Published : 12/11/2022 20:09 IST

ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిందా?

‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అన్నాడో సినీ కవి. శాశ్వతమనుకున్న స్నేహబంధం కూడా అప్పుడప్పుడూ చిక్కుల్లో పడచ్చు.. చినికి చినికి గాలి వానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా రావచ్చు. మరి, అప్పటిదాకా మన అనుకున్న వాళ్లే మన నుంచి దూరమైతే ఆ బాధను తట్టుకోగలమా? వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడగలమా? అంటే.. అది మా వల్ల కాదనే సమాధానమే వస్తుంది చాలామంది దగ్గర్నుంచి! అలాగని దాన్నే తలచుకుంటూ ఎన్నాళ్లని అక్కడే ఆగిపోతాం..? అందుకే ఆ ఆలోచనల్లోంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించమంటున్నారు నిపుణులు. మనల్ని కాదని వెళ్లిపోయిన వారి కోసం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదంటున్నారు. అసలు ఇంతకీ స్నేహబంధం విడిపోవడానికి కారణాలేంటి? ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

కారణాలివేనా?!

కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుండేది స్నేహమే అంటుంటారు. అలాంటి అనుబంధం విడిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

⚛ అసూయ.. ఎలాంటి బంధంలోనైనా చిచ్చుపెడుతుందిది. ఒకసారి ఎదుటివారిపై ఆ ఫీలింగ్‌ మొదలైందంటే.. వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నెగెటివ్ అంశాలే కనిపిస్తాయి. తప్పు తెలుసుకొని మనసు మార్చుకుంటే సరే సరి.. లేదంటే తెగే దాకా బంధాన్ని వదిలిపెట్టదిది.

⚛ ఎలాంటి అనుబంధంలోనైనా మనస్పర్థలు, గొడవలు సహజం. ఎంత ప్రాణ స్నేహితుల మధ్యైనా అప్పుడప్పుడూ ఇవి వస్తుంటాయి. అయితే కొంతమంది వీటిని తేలిగ్గా తీసుకొని తమ ఫ్రెండ్స్‌తో తిరిగి కలిసిపోతే.. మరికొందరు వీటినే పట్టుకొని వేలాడుతుంటారు. ఇలాంటి ఉడుం పట్టు ఇద్దరి మధ్య అనుబంధాన్ని దూరం చేస్తుందే తప్ప దగ్గర చేయదు.

⚛ స్నేహమంటే ఇద్దరు వ్యక్తులకే పరిమితం కావాలని లేదు.. ఇలా ఎక్కువమంది స్నేహితులున్నప్పుడు ఒకరితోనే సమయం గడపడం కుదరచ్చు.. కుదరకపోవచ్చు.. ఇలాంటప్పుడు ఎదుటివారిని అపార్థం చేసుకొని విడిపోయేవారూ లేకపోలేదు.

⚛ స్నేహమంటే జీవితంలో ఒక భాగం మాత్రమే! ప్రేమ, పెళ్లి పేరుతో స్నేహితురాలు మీకు దూరమైనంత మాత్రాన ఆమెను అపార్థం చేసుకోవడం, నాతో అంతకుముందు లాగా గడపట్లేదని, మాట్లాడట్లేదని అనుకోవడం సరికాదు. ఇది కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది తమ ఫ్రెండ్స్‌ని శాశ్వతంగా దూరం చేసుకుంటుంటారు.

⚛ చాడీలు ఏ అనుబంధాన్నైనా నాశనం చేస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే మూడో వ్యక్తితోనే ఇవి అనుబంధంలో చిచ్చుపెడతాయి. ఒక్కోసారి ఈ మూడో వ్యక్తి కుటుంబ సభ్యులు/తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఈ క్రమంలో మీ గురించి వారికి, వారి గురించి మీకు చెడుగా చెప్పడం, అవి నిజమే అనుకొని నమ్మి చేజేతులా తమ స్నేహాన్ని దూరం చేసుకున్న వారిని ఎంతమందిని చూడలేదు మనం!

⚛ నమ్మకం లేని చోట ప్రేమే కాదు.. స్నేహమూ ఉండదు. కారణమేదైనా ఒకరిపై మరొకరు నమ్మకం కోల్పోయిన మరు క్షణం నుంచే ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలవుతుందంటున్నారు నిపుణులు. ఇది శాశ్వతంగా స్నేహాన్ని దూరం చేయచ్చంటున్నారు.

⚛ మీ స్నేహితుల ప్రాణ స్నేహితులు విడిపోయినా.. దాని ప్రభావం మీ ఫ్రెండ్షిప్‌పై ఉంటుందంటున్నారు నిపుణులు. వాళ్లను కాదని మీ ఫ్రెండ్షిప్‌ను కొనసాగిస్తే వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న భావనతో ఈ స్నేహాన్ని వద్దనుకుంటారు మరికొందరు.
మనసు మార్చుకోండి!

ఇలా స్నేహబంధం వీగిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా.. ఆ బాధ నుంచి బయటపడడం అంత సులభం కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగని వాళ్ల గురించే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం.. కాబట్టి వీలైనంత త్వరగా ఈ నెగెటివ్‌ ఆలోచనల్ని పక్కన పెట్టి మనసును మీకు నచ్చినట్లుగా మార్చుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని