రాగిని మెరిపించేయండిలా..!

రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- రాగి పాత్రలు మనందరి ఇళ్లల్లో కొన్నైనా ఉంటాయి. పూజగదిలో వెండి తర్వాత స్థానం రాగిదే.. ఈ మధ్యకాలంలో కాపర్ కోటింగ్‌తో ఉన్న వస్తువులు...

Published : 07 May 2023 10:34 IST

రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- రాగి పాత్రలు మనందరి ఇళ్లల్లో కొన్నైనా ఉంటాయి. పూజగదిలో వెండి తర్వాత స్థానం రాగిదే.. ఈ మధ్యకాలంలో కాపర్ కోటింగ్‌తో ఉన్న వస్తువులు కూడా వచ్చేస్తున్నాయి. అయితే వాటిని క్లీన్ చేసుకోవడం కాస్త కష్టమైన పనే.. మురికిని వదిలించాలంటే రుద్ది, రుద్ది చేతులు నొప్పెట్టాల్సిందే.. అయితే మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే వీటన్నింటినీ ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. మరి అదెలాగో చూద్దాం రండి..

ఉప్పు, వెనిగర్

ఉప్పు, వెనిగర్‌లను రాగి వస్తువుల మీద వేస్తే రాగి ఆక్సీకరణం చెందడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అది నల్లగా మారకుండా ఉంటుంది. అందుకే ఉప్పు, వెనిగర్‌ల మిశ్రమాన్ని వేసి దాన్ని గట్టిగా రుద్దాలి. మురికి నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. పూర్తిగా పోయేవరకు రుద్దండి. తర్వాత కడిగేసి మెత్తని గుడ్డతో తుడిచేయండి.

ఉప్పు, వెనిగర్‌లతో ఇంకో విధంగానూ క్లీన్ చేయొచ్చు. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కప్పు వెనిగర్ వేసి బాగా కలపండి. అవి కరిగిపోయాక అందులో రాగి సామాన్లను వేయండి. తర్వాత దీన్ని స్టౌ మీద పెట్టండి. నీళ్లు మరిగేవరకు అలాగే ఉంచండి. మురికి మొత్తం నీళ్లలోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు క్లీన్‌గా మారిపోతాయి. చల్లగా అయిన తర్వాత తీసి సబ్బుతో క్లీన్ చేసేయండి. వేడి నీటితో కడగండి. తర్వాత తుడవడం మర్చిపోవద్దు..

నిమ్మకాయతో..

నిమ్మకాయతో రాగి వస్తువులను సులభంగా శుభ్రం చేసేయొచ్చు. నిమ్మకాయను సగానికి కోసి, ఒక ముక్కతో రాగి వస్తువులను తోమండి. దీనివల్ల మురికి తొందరగా తొలగిపోతుంది. ఇదే కాదు.. నిమ్మకాయకు, ఉప్పు కలిపి కూడా రుద్దొచ్చు. దీనివల్ల ఇంకా తొందరగా మురికి తొలగిపోతుంది.

అంతే కాదు.. నిమ్మరసాన్ని గిన్నెలోకి పిండండి. అందులో ఉప్పువేసి కలపండి. ఈ మిశ్రమంలో ఒక మెత్తని గుడ్డని ముంచి దాంతో రాగి వస్తువులు క్లీన్ చేయడం వల్ల తొందరగా శుభ్రమవడమే కాదు. ఎలాంటి గీతలూ పడకుండా ఉంటాయి.

కెచప్

కెచప్‌తో కూడా రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. రాగి వస్తువుల మీదున్న కఠినమైన మరకలను కూడా ఇది తొలగిస్తుంది. కెచప్‌ని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొద్దికొద్దిగా తీసుకుంటూ రాగి వస్తువులకు పూయండి. ఒక సన్నని పొర మాదిరిగా పూర్తిగా ఎక్కడా వదలకుండా పూయండి. దీన్ని ఒక పది నిమిషాలు అలాగే ఉంచి తర్వాత మెత్తని గుడ్డతో బాగా రుద్దండి. తర్వాత దాన్ని వేడి నీటితో కడిగి, శుభ్రంగా తుడిచేయండి. రాగి పాత్రలు తళతళా మెరిసిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని