అప్పుడు నాన్న విలువ తెలుసుకోలేకపోయా.. ఇప్పుడు గర్వపడుతున్నా!

చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ అపురూపమే. అయితే అప్పుడు కొన్ని విషయాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇతరులతో పోల్చుకొని చిన్నబోవడం, మనకు లేనివి ఎదుటివాళ్లకుంటే నొచ్చుకోవడం.. ఇలాంటి అనుభవాలు చాలామందికి సుపరిచితమే! తానూ ఇందుకు మినహాయింపు....

Updated : 11 Nov 2022 18:56 IST

(Photos: LinkedIn)

చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ అపురూపమే. అయితే అప్పుడు కొన్ని విషయాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇతరులతో పోల్చుకొని చిన్నబోవడం, మనకు లేనివి ఎదుటివాళ్లకుంటే నొచ్చుకోవడం.. ఇలాంటి అనుభవాలు చాలామందికి సుపరిచితమే! తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బిహార్‌కు చెందిన ప్రాచీ థాకూర్‌. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్నతనంలో తన కుటుంబ ఆర్థిక స్థితిని ఇతరులతో పోల్చుకొని బాధపడేది.. తన తండ్రి వృత్తిని చూసి సిగ్గుపడేది. ‘అందరి నాన్నల్లా నువ్వెందుకు లేవ’ని తండ్రినే ఎదురు ప్రశ్నించేది. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆయన మంచితనాన్ని, విలువల్ని, ప్రోత్సాహాన్ని అర్థం చేసుకున్న ప్రాచీకి అప్పుడు ఆయన గొప్పతనమేంటో అర్థమైంది. ఇప్పుడు ఓ మంచి వక్తగా అందరి మన్ననలు అందుకుంటోన్న ఆమె.. తానింత స్థాయికి చేరడానికి తన తండ్రి ప్రోత్సాహమే కారణమంటోంది. ‘ఒకప్పుడు నా తండ్రి వృత్తిని చూసి సిగ్గుపడ్డా.. కానీ ఆయన కూతురిగా ఇప్పుడు గర్వపడుతున్నా..’ అంటూ తన కథను, అనుభవాల్ని కొద్దికాలం క్రితం ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది ప్రాచీ. ఇప్పటికీ అది వైరలవుతూ ఎందరిలోనో స్ఫూర్తి కలిగిస్తోంది.

‘కాలం గడిస్తే తిరిగి రాదు.. మాట జారితే వెనక్కి తీసుకోలేమం’టారు.. పెద్దయ్యాక గానీ దీని వెనకున్న అంతరార్థమేంటో నేను అర్థం చేసుకోలేకపోయాను. చిన్నతనంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని, మా నాన్న వృత్తిని చాలా తక్కువ చేసి చూసేదాన్ని. ఇతరులతో పోల్చుకొని ‘మనమెందుకు వాళ్లలా ఉన్నత స్థితిలో లేమ’ని నాన్నను ఎన్నిసార్లు అడిగానో లెక్కే లేదు.

******

మాది బిహార్‌లోని సుపౌల్‌ అనే చిన్న గ్రామం. అమ్మా, నాన్న, అన్నయ్య, నేను.. ఓ చిన్న గుడిసెలో నివాసముండేవాళ్లం. నాన్న రోడ్డు పక్కన చిన్న పాన్‌ షాప్‌ నడిపేవారు.. గ్యాస్‌ స్టౌ, కుక్కర్‌ రిపేర్లూ చేసేవారు. రొట్టె, ఉల్లిపాయలు, పచ్చడి.. రోజూ ఇదే మా భోజనం. మూడు పూటలా ఇవే తినీ తినీ బోర్‌ కొట్టేది. ఒక్కోసారి మా కుటుంబ పరిస్థితిని చూసి విసుగొచ్చేది. ఇలా మా దిగువ మధ్య తరగతి కుటుంబ పరిస్థితుల గురించి నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించేది. అందుకే స్కూల్లో ‘మీ కుటుంబం గురించి రాయమ’ని అడిగినప్పుడల్లా.. నాన్న వ్యాపారి అని, అమ్మ టైలర్‌ అని రాసేదాన్ని. కానీ మా గురించి తెలిసిన తోటి విద్యార్థులు ‘మీ నాన్నది పాన్‌ షాప్‌ కదా!’ అని హేళన చేసేవారు.. ఏడిపించేవారు. వాళ్ల మాటలకు ఏడుస్తూనే ఇంటి వరకూ పరిగెత్తిన సందర్భాలు ఎన్నో! ఇక ఇంటికొచ్చాక నాన్నతో.. ‘నాన్నా.. నువ్వెందుకు అందరు నాన్నల్లా ఆఫీసుకెళ్లట్లేదు..?’ అని అడిగేదాన్ని. నా అమాయకత్వానికి నాన్న నవ్వి నా కళ్లు తుడుస్తూ.. ‘జీవితమంటే డబ్బే కాదు.. జీవితంలో అది ఓ చిన్న భాగం మాత్రమే!’ అని చెప్పేవారు. ఆయన మాటలు, వాటి విలువను అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను.

ఇక పెరిగి పెద్దయ్యే క్రమంలోనూ ఇలాంటి అనుభవాలెన్నో ఎదుర్కొన్నా. అందరి తండ్రుల్లా మా నాన్న ఉద్యోగం చేస్తే చూడాలని, ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించాలని, మంచి జీతం అందుకుంటే ఆ డబ్బుతో నాణ్యమైన పుస్తకాలు/నోట్‌బుక్స్‌ కొనుక్కోవచ్చని.. నా ఆలోచనలెప్పుడూ ఇలానే ఉండేవి. వీటి గురించి నాన్న వద్ద ప్రస్తావించినా ఆయన తటస్థంగానే ఉండేవారు తప్ప.. తిరిగి ఒక్కమాట కూడా నా మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు కాదు. సమయమొచ్చినప్పుడు తనకే అర్థమవుతుందన్న సంయమనంతోనే ఇలా ప్రవర్తించారేమోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఇలాంటి నైరాశ్య భావనతోనే పదో తరగతి పూర్తిచేశా.. ఇక ఎప్పుడైతే ఇంటర్‌లో చేరానో.. అప్పుడే నా జీవితం యూ-టర్న్‌ తీసుకుంది. నా ఆలోచనల్లో మార్పు మొదలైంది.

******

అదేంటి.. ఉన్నట్లుండి ఆలోచనల్లో మార్పు ఎలా వచ్చింది? అనేగా మీ సందేహం.. అందుకూ నాన్న చొరవే కారణం. సాధారణంగా మా ఊర్లో అమ్మాయిలు పదో తరగతి చదువుకోవడమే గొప్ప. ఇక ఆ తర్వాత ప్రతి కుటుంబం ఆడపిల్లల్ని చదువు మాన్పించి.. వారిని పెళ్లికి సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో అమ్మాయిలేమో.. అత్తారింట్లో ఎలా నడుచుకోవాలి? వంటలెలా చేయాలి? అన్న అంశాలపై దృష్టి సారిస్తే.. వారి తండ్రులు కట్నం డబ్బులు పొదుపు చేసే పనిలో నిమగ్నమవుతారు. కానీ మా నాన్న వీళ్లందరికీ మినహాయింపు! ‘ప్రాచీ చదువుకు ఎందుకలా డబ్బు వృథా చేస్తావ్‌? పెళ్లి చేసి అత్తారింటికి పంపక!’ అంటూ ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు పోరు పెట్టేవారు. కానీ నాన్న వాళ్ల మాటల్ని లెక్క చేయక.. నన్ను పైచదువుల కోసం ప్రోత్సహించారు. ఇలా ఆయన ప్రోత్సాహంతో పుదుచ్చేరి యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసిన నేను.. ఆపై ఓవైపు పీహెచ్‌డీ చేస్తూనే.. మరోవైపు ఐఐటీ రూర్కీలో టీచింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేశాను. టెడెక్స్‌ స్పీకర్‌గానూ ఎదగగలిగాను.

అందరూ తమ కూతుళ్లను సాయంత్రమైతే గడప దాటనిచ్చేవారు కాదు. కానీ నాన్న నా కోసం రాత్రుళ్లు కూడా బయటకొచ్చేవారు. ‘ఆడపిల్లవి.. నలుగురిలో కుదురుగా ఉండడం నేర్చుకో..’ అని అందరూ తమ కూతుళ్ల నోరు నొక్కితే.. మా నాన్నేమో.. స్టేజీపై ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించేవారు. నాకు పుదుచ్చేరిలో పీజీ సీటొస్తే.. నాన్న నాతో పాటే వచ్చి నన్ను కాలేజీలో చేర్పించారు. అమ్మ ఇంట్లో లేనప్పుడు నాన్నే వంట చేసి పెట్టేవారు.. అమ్మను జిమ్‌కు వెళ్లేలా ప్రోత్సహించేవారు.. అంతెందుకు.. అందరూ తమ కొడుకుల్ని కూతుళ్లను పెంచే విధానంలో వ్యత్యాసం చూపిస్తే.. మా నాన్న నన్ను, అన్నయ్యను సమానంగా పెంచి పెద్ద చేశారు. నేను వక్తగా మారాక చాలామంది నన్నో విషయం అడిగేవారు. ‘స్టేజ్‌పై మీరు ఇంత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా మాట్లాడగలుగుతున్నారు?’ అని! ఆ ధైర్యం మా నాన్నే! నేనీ స్థాయికి చేరుకోవడానికి మా నాన్న ప్రోత్సాహమే కారణం!

******

ఒకప్పుడు నాన్న వృత్తిని తలచుకొని సిగ్గు పడిన నేనే.. ఇప్పుడు ఆయన కూతురిగా గర్వపడుతున్నా.. ప్రస్తుతం నేను ‘వరల్డ్‌ విమెన్‌ టూరిజం’ సంస్థలో డైవర్సిటీ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నా. నేనీ స్థాయిలో ఉన్నా.. నాన్న తన సింప్లిసిటీని వీడలేదు. ఇప్పటికీ అదే పాన్‌ షాప్‌.. అవే కుక్కర్‌, స్టౌ రిపేర్లు..! థ్యాంక్యూ నాన్నా.. జీవితం విలువ తెలియజేసి.. నన్నీ స్థాయికి చేర్చినందుకు.. ఇంకో జన్మంటూ ఉంటే.. నీకు నాన్నగా పుట్టి నీ రుణం తీర్చుకుంటా..!

ఇట్లు,

నీ ముద్దుల కూతురు,

ప్రాచీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్