Published : 22/05/2022 13:02 IST

కొత్తగా ఉద్యోగంలో చేరాక..!

హాయ్‌ మేడమ్‌.. ఎంబీఏ పూర్తిచేసుకొని కొత్తగా ఉద్యోగంలో చేరాను. జాబ్‌ విషయంలో నాకు పూర్వానుభవం కూడా లేదు. అయితే నేను తోటి ఉద్యోగులతో ఎలా మెలగాలి? ఇదే సమయంలో ఆఫీసు పనులను ఎలా సమన్వయం చేసుకోవాలి? - ఓ సోదరి

జ. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఆరోగ్యకరమైన, వాస్తవిక అంచనాలను ఏర్పరచుకోవాలి. బృంద సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మొదట్లో మెప్పు పొందాలని చాలామంది ప్రతి పనినీ స్వీకరిస్తారు. అది మంచిదే.. కానీ కొన్ని నియమాలను పెట్టుకోండి. బృందానికి సాయాన్ని అందించడంలో ముందుకు రావడంతో పాటు మీ సమయం, శక్తి సామర్థ్యాలకు తగిన విలువ దక్కుతోందో, లేదో కూడా చూసుకోవాలి. దీన్ని మొదట్నుంచే అలవర్చుకోవాలి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో యాజమాన్యాలు.. తమకు ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాయి. కానీ మహిళలకు ఇల్లు, పిల్లల బాధ్యతలు.. వంటివీ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీ అందుబాటు గురించి స్పష్టతనివ్వాలి. ఉదాహరణకు- ఉదయం 8లోపు ఇంట్లో పనులుంటాయనో, రాత్రి 7 గం. తర్వాత ఫలానా పనులుంటాయనో చెప్పొచ్చు. అందుబాటులో ఉండలేని తేదీలనూ ముందుగానే చెప్పాలి. లేదంటే అత్యవసర పని ఎదురై, తీరా మీరు చేయలేకపోతే మీపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అలాగే వీలున్నప్పుడు పనుల్ని స్వీకరించే నైజం అలవాటు చేసుకోవాలి.

సంస్థ, తోటివారు మీనుంచి ఏం ఆశిస్తున్నారో కూడా గమనించుకోండి. ఉదాహరణకు.. ఒక పని గంటలో అవుతుందనుకున్నారనుకుందాం. ఆలోగా చేయడానికి ప్రయత్నించండి. మీ చేతిలో తగినంత పని ఉండి, మరో పని అందుకోలేకపోతే దాన్నీ మీద వేసుకోకండి. వేరే వాళ్లకి ఇవ్వండి. వ్యక్తిగత పని కంటే బృందంతో కలిసి చేయగలిగే వాటికే ప్రాధాన్యం ఉంటుందని గుర్తుంచుకోండి. మీకు అనుకూలంగా ఒక్కసారిగా అందరూ పని విధానాన్ని మార్చుకుంటారనుకోవద్దు. వాళ్లూ మీపై కొన్ని అంచనాలతో ఉంటారు. వాటి గురించి తెలుసుకోండి. కొందరికి అదనపు సమయం పని చేయడం, వారాంతాల్లోనూ పని చేయడం సమంజసంగా అనిపించచ్చు. అది మీకు నచ్చకపోవచ్చు. వీటి గురించీ ముందుగానే చర్చించుకోవాలి. ఇలా పరస్పరం చర్చించుకోవడం ద్వారా మీరు కోరుకున్న సరిహద్దులను ఏర్పరచుకోగలుగుతారు. ఒక్కోసారి కొందరు వాటిని ఉల్లంఘించొచ్చు. ఇలా చాలాసార్లు జరుగుతుంటే మాత్రం మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేదంటే వేరొకరు వాటిని నిర్ణయిస్తారు. అది ఎప్పుడూ మంచిది కాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని