Mental Health: గర్భిణుల మానసికారోగ్యం భద్రం...

గర్భందాల్చి ప్రసవించడమనేది ప్రతి మహిళకూ మళ్లీ జన్మించిన అనుభవాన్నిస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు శారీరకంగానే కాదు, మానసికారోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 15 May 2023 00:38 IST

గర్భందాల్చి ప్రసవించడమనేది ప్రతి మహిళకూ మళ్లీ జన్మించిన అనుభవాన్నిస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు శారీరకంగానే కాదు, మానసికారోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే తీవ్ర ఒత్తిడి, ఆందోళన దరికి చేరి, కుంగుబాటుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

శారీరక, మానసికారోగ్యం ఉంటేనే పండంటి పాపాయికి జన్మనివ్వొచ్చు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు. అయితే, ఈ స్థితిలో హార్మోన్ల అసమతుల్యత, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లూ, శారీరక, మానసిక మార్పులు వంటివన్నీ ఒత్తిడికి కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100మంది గర్భిణుల్లో 30 మంది ఈ రకమైన సమస్యలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే నిపుణులు ‘యాంటినాటల్‌ డిప్రెషన్‌’ అంటున్నారు. దీన్నుంచి బయటపడటానికి వ్యాయామాలూ, మానసికారోగ్యాన్ని పరిరక్షించుకొనే సూత్రాలనూ చెబుతున్నారు.

కారణాలివే... గర్భందాల్చడం మనసుకు నచ్చకపోవచ్చు. లేదా ఇల్లు, ఆఫీస్‌లో బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవడం వంటివి ఈ సమస్యకు కారణాలవుతాయి. ఎక్కువ ఆలోచించడం, ఏం జరగనుందోనని భయపడటం దీనికి తోడవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులతో పుట్టబోయే బిడ్డను అనుకున్నట్లుగా పెంచలేకపోతామనే ఒత్తిడి, ఆందోళనను మరింత ఎక్కువ చేస్తుంది. ఇవన్నీ మానసికరుగ్మతకు దారితీస్తాయి.

యోగాతో.. ప్రీనాటల్‌ యోగాతో ఒత్తిడి, ఆందోళనను దూరం చేయొచ్చు. కటి, నడుము, పొట్ట కండరాలకు యోగా మంచి వ్యాయామం అవుతుంది. అయితే నిపుణుల సూచనలు, సలహాలు తప్పనిసరి. ఇది భావోద్వేగాల మార్పులను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా ఈ ఒత్తిడికి ఔషధంలాంటిదే. మెడిటేషన్‌తో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు. నిపుణులతో మాట్లాడి కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. కొన్ని సానుకూల అంశాలను తీసుకొని గట్టిగా చదవడం అలవరుచుకుంటే మనసు వాటిని గ్రహించి ప్రతికూలత ఆలోచనలను దరికి రానీయదు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సమస్యలను పంచుకోవాలి. గర్భిణుల బృందంలో సభ్యురాలిగా చేరి సమస్యలను పంచుకోవచ్చు. విశ్రాంతి, పోషకాహారం, కంటినిండా నిద్రపోవడం, రెండు పూటలా పావుగంట నడక వంటివన్నీ శారీరక, మానసికారోగ్యాల్ని పెంపొందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్