ఈ బ్రేస్‌లెట్‌ మందులేసుకోవాలని గుర్తు చేస్తుంది!

ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు ఏదో ఒక అనారోగ్యంతో దీర్ఘకాలం పాటు మందులు వాడడం సహజమే! అయితే ఈ క్రమంలో కొంతమంది వేళకు మందులేసుకోవడం మర్చిపోతుంటారు.. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వారే ఆ విషయం గుర్తుపెట్టుకొని మరీ వారికి మందులిస్తారు. ఇలా వాళ్లతో ఎవరైనా ఉంటే సరే..! మరి, ఎవరూ లేకపోతే? మతిమరుపుతో పదే పదే ఇలా మందులేసుకోవడం మానేస్తే ఆ వయసులో వారి ఆరోగ్యానికే నష్టం. ఇదే విషయం 12 ఏళ్ల ఆస్తా మెహతాను ఆలోచనలో పడేసింది.

Updated : 06 Jul 2021 18:55 IST

Image for Representation

ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు ఏదో ఒక అనారోగ్యంతో దీర్ఘకాలం పాటు మందులు వాడడం సహజమే! అయితే ఈ క్రమంలో కొంతమంది వేళకు మందులేసుకోవడం మర్చిపోతుంటారు.. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వారే ఆ విషయం గుర్తుపెట్టుకొని మరీ వారికి మందులిస్తారు. ఇలా వాళ్లతో ఎవరైనా ఉంటే సరే..! మరి, ఎవరూ లేకపోతే? మతిమరుపుతో పదే పదే ఇలా మందులేసుకోవడం మానేస్తే ఆ వయసులో వారి ఆరోగ్యానికే నష్టం. ఇదే విషయం 12 ఏళ్ల ఆస్తా మెహతాను ఆలోచనలో పడేసింది. ‘మెడీబ్రేస్‌’ అనే ఓ సరికొత్త పరికరాన్ని తయారుచేసేందుకు తనను పురికొల్పింది. ఇలా తాను తయారుచేసిన ఈ మెడిసిన్‌ రిమైండర్‌ మందులేసుకోవాలన్న విషయాన్ని పెద్దవారికి వేళకు గుర్తు చేస్తుందని చెబుతోందీ అమ్మాయి.

ఆస్తా మెహతా.. ముంబయికి చెందిన ఈ పన్నెండేళ్ల అమ్మాయి ప్రస్తుతం అక్కడి క్యాథెడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ మిడిల్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగిన తనపై తన ఇంట్లో వాళ్ల ఆలోచనలు బాగానే ప్రభావం చూపాయట! ఈ క్రమంలో కుటుంబ సభ్యులు రోజూ వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం, వారు చేసే సృజనాత్మక ఆలోచనల్ని దగ్గర్నుంచి గమనించిన తను కూడా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించేదట! అలా ఒకరోజు తాత గారి విషయంలో ఎదురైన ఓ అనుభవం తాను ‘మెడిబ్రేస్‌’ అనే సరికొత్త పరికరం తయారుచేయడానికి ఊతమిచ్చిందంటోంది ఆస్తా.

తాతయ్య మతిమరుపుతో...

‘వయసు పైబడుతుంటే ఏదో ఒక దీర్ఘకాలిక అనారోగ్యం వేధిస్తుంటుంది. దీంతో ఏళ్ల పాటు మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే చాలామంది ఈ వయసులో వేళకు మందులు వేసుకోవడం మర్చిపోతుంటారు. మా తాతగారి విషయంలో ఓసారి ఇలాగే జరిగింది. ఓ రోజు తాతయ్య మందులు వేసుకున్నారో లేదోనని ఆరా తీస్తే.. లేదు మర్చిపోయానని సమాధానమిచ్చారు.. అయితే అప్పటికే తాను మెడిసిన్‌ వేసుకునే సమయం దాటిపోవడంతో ఆ రోజు మాత్ర వేసుకోలేకపోయారు. అప్పుడే నా మనసులో ఓ ఆలోచన మెదిలింది. వృద్ధుల్లో ఉన్న ఈ సమస్యను దూరం చేయడానికి వేళకు మందులు వేసుకోవాలన్న విషయం వారికి గుర్తు చేసే పరికరం ఒకటి తయారుచేయాలనుకున్నా. దాని ప్రతిరూపమే ఈ మెడీబ్రేస్’ అని చెబుతోందీ అమ్మాయి.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..!

స్వయానా వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆస్తా.. తన తల్లిదండ్రులు, తాతయ్య ప్రోత్సాహంతో ఈ పరికరాన్ని తయారుచేశానంటోంది. ‘మాది వ్యాపార కుటుంబం. అందుకే రోజూ మా ఇంట్లో ఇలాంటి విషయాలే చర్చకు వచ్చేవి! అలాగే అమ్మానాన్న వారికొచ్చిన కొత్త కొత్త ఐడియాలు ఒకరితో ఒకరు పంచుకునేవారు. అవి విని నా మనసూ క్రియేటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టింది. మొదట నా ఐడియాను అమ్మానాన్నలతో చెప్పినప్పుడు వారు ప్రోత్సహించడమే కాదు.. కొంత డబ్బును నా చేతికిచ్చారు. ఇక ఇదే ఐడియాను మా ‘యంగ్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ అకాడమీ (YEA) క్లాస్‌’లోనూ పంచుకున్నా. ఇలా అమ్మానాన్నల ప్రోత్సాహం, YEA మెంటార్స్‌ సహకారంతో మెడీబ్రేస్‌ తయారుచేశా..’ అంటోంది ఆస్తా.

వాచీలాగా ధరిస్తే సరి!

సిలికాన్‌, మెటల్‌.. ఈ రెండు మెటీరియల్స్‌తో రెండు రకాల మెడీబ్రేస్‌లను తయారుచేసింది ఆస్తా. అచ్చం చేతి గడియారాన్ని పోలి ఉండే ఈ పరికరాన్ని వాచీ లాగా ధరించాల్సి ఉంటుంది. ‘వయసుతో సంబంధం లేకుండా బీపీ, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు.. వంటి అనారోగ్యాలతో బాధపడే వారు నానాటికీ పెరిగిపోతున్నారు. అయితే యుక్త వయసులో ఉన్న వారైతే ఫోన్లోనే రిమైండర్‌ పెట్టుకోవచ్చు. వృద్ధులకు అలాంటి ఆప్షన్‌ ఉండచ్చు.. ఉండకపోవచ్చు..! అలాంటి వారికి నేను తయారుచేసిన మెడీబ్రేస్‌ చక్కగా ఉపయోగపడుతుంది. చేతి గడియారాన్ని పోలి ఉండే ఈ బ్రేస్‌లెట్‌లో డయల్‌ స్థానంలో చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఆ రోజు వేసుకోవాల్సిన మాత్రలు అందులో వేసుకొని.. టైమ్‌ సెట్‌ చేసుకుంటే ఆ సమయానికి మందులు వేసుకోవాలని అదే గుర్తు చేస్తుంది. ఇక మాత్రలు మన చెంతే ఉంటాయి కాబట్టి వెంటనే తీసి వేసుకోవచ్చు.. అయితే ఇలాంటి మెడిసిన్‌ రిమైండర్స్‌ మార్కెట్లో ఉన్నప్పటికీ మెడీబ్రేస్‌ ప్రత్యేకతే వేరు..! ఎందుకంటే ఇందులో రిమైండర్‌తో పాటు మందులు భద్రపరచుకోవడానికి బాక్స్‌ కూడా ఉంది..’ అంటూ తాను తయారుచేసిన పరికరం గురించి చెబుతోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

ఈ క్రమంలో ముందుగా కొన్ని నమూనాల్ని తయారుచేసి, కొంతమందితో పరీక్షించిన తర్వాతే తుదిగా సిలికాన్‌, మెటల్‌ మెడీబ్రేస్‌లను ఎంపిక చేసి వాటి నమూనాను తయారీదారులకు అప్పగించానని చెబుతోంది ఆస్తా. తన ఉత్పత్తిని దేశవ్యాప్తంగా ఎంతోమందికి చేరువ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాదు.. ఈ పరికరం కోసం ప్రస్తుతం తనకు కొన్ని కంపెనీల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయంటోందీ యూత్‌ ఐకాన్‌. ఇలా ప్రజల అవసరార్థం మరెన్నో సరికొత్త పరికరాల్ని రూపొందించి.. వాటిని వారికి చేరువ చేయడమే తన లక్ష్యమంటోందీ అమ్మాయి. మరి, తన కల నెరవేరాలని మనమూ కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ ఆస్తా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్