Published : 05/03/2023 14:06 IST

గర్భం దాల్చాక నిద్ర పట్టడం లేదా?

గర్భం ధరించాక మరికొన్ని నెలల్లో పండంటి పసిబిడ్డ మన చేతుల్లో ఉంటుందంటే ఆనందమేగా! అందుకే గర్భం ధరించారని తెలియగానే ఇంట్లో వాళ్లంతా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు.. అయితే వాళ్లంతా ఎంత బాగా చూసుకున్నా.. ఈ సమయంలో ఎదురయ్యే కొన్ని ఆరోగ్య సమస్యలు మనల్ని ఆనందంగా ఉండనివ్వవు. ఇలాంటి వాటిల్లో ఒకటి నిద్ర పట్టకపోవడం. దీనివల్ల రోజంతా చిరాగ్గా, అసహనంగా ఉంటుంది. ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగితే అది తల్లీ, బిడ్డా ఇద్దరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కడుపుతో ఉన్నప్పుడు చక్కటి నిద్ర చాలా అవసరం. మరి కలతలు లేని నిద్ర సొంతం కావాలంటే పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసుకుందామా?

నిద్ర పట్టని సమస్య సాధారణంగా ప్రెగ్నెన్సీ మొదటి, చివరి నెలల్లో ఎదురవుతూ ఉంటుంది. మొదటి నెలల్లో ఎక్కువగా వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో పాటు పగలు నిద్ర పోవాలనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల రాత్రుళ్లు నిద్ర పట్టకపోవచ్చు. ప్రొజెస్టిరాన్ స్థాయి పెరగడం కూడా దీనికి కారణమే.. ఈ క్రమంలో రోజూ పగలు కాసేపు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక పడుకునే యాంగిల్‌లో కూడా మార్పులు చేసుకోవడం అవసరం. గర్భాశయంలో బిడ్డ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మూత్రాశయంపై ఒత్తిడి పడి ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. అలాగని నీళ్లు తక్కువగా తాగడం మంచి పద్ధతి కాదు.

మొదటి నెలల్లో అలా ఉంటే, చివరి నెలల్లో సమస్యల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల అసలు నిద్ర పోవడమే తగ్గిపోతుంది. పెరిగిన పొట్ట వల్ల బోర్లా పడుకోవాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. వెల్లకిలా పడుకోవాలంటే బిడ్డకు ఇబ్బందిగా ఉంటుందని ఆ పొజిషన్‌లో పడుకోవడం మానేస్తారు చాలామంది. పగలు నిద్రపోవడం వల్ల కూడా రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టదు. వీటితో పాటు ఇతరత్రా సమస్యలు కూడా చాలానే ఉంటాయి. ప్రతి సమస్యను ఏదో ఒక రకంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే చక్కగా నిద్రపోయి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. అలాగే మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

'కెఫీన్' వద్దు..

కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, చాక్లెట్లు, సోడా వంటి వాటిని తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఒకవేళ మానేయడం కష్టమనుకుంటే తీసుకునే మొత్తాన్ని తగ్గించండి. చీకటి పడిన తర్వాత టీ, కాఫీల జోలికి అసలు వెళ్లకపోవడం వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పడుతుంది.

పగటి పూట..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రాత్రి పూట పడుకునే పొజిషన్ కుదరకపోవడం, అటూ, ఇటూ దొర్లడానికి ఇబ్బందిగా అనిపించడం మొదలైన కారణాల వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అందుకే పగటి పూట గంట, రెండు గంటల సేపు పడుకోవడం మంచి పద్ధతి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. అయితే రెండు గంటలకు మించి పడుకోకుండా చూసుకోండి. పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి నిద్ర పట్టకపోయే అవకాశాలెక్కువ.

మసాలాలు తగ్గించండి..

ఈ సమయంలో నిద్ర పట్టకపోవడానికి గుండెల్లో మంట కూడా కారణం కావచ్చు. అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అలాగే మసాలా వంటకాలు తగ్గించండి. రాత్రి పూట పూర్తిగా మానేయండి. దీనివల్ల గుండెల్లో మంట తగ్గి నిద్ర పట్టే అవకాశాలుంటాయి.

ఎడమ పక్కకు..

ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పొజిషన్‌లో నిద్ర పోవాలన్నది చాలామందికి వచ్చే డౌటు.. గర్భం ధరించినప్పటి నుంచి ఎడమ పక్కకి పడుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా ఉంటుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభతరమవుతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు వాయడం వంటివి కూడా తగ్గుతాయి.

ప్రెగ్నెన్సీ పిల్లో..

ఆఖరి నెలల్లో నిద్ర పట్టకపోవడానికి పెరిగిన పొట్ట కారణమవుతూ ఉంటుంది. దానికి ఆధారాన్నివ్వడం కోసం కడుపు కింద, కాళ్ల మధ్యలో దిండ్లను ఉపయోగించొచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ పిల్లోను ఉపయోగించొచ్చు. దీనివల్ల పొట్టకు ఆధారం దొరుకుతుంది. దీంతో పాటు మెటర్నటీ బెల్ట్, నైట్ బ్రా వంటివి కూడా ఉపయోగపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని