Updated : 10/02/2022 20:47 IST

ఇలా చేస్తే ఆ ఇబ్బంది ఉండదు!

నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇలా ప్రతి చిన్నదానికీ తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి మనకు విముక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ సౌకర్యవంతమైన పిరియడ్స్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

వేడి నీళ్ల బాటిల్‌తో..

నెలసరి సమయంలో చాలామందికి పొత్తి కడుపులో నొప్పి రావడం తెలిసిందే. ఈ నొప్పిని భరించలేక కొంతమంది పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇవి తరచూ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాత్రలకు బదులు హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్ల బాటిల్‌తో మీరే స్వయంగా మీ నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఒక బాటిల్‌లో కాస్త వేడిగా ఉన్న నీటిని నింపి దాని చుట్టూ ఒక కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. ఈ బాటిల్‌ను మీకు నొప్పి వస్తున్న చోట పెట్టి కాసేపు ఉంచాలి. అంతే.. ఆ నొప్పి నుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కాస్త గోరువెచ్చటి నీటితో స్నానం చేసినా మనసుకు ప్రశాంతంగా అనిపించి హాయిగా నిద్రపడుతుంది.

మసాజ్ మంచిదే..

నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, ఇతర ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి అత్యవసర నూనెలు ఎంతగానో తోడ్పడతాయి. ఇందుకోసం నొప్పి వచ్చే చోట పెప్పర్‌మెంట్, రోజ్‌మేరీ, లావెండర్.. ఇలా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్‌తో కాస్త మర్దనా చేస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. మీకు మీరు చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. పార్లర్‌కు వెళ్లి సంబంధిత నిపుణులతోనూ మసాజ్ చేయించుకోవచ్చు. పిరియడ్స్ సమయంలో సౌకర్యవంతంగా ఉండడానికి ఇది కూడా చక్కటి మార్గమే.

ఈ ఆహారం..

నెలసరి సమయంలో చింత లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం క్యాల్షియం విరివిగా లభించే పాలు, పాల పదార్థాలు, పాలకూర.. వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు మూడ్ స్వింగ్స్, ఆహారం ఎక్కువగా తినాలన్న కోరికను తగ్గించడంలో తోడ్పడతాయి. అలాగే సాయంత్రం స్నాక్స్ సమయంలో నూనె పదార్థాలు కాకుండా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభించే నట్స్, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై మనసును ఉత్తేజపరుస్తాయి.

అంతేకాదు.. ఈ సమయంలో నీరు కూడా ఎక్కువగా తాగాలి. ఇందుకోసం మరీ చల్లగా ఉన్న నీళ్లు కాకుండా.. నీటిని మరిగించుకొని కాస్త చల్లారాక వాటిని తీసుకున్నా ఫలితం ఉంటుంది. దీనివల్ల శరీరంలో నొప్పి ఉన్న కండరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా దోస.. వంటివి ఎలాగూ తీసుకోవాల్సిందే..!

కాస్త పని చెప్పాలి..

నెలసరి సమయంలో ఇంట్లో ఏదైనా పనిచేసుకుందామంటేనే కొందరికి శరీరం సహకరించదు. అలసట, చికాకుగా అనిపించి ఎప్పుడెప్పుడు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తుంటుంది. కానీ ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం.. వంటివి చేయడం చాలా మంచిది. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు పిరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్.. తదితర సమస్యల నుంచి విముక్తి పొందచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఎంచుకునే వ్యాయామాలు పొత్తి కడుపు, నడుముపై ఒత్తిడి లేకుండా ఉండేలా జాగ్రత్తపడడం మంచిదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని