Updated : 22/03/2023 04:13 IST

ఉగాది ఉషస్సులు మోములో కనిపించాలంటే...!

తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ రోజు సంతోషంగా సంబరాలు చేసుకోవడమే కాదు...అందంగానూ మెరిసిపోవాలని అమ్మాయిలు కోరుకుంటారు. మరి ఈ రోజు మీ ఆహార్యంతో మెప్పించాలంటే... ఈ చిట్కాలు పాటించండి..

కళకళలాడే మోముకి: పని ఒత్తిడితో ఎంత తీరిక లేకున్నా ఉగాది రోజు మాత్రం ఒంటికి కాస్త నలుగు పెట్టండి. ఇందుకోసం కప్పు పెసరపిండిలో పావుకప్పు పాలు, చెంచా చొప్పున బాదం పొడి, తేనె, రెండు చుక్కల రోజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, చిటికెడు కస్తూరి పసుపు కలిపి ఒంటికి రాసి బాగా రుద్దండి. ఇలా చేస్తే చర్మంపై పేరుకున్న మురికీ, మృతకణాలు తొలగి...కొత్త కళ వచ్చేస్తుంది. కాస్త మెంతులు, మందార ఆకులూ వేసి కాచిన కొబ్బరినూనెతో తలకు మర్దన చేయాలి. ఆపై గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.

మేకప్‌తో మెరిపిద్దాం: పండగ అనే కాదు...ఎప్పుడు వేసుకున్నా...క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ (సీటీఎమ్‌) పాటించడం మరిచిపోకూడదు. అప్పుడే మేకప్‌కి అనుకూలంగా చర్మం సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవాలి. ఇది మేకప్‌ని తాజాగా ఉంచుతుంది. చర్మం కాలుష్యం బారిన పడకుండానూ కాపాడుతుంది. ఈ కాలంలో వేడి, చెమట వంటివి చర్మాన్ని జిడ్డుగా మారుస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి సన్‌స్క్రీన్‌ జెల్‌ రకాన్ని ఎంచుకుంటే మేలు.

పండగ చేసుకునేదంతా పగటిపూటే అందుకే మేకప్‌ వీలైనంత సహజంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రైమర్‌ రాశాక మ్యాటి ఫైయర్‌ని వాడాలి. ఇది జిడ్డు తత్వాన్ని తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. ఇలాంటప్పుడు కళ్లను తీర్చిదిద్దడంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించకూడదు. ఐ ప్రైమర్‌ చర్మాన్ని ముడతలు పడకుండా చేయడమే కాదు... కళ్లు విశాలంగా కనిపించేలా చేస్తుంది.

అందంగా-హుందాగా: తెలుగింటి పడచుల అందాన్ని రెట్టింపు చేసేవి లంగాఓణీలు, చీరలే కదా! ఎంబ్లిష్డ్‌ వెయిస్ట్‌బెల్ట్‌, టెంపుల్‌ డిజైన్‌ హారం, నిండుగా స్టేట్‌మెంట్‌ బ్యాంగిల్స్‌ వేసుకుంటే పండగంతా మీ దగ్గరే ఉంటుంది. ఒకప్పుడు పెద్దలు ధరించిన నారాయణ్‌పేట్‌, గద్వాల్‌, వెంకటగిరి, బెనారస్‌... పట్టు చీరల్ని ఆధునిక శైలిలో కట్టుకోవడమే ఇప్పటితరం మెచ్చుతోన్న ఫ్యాషన్‌. మీరూ ప్రయత్నించి చూడండి.


పట్టు పరికిణి.. ఇలా కూడా!

తెలుగునాట ఉగాదినే నూతన సంవత్సరంగా భావిస్తాం. పండగంటే మనదే హడావుడి. మరి పట్టు వస్త్రాలు ఉండాల్సిందే కదా! అదే పట్టు చీరలు, పావడాలను కట్టీ కట్టీ బోర్‌ కొట్టేసిందా? అయితే ఇలా కొత్తగా ప్రయత్నించేయండి.

ఆధునికంగా..: చీరల్నే కాదు లంగా ఓణీలనూ ఆధునికంగా స్టైలింగ్‌ చేసుకోవచ్చు. పండగపూట కొత్తగానూ మెరిసిపోవచ్చు. నచ్చిన లంగాఓణీ ఎంచుకోండి. వేసుకున్నాక... ఓణీకి కుచ్చిళ్లు పెట్టి భుజం దగ్గర ఓ పిన్ను పెట్టండి. తర్వాత ఓణీ ముందు భాగంలోని పై అంచుని వదులుగా పరికిణీ మీదుగా వెనక్కి తీసుకొచ్చి నడుము దగ్గర సర్దేస్తే సరి. సంప్రదాయంగానే కాదు...ట్రెండీగానూ కనిపించొచ్చు.

* వెనుక కుచ్చిళ్లా...: నచ్చిన లెహెంగా ఉందా? అయితే దానికి మ్యాచింగ్‌ చీరని ఎంచుకోండి. కావాల్సినంత పొడవులో కొంగు వేసుకోండి. ఇక చీర చివర కొద్దిగా వదిలి, మిగతాదంతా కుచ్చిళ్లు పోసి, వెనక, నడుముకు మధ్యలో మడిచేయండి. వదిలిన భాగాన్ని ముందుకు తెచ్చి, కుచ్చిళ్ల వద్ద పిన్‌ పెడితే సరి! బ్లౌజు, లెహెంగా రంగులోనే నడుము బెల్టు పెట్టుకుంటే చాలు. స్టైలిష్‌ ఓణీలో మెరిసిపోతారు.

* రెండు చీరలతో..: ముందుగా రెండు కాంట్రాస్ట్‌ కలర్‌ పట్టు చీరల్ని ఎంచుకోవాలి. అందులో ఒక చీరకు చిన్న చిన్న కుచ్చిళ్లను పెట్టి...వాటిని నడుము చుట్టూ వచ్చేలా సర్దుకోవాలి. ఇప్పుడు మరో శారీని తీసుకుని కేవలం ముందు భాగంలో ఎడమవైపు మాత్రమే కుచ్చిళ్లు వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు  కొంగుని మాత్రం వెనుక నుంచి ముందుకు తెచ్చి వేసుకుంటే సరి. ఈ కొత్త స్టైలింగ్‌తో సన్నగా ఉన్న అమ్మాయిలు బుట్ట బొమ్మల్లా మెరిసిపోవడం ఖాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని