వేసవిలోనూ మొక్కలు పచ్చగా ఉండాలంటే..!

ఎండలు ఠారెత్తించేస్తున్నాయి.. ఊపిరి సలపని వేడి కారణంగా కాసేపటికి మనమే బేజారవుతుంటే.. ఇక మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ ఎండ వల్ల వాటికి కూడా కొన్ని నష్టాలు వాటిల్లే.......

Updated : 21 Apr 2022 20:53 IST

ఎండలు ఠారెత్తించేస్తున్నాయి.. ఊపిరి సలపని వేడి కారణంగా కాసేపటికి మనమే బేజారవుతుంటే.. ఇక మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ ఎండ వల్ల వాటికి కూడా కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశాలున్నాయి. అంతేకాదు.. సాధారణంగా వేసవిలో గార్డెన్స్‌లోని ఆకులు, పూలు వాడిపోయినట్త్లె అందవిహీనంగా కనిపిస్తాయి. మరి, అలా జరగకుండా వేసవి అంతా మొక్కలు పచ్చగా, ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలంటున్నారు గార్డెనింగ్ నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కొన్ని మొక్కలు ఏ కాలంలోని పరిస్థితులనైనా తట్టుకొని ఎదిగితే, మరికొన్ని ప్రత్యేకించి కొన్ని కాలాల్లోనే బాగా ఎదగగలుగుతాయి. అలా వేసవిలో ఆరోగ్యంగా పెరిగే సామర్థ్యం ఉన్న రోజా, బౌగెన్‌విలా (కాగితపు పూల చెట్టు), పుచ్చకాయ, కీరాదోస.. మొదలైన చెట్లు నాటుకుంటే ఎండను తట్టుకోగలవు కాబట్టి తాజాగా, పచ్చగా కనిపిస్తూ ఇంటికి కళను తీసుకొస్తాయి.

పాక్షికంగా నీడ పడేలా..!

వేసవిలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని మొక్కల ఆకులు, పువ్వులు వాడిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి. అలాకాకుండా ఉండాలంటే ఎండ ఎక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 11గం|| నుంచి మధ్యాహ్నం 3గం|| వరకు సూర్యకిరణాలు నేరుగా మొక్కలపై పడకుండా పలుచగా ఉన్న వస్త్రంతో లేదా షేడ్‌నెట్స్‌తో వాటికి నీడ ఏర్పాటు చేయాలి. ఫలితంగా మొక్కలకు అవసరమైన మేర సూర్యరశ్మి అందడంతో పాటు, అధిక వేడిమి నుంచి వాటికి రక్షణ కల్పించినట్లు అవుతుంది.

సమయానికి నీరు..

వేసవిలో మీరు మొక్కలకు నీళ్లు ఎప్పుడు పోస్తారు?? ఎండగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 11, లేదా సాయంత్రం 3గం||లకు పోస్తాం అంటారా?? అయితే వాటి ఆరోగ్యాన్ని మీరే చేజేతులా పాడు చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి నీరు పెడితే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వేసవిలో ఉదయం 10గం||లకు ముందు లేదా సాయంత్రం 5గం||ల తర్వాత మాత్రమే మొక్కలకు నీళ్లు పోయాలి. అలాగే మధ్యమధ్యలో స్ప్రింక్లర్స్ లేదా మగ్గుతో నీటిని చిలకరిస్తూ ఉండాలి. ఈ క్రమంలో పోసిన నీళ్లు కూడా కుండీ లేదా మట్టిలో నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. లేదంటే అక్కడ దోమలు ఆవాసాలు ఏర్పరుచుకొని కొత్త సమస్యలను తెచ్చిపెడతాయి.

మొక్కలు నాటుతున్నారా??

వేసవిలో ఉన్న మొక్కలను సంరక్షించుకోవడం ఒక ఎత్త్తెతే; కొత్తగా మొక్కలు నాటడం మరొక ఎత్తు. ఈ క్రమంలో మొక్క నాటే ప్రదేశం దగ్గర్నుంచి దానికి అందించే పోషకాల వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొత్త మొక్క నాటాలనుకునేటప్పుడు ఎండ నేరుగా పడే ప్రాంతంలో కాకుండా పెద్ద చెట్లు ఉన్న ఆవరణలో అది కూడా రోజులో కాసేపు సూర్యరశ్మి పడే వెసులుబాటు ఉన్న ప్రదేశంలో నాటుకుంటే సరిపోతుంది. ఫలితంగా మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే సూర్యరశ్మి అందడంతో పాటు, అధిక వేడిమి నుంచి పెద్ద చెట్టే దానికి రక్షణ కల్పిస్తుంది.

పొట్టు వేయండి..

చెక్క పొట్టు లేదా రంపపు పొట్టును మొక్కల మొదళ్ల వద్ద వేయడం వల్ల మట్టిలో తేమ అధిక సమయం నిలిచి ఉంటుంది. అలాగే సూర్యరశ్మి ప్రభావం మొక్కపై అధికంగా పడకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఈ పొట్టుని నిర్ణీత వ్యవధిలో మార్చాలన్న విషయం మాత్రం మరవద్దు.

ఈ జాగ్రత్తలు కూడా..

* మొక్కల పెంపకం కోసం కంపోస్ట్, సహజసిద్ధమైన ఎరువులు.. ఉపయోగించాలి. వీటి ద్వారా మొక్కకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందడమే కాకుండా అధిక వేడిమిని తట్టుకునే సామర్థ్యం కూడా వాటికి లభిస్తుంది.

* ఇండోర్ మొక్కలకు సూర్యరశ్మి అవసరం ఉండదు అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే అవి కూడా దీర్ఘకాలం పాటు పచ్చగా, తాజాగా కనిపించాలంటే ఉదయాన్నే కాసేపైనా వాటికి ఎండ తగిలేలా ఏర్పాటు చేయాలి.

* ఏపుగా ఉన్న మొక్కలను ప్రూనింగ్ చేయడం ద్వారా కూడా అవి వేసవి వేడిని తట్టుకునేలా చేయచ్చు.

చూశారుగా.. వేసవిలో మొక్కలు తాజాగా, పచ్చగా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో.. మీరు కూడా వీటిని గుర్తుపెట్టుకొని అనుసరించడానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్