Parenting: వారెదుట వాగ్వివాదం వద్దు...
ఆరో తరగతి చదువుతున్న గణేశ్ స్కూల్ నుంచి ఇంటికెళ్లడానికి ఇష్టపడడు. ఎనిమిదేళ్ల సృజనకు స్నేహితురాలి అమ్మానాన్నలను చూసి అసూయ. కారణం వీళ్ల అమ్మానాన్నల పోట్లాట.
ఆరో తరగతి చదువుతున్న గణేశ్ స్కూల్ నుంచి ఇంటికెళ్లడానికి ఇష్టపడడు. ఎనిమిదేళ్ల సృజనకు స్నేహితురాలి అమ్మానాన్నలను చూసి అసూయ. కారణం వీళ్ల అమ్మానాన్నల పోట్లాట. పిల్లలెదుట తల్లిదండ్రుల వాగ్వివాదం వారి భవిష్యత్తును ప్రమాదకరంగా మారుస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆఫీసు నుంచి సమయానికి రావడంలేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని, ఇల్లు.. పిల్లల బాధ్యత మోయలేకపోతున్నానంటూ.. నాన్నతో అమ్మ రోజూ చేసే రాద్ధాంతం ఆ చిన్నారులకు నరకప్రాయం. ఇంటికి రాగానే తమతో సమయాన్ని గడపకుండా తల్లితో వాదనకు దిగే తండ్రిపై పిల్లలు అయిష్టత పెంచుకొంటారు. దంపతులు మాటలతో దాడి చేసుకొంటే, ఆ పసి పిల్లల మనసులో వారి పట్ల ప్రేమ స్థానంలో కోపం పెరుగుతుంది. ఇది వారి శారీరక, మానసికారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
కుంగుబాటుతో.. తీవ్ర భేేదాభిప్రాయాలతో ఒకరికొకరు దూరమవ్వాలనుకొనే తల్లిదండ్రుల మధ్య పిల్లల పరిస్థితి మరింత గందరగోళం. వ్యక్తిగతజీవితాల గురించి మాత్రమే ఆలోచిస్తూ తమ కన్నబిడ్డల మానసిక స్థితిని ఆ భార్యాభర్తలు అర్థం చేసుకోరు. ఎవరికి వారు తామే కరెక్ట్ అని నిరూపించుకొనే ప్రయత్నంలో.. పిల్లల పరిస్థితిని మరిచి పోతుంటారు. అమ్మానాన్నల సమస్య తెలియక, వారి మధ్య ఏం జరుగుతుందో అర్థంకాక ఆ చిన్నారులు అయోమయానికి గురవుతారు. వారెక్కడ తమకు దూరమవుతారో అనే భయం వారిని కుంగుబాటుకు గురి చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమితో సరైన పోషకాహారంలేక అనారోగ్యంపాలవుతారు. చదువులోనూ వెనకబడతారు. తోటి పిల్లలతో కలవలేరు.
పరిష్కారం.. ఇంటి వాతావరణమే చిన్నారుల శారీరక, మానసికారోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి ఇంటిని ప్రశాంతంగా, నిత్యం సంతోషంగా ఉంచడానికి పెద్దలు కృషి చేయాలి. తమ భేదాభిప్రాయాలు, వాదనల మధ్యకు పిల్లలను తీసుకు రాకూడదు. తమకోసం వారిని సాక్షులుగా, సమాచారం అందించే వారిలా తయారు చేయకూడదు. వారెదుట పెద్దవాళ్లు ఒకరినొకరు అవమానించుకోవడం, దాడికి పాల్పడటం చేయకూడదు. వారి కోపం, విసుగు చిన్నారులపై ప్రదర్శించకూడదు. సమస్య ఉన్నప్పుడు సున్నితంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలెదుట చర్చించకూడదు. బాల్యాన్ని చిన్నారులకు తీపి జ్ఞాపకంగా మిగల్చడంలో తల్లిదండ్రులిద్దరూ సమష్టిగా కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.