Relationship: కలిసి.. నడవండి!
‘పనిలో పడితే ఆయనకు నేనొకదాన్ని ఉన్నానన్నదే గుర్తుండదు’ అన్నది ఆమె ఫిర్యాదు. మరి ఆయనా? ‘పిల్లలుంటే చాలు నా ఊసే ఉండదు’ అనుకుంటారు.
‘పనిలో పడితే ఆయనకు నేనొకదాన్ని ఉన్నానన్నదే గుర్తుండదు’ అన్నది ఆమె ఫిర్యాదు. మరి ఆయనా? ‘పిల్లలుంటే చాలు నా ఊసే ఉండదు’ అనుకుంటారు. ఇద్దరూ ఒకరిమీద మరొకరు ఫిర్యాదు చేసుకుంటూ కూర్చొంటే దూరం తగ్గేదెలా? అందుకే.. రోజూ కాసేపు కలిసి నడిస్తే చాలు అన్యోన్యత పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు.
* ఉదయమో, సాయంకాల వేళో.. ఓ 20 నిమిషాలు కేటాయించుకోండి. కలిసి ప్రకృతిలోనో, వాహనాల రొద లేని ప్రదేశంలోనో నడక ప్రారంభించండి. ఓ అధ్యయనం ప్రకారం భాగస్వామితో నడక కార్టిసాల్ స్థాయులు తద్వారా ఒత్తిడి తగ్గేలా చేయగలదట.
* ఇంట్లో అయితే టీవీ, పిల్లలు, పనులు, ఫోన్.. సరిగా మాట్లాడాలనుకున్నా దాన్ని కొనసాగనివ్వని అవాంతరాలెన్నో. ఈ సమయం మనసు విప్పి మాట్లాడుకోవడానికీ సాయపడుతుంది. అయితే ఫోన్‌ని మాత్రం వెంట తీసుకెళ్లొద్దు. మనస్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈ సమయంలో మాట్లాడే ఏ అంశమైనా.. మనసు లోతుల్లోంచి వస్తుంది. అది బంధం బలపడేలా చేస్తుంది.
* నడక శరీరం, మనసు రెంటినీ ఉత్తేజితం చేస్తుంది. తెలియకుండానే మనసు కుదుటపడేలా చేస్తుంది. అందుకే భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే అలిగి కూర్చోక కలిసి నడవమంటారు.
* మాట్లాడటం ఇష్టం లేదా.. మౌనంగా కలిసి సాగినా మంచిదేనట. ఎలాగంటే.. సాధారణంగా ఆడవాళ్ల కంటే మగవాళ్లు వేగంగా నడుస్తారు. కలిసి వెళ్లేప్పుడు దాన్ని గమనించుకొని వేగం తగ్గించడం, ఇబ్బందిని కనుక్కోవడం వంటివీ సానుకూలాంశాలే. ఇద్దరూ ఇలా ఒకరినొకరు తెలియకుండానే గమనించుకుంటారట. దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారట. ఇది ఇతర అంశాల్లోనూ కొనసాగి బంధం బలపడేలా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.