Published : 28/01/2023 00:14 IST

నిద్ర చేరనంటోంటే..

మెనోపాజ్‌లో చాలామంది సమస్య.. నిద్ర పట్టకపోవడం! ఆఫీసు, పిల్లల పెంపకం, సకాలంలో పనులు పూర్తవవేమోనన్న కంగారు వెరసి.. ముప్పైల్లోనూ కునుకు దూరమవుతోందనే వారెందరో! దీనికి పరిష్కారమేంటంటే హిప్నాటిజం అంటున్నారు నిపుణులు.. అదీ మీకు మీరే ప్రయత్నించాలంటున్నారు. అదెలాగంటే..

* విశ్రాంతినిచ్చే భంగిమలో పడుకోండి. ఒళ్లంతా సేదతీరుతున్నట్లుగా భావించాలి. ఆపై పూర్తిగా శ్వాస మీద దృష్టి నిలపాలి. శ్వాసప్రక్రియ విషయంలో 4-7-8 విధానాన్ని అనుసరించాలి. అంటే నాలుగు సెకన్ల పాటు దీర్ఘశ్వాస తీసుకొని ఏడు సెకన్లపాటు నిలిపి ఉంచాలి. ఆపై ఎనిమిది సెకన్లపాటు నెమ్మదిగా శ్వాస వదలాలి. ఇలా నాలుగైదుసార్లు చేయాలి.

* పచ్చదనంతో నిండిన ప్రకృతి ఒడిలోకి వెళుతున్నట్లుగానో, ప్రశాంతమైన సముద్రతీరానికో, పర్వతాలున్న ప్రదేశానికో.. వెళుతున్నట్టుగా ఊహించుకోవాలి. బయట ఏ శబ్దాలనీ మీ దరికి రానివ్వొద్దు.

* 20-30 నిమిషాల్లో శరీరం కలలాంటి స్థితిలోకి వెళుతుంది. ఇప్పుడు మీకు మీరు ఏదైనా మెసేజ్‌.. ఉదాహరణకు ‘నేను గాఢనిద్రలోకి జారుకుంటున్నా’, ‘నేను ప్రశాంతంగా నిద్రపోతా’ లాంటివి పదే పదే చెప్పుకోండి. మనసులో అది బలంగా నాటుకుపోతుంది.

* ఆపై కళ్లు తెరిచి పొట్టలోపలికి పోయేంతగా దీర్ఘశ్వాస తీసుకొని వదలాలి. మీకు మీరే ఈ ప్రక్రియంతా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కళ్లు తెరిచి గది మొత్తాన్నీ చూడండి. మళ్లీ కళ్లు మూసుకొని తెరవండి. ఆపై కళ్లు మూసుకొని నిద్రకు ప్రయత్నిస్తే సరి. నిద్ర సమస్యలున్నవారు దీనిని సరిగా తరచూ ప్రయత్నిస్తే.. రాబోయే రోజుల్లో మంచి నిద్ర దరిచేరడం ఖాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని