతలా దేవి’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విద్య కట్టుకున్న మ్యాథమెటికల్‌ ప్రింట్‌ శారీ గుర్తుందా? నలుపు రంగు చీరపై గణిత సమీకరణాలు, సూత్రాల్ని తెలుపు రంగులో ప్రింట్‌ చేసిన ఈ చీర అప్పట్లో తెగ వైరలైంది. దీన్ని తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన.....

Published : 28 Sep 2022 21:10 IST

(Photos: Instagram)

రెండేళ్ల క్రితం విడుదలైన ‘శకుంతలా దేవి’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విద్య కట్టుకున్న మ్యాథమెటికల్‌ ప్రింట్‌ శారీ గుర్తుందా? నలుపు రంగు చీరపై గణిత సమీకరణాలు, సూత్రాల్ని తెలుపు రంగులో ప్రింట్‌ చేసిన ఈ చీర అప్పట్లో తెగ వైరలైంది. దీన్ని తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంస్థకు, కళాకారులకు విద్య ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపింది! అయితే ఆ సంస్థ మరెవరిదో కాదు.. ఒడిశాకు చెందిన అమృతా సంబాత్ తన సోదరితో కలిసి ఈ చేనేత వస్త్ర సంస్థను ప్రారంభించారు. తద్వారా ఆ రాష్ట్ర ప్రాచీన చేనేత వస్త్రాలు, హస్తకళలకు ప్రపంచ ఖ్యాతి తీసుకొస్తున్నారు. ప్రాచీన కళలు అంతరించిపోకుండా కాపాడడంతో పాటు అక్కడి హస్తకళాకారులకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. డాక్టర్ అవబోయి యాక్టర్‌ అయినట్లు.. ఐఏఎస్‌ కావాలనుకున్న అమృత.. తన మనసును వ్యాపారం వైపు ఎలా మళ్లించిందో తెలుసుకుందాం రండి..

అమృతా సంబాత్‌ది వ్యాపార కుటుంబం. ఆమె తాతయ్య, తండ్రి.. ఇద్దరూ పసుపు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించారు. అయితే తాను మాత్రం వ్యాపారం ప్రారంభిస్తానని ఎప్పుడూ అనుకోలేదు అమృత. ఎందుకంటే చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే ఆమెకు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనేది కల. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆమె క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికై బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.

మూడుసార్లూ నిరాశే!

అయినా ఐఏఎస్‌ కావాలన్న పట్టు వీడని అమృత.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్‌కి ప్రిపేరైంది. అయితే మూడు ప్రయత్నాల్లో ఆమెకు నిరాశే ఎదురైంది. అంతలోనే తన తల్లికి క్యాన్సర్‌ అని తెలియడంతో ఉద్యోగం మానేసి భువనేశ్వర్‌కు చేరుకుందామె. ఆపై కొన్ని రోజుల్లోనే తల్లిని కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైందామె. అయితే అప్పటికే స్థానిక హస్తకళల్ని, చేనేత వస్త్రాల్ని రూపొందించే వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది ఆమె సోదరి అనిత సంబాత్. ఈ ఆలోచన తనకూ నచ్చడంతో తన ఐఏఎస్‌ ప్రయత్నాలు విరమించుకొని వ్యాపారం వైపు తన మనసు మళ్లించింది అమృత. ఇలా 2015లో ‘ఉత్కళమ్రిత’ అనే సంస్థను నెలకొల్పారు.

తప్పు లేకపోయినా విమర్శలు తప్పలేదు!

మొదట మార్కెటింగ్‌ సంస్థగా ప్రారంభమైన తమ కంపెనీకి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పలు సవాళ్లు ఎదురయ్యాయంటున్నారు అమృత. ‘స్థానిక సంస్థల నుంచి హస్త కళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు మార్కెటింగ్‌ చేసేవాళ్లం. ఈ క్రమంలో కొన్ని నకిలీ ఉత్పత్తులు కూడా ఉండడంతో వినియోగదారుల నుంచి పలు ఇబ్బందులు, విమర్శలు ఎదురయ్యేవి. ఆ తర్వాత అలాంటి సంస్థలతో బంధాలు తెంచుకొని.. స్వయంగా ఈ ఉత్పత్తులు మేమే ఎందుకు తయారుచేయకూడదు? అన్న ఆలోచన వచ్చింది. అలా తొలుత చేనేత చీరల్ని తయారుచేయడం మొదలుపెట్టాం. గతంలో ఆప్లిక్ వర్క్‌కి సంబంధించిన చీరలు, దుస్తులు మార్కెట్లో లేకపోవడం గమనించిన నేను.. వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలనుకున్నా..’ అంటారు అమృత.

వీటికి డిమాండ్‌ ఎక్కువ!

ఇలా చీరలతో మొదలుపెట్టిన ఈ సోదరీమణుల వ్యాపారం.. హస్తకళా ఉత్పత్తులకూ విస్తరించింది. ప్రస్తుతం వీళ్ల సంస్థలో ఒడిశా ఇకత్‌ చీరలు, ఆప్లిక్ వర్క్తో రూపొందించిన దుస్తులు, రెడీమేడ్‌ దుస్తులు, వెండి ఆభరణాలు, వెండితో తయారుచేసిన గృహాలంకరణ వస్తువులు, ఇత్తడితో తయారుచేసిన హస్తకళా రూపాలు, పట్టచిత్ర పెయింటింగ్స్‌, టెర్రకోటా క్రాఫ్ట్స్‌, ట్రైబల్‌ జ్యుయలరీ.. వంటి ఎన్నో ఉత్పత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా దేశ, విదేశాల్లో విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారీ సంబాత్‌ సిస్టర్స్‌. అంతేకాదు.. ఒడిశా హస్తకళల్ని ఖండాంతరాలు దాటిస్తున్నారు కూడా!

విద్య కోసం ప్రత్యేకంగా..!

ఆయా ఉత్పత్తులు తయారుచేయడం, సామాన్యులకు విక్రయించడమే కాదు.. సెలబ్రిటీల నుంచీ ఆర్డర్లు అందుకుంటున్నారీ సోదరీమణులు. 2020లో విడుదలైన ‘శకుంతలా దేవి’ సినిమా ప్రమోషన్ల కోసం ఆ చిత్ర నాయిక విద్యాబాలన్‌ కోరిక మేరకు ప్రత్యేకమైన చీర రూపొందించి అందించారు అమృత, అనిత. తన సంస్థలో పనిచేసే ఓ కళాకారుడి చేతిలో రూపుదిద్దుకున్న ఈ చీరపై గణిత సూత్రాలు, సమీకరణాలు ముద్రించి ఉండడం, చిత్ర థీమ్‌కి తగినట్లుగా ఉండడంతో.. అప్పట్లో ఈ చీర తెగ వైరలైంది. ఇక ఈ చీర కట్టుకొని దిగిన ఫొటోల్ని విద్య సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఆ కళాకారుడికి, ఈ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

‘విద్యాబాలన్‌ కోసం ప్రత్యేక థీమ్‌తో కూడిన చీర రూపొందించడం ఓ మధురానుభూతి. నిజానికి ఆ చీర సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాక మా చీరలకు, ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరిగింది..’ అంటారు అమృత.

చీర డిజైన్‌ను బట్టి దాన్ని రూపొందించడానికి నెల నుంచి ఐదు నెలల సమయం పడుతుందంటోన్న సంబాత్‌ సిస్టర్స్‌.. ప్రస్తుతం తమ సంస్థ ద్వారా వెయ్యి మందికి పైగా ఉపాధి పొందుతున్నారని చెబుతున్నారు. ఓవైపు ఇక్కడి హస్తకళల్ని విశ్వవ్యాప్తం చేయడం, మరోవైపు కళాకారులకు ఉపాధి కల్పించడం.. ఇలా సమాజాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారీ సోదరీమణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని