వాదనతో బంధం బలహీనం..

రమా, రిషిల అనుబంధాన్ని వారి మధ్య అప్పుడప్పుడు వచ్చే వాదన భంగపరుస్తూ ఉంటుంది. తిరిగి వారిద్దరూ ఒకటవడానికి రోజులు పడుతుంది. అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు వాదనగా కాకుండా సంభాషణగా, చర్చగా మార్చుకోగలిగితే ఆ దంపతులమధ్య దూరం తరగదంటున్నారు మానసిక నిపుణులు.

Published : 04 Jan 2023 00:48 IST

రమా, రిషిల అనుబంధాన్ని వారి మధ్య అప్పుడప్పుడు వచ్చే వాదన భంగపరుస్తూ ఉంటుంది. తిరిగి వారిద్దరూ ఒకటవడానికి రోజులు పడుతుంది. అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు వాదనగా కాకుండా సంభాషణగా, చర్చగా మార్చుకోగలిగితే ఆ దంపతులమధ్య దూరం తరగదంటున్నారు మానసిక నిపుణులు.

భార్యాభర్తల్లో ఒకరికొకరు తమ సర్వస్వం అన్నట్లుగా ఉన్న వారు కూడా వాదనలోకి అడుగుపెడితే అన్నీ మర్చి పోతుంటారు. తమకే అన్నీ తెలిసినట్లు, తమదే పైచేయి అంటూ భావిస్తుంటారు. ఇటువంటప్పుడే ఎదుటివారిని తక్కువగా అంచనా వేస్తూ మాటలతో తమ వాదనను మరింత కఠినంగా వినిపిస్తారు. ఈ రకమైన పద్ధతి పరిష్కారాన్ని కాదుకదా.. ఇద్దరికీ మానసిక వేదనను మాత్రమే మిగులుస్తుంది. అలాకాకుండా ఉండాలంటే అటువంటి సందర్భం రాకుండా ఉండేలా ముందుగానే జాగ్రత్తపడాలి. ఏయే అంశాల్లో ఇరువురి మధ్య వాదనలు వస్తున్నాయో ప్రశాంతంగా చర్చించుకోవాలి. మరొకసారి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. వాదన వచ్చినప్పుడు ఇరువురిలో ఒకరైనా మౌనాన్ని పాటించగలిగితే, కాసేపటికి వాతావరణం మారుతుంది. అవతలివారిలో కోపం లేదా వాదించాలనే వేడి తగ్గుతుంది. ఆ తర్వాత సున్నితంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెబితే చాలు. వాదన వల్ల కలిగే నష్టాన్ని ముందుగానే నివారించొచ్చు.  

స్నేహంలా..

ప్రేమించినప్పుడు లేదా వైవాహికబంధంలోకి అడుగుపెట్టినప్పుడు భాగస్వామిని ఎంత గొప్పగా భావించి ప్రేమించారో ఆ ప్రేమ, గౌరవాన్ని మరవకూడదు. కోపం లేదా భేదాభిప్రాయం వచ్చినప్పుడు అప్పటి సంఘటనలు, ప్రేమించిన క్షణాలను గుర్తు తెచ్చుకోవాలి. అవన్నీ మనసును తిరిగి అవతలి వ్యక్తిపై ప్రేమతో నింపుతాయి. జీవిత భాగస్వామిలోని లోపాలను ముందుగా గుర్తించలేదు అనుకోకుండా, మనలోనూ ఉన్న లోపాలను తెలుసుకోగలగాలి. అప్పుడు మనల్ని భరిస్తున్న భాగస్వామిపై మరింత ప్రేమ పెరుగుతుంది తప్ప.. వాదనలకు తావుండదు. లోపాలకు ప్రాముఖ్యతనివ్వకుండా ఇరువురూ వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ముందడుగు వేస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. స్నేహితుల పొరపాట్లనెలా పట్టించుకోకుండా స్నేహాన్నెలా కొనసాగిస్తారో.. అలాగే.. భాగస్వామి విషయంలోనూ ఆలోచించాలి. పరస్పరం గౌరవించుకుంటూ ఎదుటివారిలోని మంచి గుణాలను గుర్తించి ప్రశంసించగలిగితే చాలు. ఆ దాంపత్యంలో ప్రేమతోపాటు స్నేహబంధం పెనవేసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్