ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?
మా పాప వయసు 11 సంవత్సరాలు.. తను ఎక్కువ సమయం యూట్యూబ్‌లోనే గడుపుతోంది. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటుంది. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్నిసార్లు...
మా పాప వయసు 11 సంవత్సరాలు.. తను ఎక్కువ సమయం యూట్యూబ్‌లోనే గడుపుతోంది. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటుంది. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినదు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్ చూస్తుంటుంది. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటుంది. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటుంది. దీనివల్ల చదువులో వెనకపడుతుందేమో.. తనలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అమ్మాయికి ఇతర ఆసక్తికరమైన అంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. తను స్నేహితులతో బాగానే ఆడుకుంటుందని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువసేపు ఆడుకునేలా చేయండి. అలాగే తన ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు తనతో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే తన నుంచి బలవంతంగా ఫోన్ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల తనలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.
ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి తనకి టైమ్ మేనేజ్‌మెంట్ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడా టీవీ, ఫోన్లతో అధిక సమయం గడపకుండా తనకి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు తనకి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా తనలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో తనకి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అర్ధమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.