Pregnancy: అప్పుడు నిద్ర పట్టడం లేదా?

మాతృత్వం ఎంత మధురమైనదే అయినా ఈ సమయంలో కొన్ని సమస్యలూ తప్పవు. నెలలు నిండుతున్న కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే....

Published : 29 Apr 2023 17:23 IST

మాతృత్వం ఎంత మధురమైనదే అయినా ఈ సమయంలో కొన్ని సమస్యలూ తప్పవు. నెలలు నిండుతున్న కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడడం అంత కష్టం కాదంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం రండి.

సాయంత్రం లోపే..

ఈ సమయంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి రాత్రి పూట ఎక్కువగా బాత్‌రూంకి వెళ్లాల్సి రావడం. అందువల్ల మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగేయాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కాస్త తక్కువ నీళ్లు తీసుకున్నా సరిపోతుంది. దీనివల్ల రాత్రి పూట మధ్యలో పదేపదే మెలకువ రాకుండా ఉంటుంది.

వ్యాయామం చేయండి..

ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పనీ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కొంతమంది. అయితే అది కరెక్ట్ కాదు.. డాక్టర్లు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప పూర్తి విశ్రాంతి పనికి రాదు. తేలిక పాటి వ్యాయామం మీకూ, కడుపులోని బిడ్డకూ కూడా చాలా మంచిది. దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. రాత్రి కూడా హాయిగా నిద్రపోగలుగుతారు. అయితే పడుకోవడానికి నాలుగైదు గంటల ముందు నుంచి ఎక్సర్‌సైజ్ చేయకపోవడం మంచిది. రోజూ వ్యాయామం చేసే సమయాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. మరీ ఎక్కువసేపు చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు మంచివన్న విషయంలో వైద్యులను, సంబంధిత నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

ఆందోళన వదిలేయండి..

ఒత్తిడి, ఆందోళన రాత్రి నిద్ర పాడు చేసే కారణాల్లో ప్రధానమైనవి. ఇంట్లో, ఆఫీసులో సమస్యలు, డెలివరీ గురించి ఉండే భయాలు ఇలాంటివేవైనా కావచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురై నిద్ర పోకపోవడం మీ బిడ్డ మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే ఆందోళన పడటం మానేయండి.

టైం సెట్ చేసుకోండి

రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటివి ఉపయోగించటం చేయకూడదు. కనీసం పడుకునే సమయానికి అరగంట ముందే ఇవన్నీ ఆపేయాలి. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వెచ్చటి పాలు తాగడం వంటి వాటి వల్ల కూడా చక్కటి ఫలితాలుంటాయి. సుఖంగా నిద్రపడుతుంది.

మసాజ్ మంచిదే..

పడుకోవడానికి కనీసం గంట ముందు తలను, కాళ్లను సున్నితంగా మసాజ్ చేయించుకుంటే నరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని