అమ్మాయిలూ.. మీ కోసమే ఈ టిప్స్!

చదువులు, పరీక్షల హడావుడిలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇటు శారీరకంగా, అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశమూ...

Published : 12 May 2023 21:04 IST

చదువులు, పరీక్షల హడావుడిలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇటు శారీరకంగా, అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశమూ లేకపోలేదు. ఈ క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే- వేసవిలోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడిపేయచ్చు. మరి అవేంటో చూద్దాం రండి...

ఆ నొప్పికి దూరంగా..

నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పి, నడుంనొప్పి, ఒత్తిడి, చికాకు.. ఇలా పలు రకాల సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో నడవడం, పరుగెత్తడం, ఆటలాడడం.. వంటి వాటికీ ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి చిరు వ్యాయామాలతో పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులన్నీ మటుమాయమైపోయి ఆ సమయంలోనూ ఉత్సాహంగా ఉండచ్చు. అలాగే ఎముకలు, వెన్నెముక, కండరాలు.. దృఢంగా మారడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.

మచ్చలేని చర్మానికి..

వేసవి వచ్చిందంటే చాలామంది చల్లటి పానీయాల్ని ఆశ్రయించడం సహజమే. ఇందులోనూ ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడైతే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి వీలుగా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి శరీరానికి అస్సలు మంచివి కావు. కాబట్టి ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకొనే పానీయాలు తాగడం ఇటు ఆరోగ్యానికి, అటు చర్మానికీ ఎంతో మంచిది.

ఈ క్రమంలో- కోకమ్ షర్బత్ (కోకమ్ పండుతో చేసేది), ఆమ్ పన్నా (మామిడి కాయతో తయారుచేసేది), బెల్ షర్బత్ (మారేడు పండుతో చేసేది).. వంటివి ఎక్కువగా తాగాలి. ఇవన్నీ శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అలాగే చక్కటి పోషణనందించి మచ్చలేని చర్మాన్ని సొంతం చేస్తాయి.

లేటుగా వద్దు...

చక్కటి ఆరోగ్యానికి, సౌందర్యానికి తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఈ క్రమంలో- ఎప్పుడూ లేట్ నైట్ పార్టీలంటూ నిద్రను త్యాగం చేయకుండా రోజూ రాత్రి పూట వీలైనంత త్వరగా పడుకోవాలి. దీనివల్ల హార్మోన్ల స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగే మెదడు పనితీరు మరింతగా మెరుగుపడుతుంది.. ఇది భవిష్యత్తులోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించడం వల్ల ఒత్తిళ్లు, ఆందోళనలకు దూరంగా ఉండచ్చు. తద్వారా ఇటు శారీరకంగా, అటు మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండచ్చు. బరువూ అదుపులో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని