ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారా? ఇవి తీసుకెళ్లండి..!

ఈ రోజుల్లో సాహస యాత్రలు చేసే అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఎంతోమంది కొండలు, గుట్టలు, పర్వతాలు ఎక్కేస్తున్నారు. ఒంటరిగానే ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారు. అయితే హిల్‌ స్టేషన్స్ వద్ద నివాసాలు, దుకాణాలు తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏదైనా అవసరమైతే వెంటనే...

Published : 23 Jul 2022 18:04 IST

ఈ రోజుల్లో సాహస యాత్రలు చేసే అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఎంతోమంది కొండలు, గుట్టలు, పర్వతాలు ఎక్కేస్తున్నారు. ఒంటరిగానే ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారు. అయితే హిల్‌ స్టేషన్స్ వద్ద నివాసాలు, దుకాణాలు తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏదైనా అవసరమైతే వెంటనే లభించే అవకాశం ఉండదు. కాబట్టి, ట్రెక్కింగ్‌కు వెళ్లే ముందు కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలో తెలుసుకుందామా...

ఇవి వెంట ఉండాల్సిందే!

మహిళలు ప్రయాణాల్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య పిరియడ్స్‌. ఆ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌, టాంపూన్స్‌, మెన్స్ట్రువల్‌ కప్స్‌ వంటివి లేకపోతే పలు సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ట్రెక్కింగ్‌ వంటి సాహస యాత్రలకు వెళ్లేటప్పుడు వీటిని తప్పకుండా తీసుకెళ్లాలి. వీటితో పాటు టాయిలెట్‌ వైప్స్‌ను కూడా తీసుకెళ్లడం మంచిది. పరిశుభ్రమైన నీరు లభించనప్పుడు ఇవి ఉపయోగపడతాయి.

పవర్‌ బ్యాంక్

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి. అయితే ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ఛార్జింగ్‌ సదుపాయం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీ బ్యాగులో ఓ పవర్‌ బ్యాంక్ ఉంచుకోవడం ఉత్తమం. దీనిద్వారా అవసరమైనప్పుడు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. అయితే పవర్ బ్యాంక్‌ సామర్థ్యం కొంచెం ఎక్కువగా ఉన్నది తీసుకెళ్లడం మంచిది.

నగదు ఉండాల్సిందే..

ఇప్పుడు చాలామంది ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. దానికి తగ్గట్టే కిరాణాషాపుల దగ్గర్నుంచి తోపుడు బండ్ల దాకా డిజిటల్‌ పేమెంట్స్‌ ఉపయోగిస్తున్నారు. దాంతో చాలామంది నగదుకు బదులు కార్డులు, పేమెంట్‌ యాప్స్‌ మీద ఆధారపడుతున్నారు. అయితే కొండప్రాంతాల్లో ఇలాంటి సౌలభ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏటిఎమ్‌లు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. కాబట్టి, ట్రెక్కింగ్‌కి వెళ్తున్నప్పుడు మీ వెంట కొంత నగదును తీసుకెళ్లడం మంచిది. వాటిని 10, 20, 50 నోట్ల రూపంలో తీసుకెళ్లడం మరీ మంచిది.

మందులు కూడా...

కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండవు. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు గాలులు వీస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తుంటాయి. ఫలితంగా జ్వరం, దగ్గు, జలుబు.. వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన ట్యాబ్లెట్లను తీసుకెళ్లడం మంచిది. అలాగే ఒక పోర్టబుల్‌ గొడుగు కూడా తీసుకెళ్లాలి. ఇది వర్షం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది.

లెదర్ జాకెట్, వాటర్‌ బాటిల్..

హిల్‌ స్టేషన్లలో చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, దీనికి అనుగుణంగా ఒక లెదర్ జాకెట్‌ని తీసుకెళ్లడం మంచిది. రెయిన్‌కోట్‌ లాంటిదైతే రెండు విధాలుగానూ ఉపయోగించుకోవచ్చు. అలాగే థర్మల్‌ వాటర్‌ బాటిల్‌ను కూడా తీసుకెళ్లాలి. ఇందులో నీళ్లు ఎక్కువసేపు వేడిగా ఉంటాయి.

చూశారుగా.. కొండప్రాంతాలకు వెళ్లినప్పుడు ఏయే వస్తువులు తీసుకెళ్లాలో.. అయితే అన్ని వస్తువులు తీసుకెళ్లినప్పుడు లగేజీ కూడా భారంగా మారుతుంది. కాబట్టి, మీరు తీసుకువెళ్లే వస్తువులు తక్కువ బరువు ఉండేవిధంగా చూసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్