Updated : 01/04/2022 16:09 IST

Breastfeeding Tips: అమ్మలూ.. మళ్లీ ఆఫీస్‌కెళ్తున్నారా?

ప్రసవం తర్వాత చంటి బిడ్డల్ని వదిలి ఆఫీస్‌కెళ్లాలంటే తల్లులు రెండు విషయాల గురించి ఆలోచిస్తారు. ఒకటి - పాపాయికి పాలు పట్టడం, రెండోది - పాపాయి ఆలనా పాలనా చూసుకోవడం! ఈ క్రమంలో బిడ్డ గురించి తమలో తామే మథనపడుతుంటారు. అయితే నెల ముందు నుంచే ఇందుకోసం సిద్ధపడితే ఏ సమస్యా లేకుండా సాఫీగా ముందుకు సాగచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు.

* అప్పటిదాకా నేరుగా పాలిచ్చినా.. రోజులో ఒకట్రెండుసార్లు బాటిల్‌తో ఫీడ్‌ చేయడం పాపాయికి అలవాటు చేయాలి. ఈ క్రమంలో తల్లిపాలు అధికంగా ఉత్పత్తైతే బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో పిండి.. బాటిల్‌లో పోసి తాగించచ్చు.. లేదంటే నిపుణుల సలహా మేరకు పోత పాలు లేదా పౌడర్‌ పాలు పట్టచ్చు.

* పిల్లలకు పుట్టుకతోనే తల్లి స్పర్శ తెలిసిపోతుంది. ఇక పాలు తాగుతున్న క్రమంలో మీ పొత్తిళ్లలో ఒదిగిపోవడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అయితే ఆఫీస్‌కెళ్లే క్రమంలో ఒక్కసారిగా మీ పాపాయిని మీరు దూరం పెడితే వారు ఏడుస్తారు. కాబట్టి రోజులో కాసేపు బిడ్డను మీ కుటుంబ సభ్యుల వద్ద లేదంటే బేబీ సిట్టర్‌ వద్ద ఉంచి వారికి అలవాటు చేయడం మంచిది. తద్వారా మీ చిన్నారిని ఎలా చూసుకోవాలి?/వారికి ఎలా పాలు పట్టాలి? అన్న విషయాలు వారికి అలవాటవుతాయి.

* ఆఫీస్‌కెళ్లే క్రమంలో తీరిక ఉండక హడావిడిగా రడీ అయిపోతుంటాం. దాంతో పాలు కూడా టెన్షన్‌ పడుతూ పిండాల్సి రావచ్చు. అయితే ఈ ఒత్తిడి వల్ల తల్లిపాల నాణ్యత తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. అందుకే ఆఫీస్‌కెళ్లే రోజుల్లోనూ ప్రశాంతంగా పాలు తీయడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ఇందుకోసం ఓ గంట ముందు నిద్ర లేవడం ముందు నుంచే అలవాటుగా మార్చుకోవాలి.

* మీ పాపాయి తాగే మోతాదును బట్టి బాటిల్‌లో పాలు తీసినా.. ఇంకా వస్తున్నాయనుకుంటే.. ఆఫీస్‌కి వెళ్లే ముందు నేరుగా బిడ్డకే ఇవ్వడం మంచిది. తద్వారా పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.. ముందుగా మీరు తీసిన పాలు తిరిగి ఇంటికి వచ్చే వరకూ పాపాయికి సరిపోతాయి కూడా! తద్వారా పోత పాల అవసరం ఉండదు.

* ఇలా తీసిన పాలను ఫ్రిజ్‌లో లేదంటే గది ఉష్ణోగ్రత వద్ద ఎనిమిది గంటల పాటు నిల్వ చేయచ్చంటున్నారు నిపుణులు. అయితే వీటిని తిరిగి వేడి చేయకూడదన్న విషయం పిల్లల్ని చూసుకునేవారికి ఒకటికి రెండుసార్లు చెప్పండి. అవసరమైతే ముందు నుంచే ఈ ప్రక్రియను వాళ్లతో అలవాటు చేయించడం మరీ మంచిది.

* ఎక్కువ సమయం పాలివ్వకపోయినా.. అవి లీకవడం, రొమ్ములు గట్టిగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇదిలాగే కొనసాగితే పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా జరగకూడదంటే.. మీరు ఆఫీస్‌లో ఉన్నా నిర్ణీత వ్యవధుల్లో పాలు పిండడం, మీకు దగ్గర్లో ఏదైనా తల్లిపాల బ్యాంక్‌ ఉంటే దానికి అందజేయడం.. వంటివి చేయచ్చు. అలాగే సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ పాపాయికి యథావిధిగా పాలు పట్టడం కొనసాగించాలి.

* ఆఫీస్‌ పనిలో పడిపోయి వేళకు ఆహారం తీసుకోవాలన్న విషయం కూడా మర్చిపోతుంటాం. అయితే కొత్తగా తల్లైన వారు మాత్రం పోషకాహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని ప్రభావం వారి ఆరోగ్యం, తల్లిపాలపై పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే పాల ఉత్పత్తి కోసం ఓట్‌మీల్‌, మెంతులు, వెల్లుల్లి, ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాలు, తాజా పండ్లు, కాయగూరలు..వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.

వీటితో పాటు పాపాయి పాల కోసం ఉపయోగించే బ్రెస్ట్‌ పంప్‌, ఫీడింగ్‌ బాటిల్స్‌, ఇతర వస్తువులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

మరి, మీరు కూడా మీ చిన్నారిని ఇంటి వద్ద వదిలి తిరిగి ఆఫీస్‌కి వెళ్తున్నారా? అయితే ఫీడింగ్‌, పాపాయి సంరక్షణ విషయాల్లో మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి. మీరిచ్చే సలహాలు, సూచనలు ఎంతోమంది తల్లులకు ఉపయోగపడచ్చు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని