ఆ మనోవేదన నుంచి బయటపడాలంటే..!

బాయ్‌ఫ్రెండ్‌తో తెగతెంపులైనా, భర్తతో విడిపోవాల్సి వచ్చినా, స్నేహితులు దూరమైనా.. ఇలాంటి సమయాల్లో మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ బాధను మనసులో దాచుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక నరకయాతన....

Published : 08 Jun 2023 17:34 IST

బాయ్‌ఫ్రెండ్‌తో తెగతెంపులైనా, భర్తతో విడిపోవాల్సి వచ్చినా, స్నేహితులు దూరమైనా.. ఇలాంటి సమయాల్లో మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ బాధను మనసులో దాచుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తుంటాం. అలాగని ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే.. దాని ప్రభావం మన ఆరోగ్యం పైనే కాదు ఇతర అనుబంధాల పైనా పడుతుందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే ఈ మనోవేదన నుంచి వీలైనంత త్వరగా బయటపడడం ముఖ్యమంటున్నారు. ఇందుకోసం మన ఆలోచనల్లో, చేతల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి..

గుర్తెరగాలి!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందే జాగ్రత్తపడమంటారు పెద్దలు. కానీ చాలామంది సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. మరికొంతమంది.. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా వస్తుంది. ఇలా విడిపోయినా.. తాము చేసిన పొరపాట్ల విషయంలో మాత్రం అస్సలు రియలైజ్‌ కారు. తప్పంతా అవతలి వారిదేనంటూ వారిని నిందిస్తూ మానసికంగా కుంగిపోతుంటారు. దీనివల్ల ఫలితం ఉండకపోగా.. మనోవేదన రెట్టింపవుతుంది. ఇలా జరగకూడదంటే.. అవతలి వారిని నిందించడం మాని.. తాము చేసిన పొరపాట్లేంటో గుర్తెరగమంటున్నారు నిపుణులు. ఇలా స్వయంగా రియలైజ్‌ కావడం వల్ల కోపతాపాలను తగ్గించుకోవచ్చు.. తద్వారా మనసులోని బాధ కూడా క్రమంగా తగ్గుతుంది. ఒకవేళ పొరపాటు అవతలి వారిదే అయినా.. వారు మీ నుంచి విడిపోయాక వారిపై కోపం ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయాలు గుర్తెరిగితే.. ప్రతికూల ఆలోచనల్లో నుంచి బయటపడి మానసిక సాంత్వన పొందచ్చు.

పంచుకుంటేనే ప్రశాంతత!

అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నా ఆ ఆలోచనలు, అనుభవాల నుంచి బయటపడడం అంత సులువు కాదు.. అయితే ఈ బాధను తమ మనసులో దాచుకోవడం వల్లే చాలామంది ఈ సమయంలో ప్రశాంతతను కోల్పోతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో లేదంటే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనో.. ఒంటరిగానైనా బాధను భరిస్తారు కానీ ఇతరులతో పంచుకోరు. కానీ కష్టమో, నష్టమో అన్న సంగతి పక్కన పెట్టి మనసులోని బాధను, మీ ఆలోచనల్ని మీ మనసుకు దగ్గరగా ఉన్న వారితో పంచుకుంటే.. కొండంత భారం దిగిన భావన కలుగుతుంది. తద్వారా మీరు మీ మానసిక వేదన నుంచి బయటపడడానికి వారు తగిన సలహాలు సూచించే అవకాశమూ దొరుకుతుంది. ఇది మీకు మరింత సానుకూలమైన అంశం.

రాస్తున్నారా?

మనసు ప్రతికూల ఆలోచనలు, బాధతో నిండిపోయినప్పుడు దేనిపైనా ఆసక్తి చూపలేం. కానీ ఈ సమయంలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం వల్ల స్వయంగా మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటిలో డైరీ రాయడం ఒకటి. ఆ క్షణం మీ మనసులో మెదిలిన ఆలోచనల్ని పుస్తకంపై పెట్టడంతో పాటు వాటిని ఓసారి పునఃశ్చరణ చేసుకోండి. అంటే.. ఇది ఒక రకంగా మీ బాధను మీతోనే పంచుకోవడమన్నమాట! దీనివల్ల స్వయంగా రియలైజ్‌ అయి మనసులోని ప్రతికూల ఆలోచనలు క్రమంగా దూరమవుతాయట! ఇలా రోజూ ఓ పావుగంట పాటు డైరీ రాయడం వల్ల.. మనలోని యాంగ్జైటీ, ఒత్తిడి, కుంగుబాటు.. వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి మానసిక ఆలోచనల్ని అదుపు చేసుకోవాలంటే ఇది చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు.

ఇకనైనా ‘హద్దు’ దాటకుండా!

మనం చేసే పొరపాట్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.. తిరిగి వాటిని పునరావృతం చేయకుండా జాగ్రత్తపడతాం. అనుబంధం దెబ్బతిన్నా, కలతలొచ్చినా.. ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. నిజానికి గత ఆలోచనల నుంచి బయటపడడం కష్టమే అయినా.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి, ఈ దిశగా మనసును దృఢం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవడం, ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలని మీకు మీరే కొన్ని నియమాలు పెట్టుకోవడం.. కాలానుగుణంగా వీటిని మర్చిపోకుండా కట్టుబడి ఉండడం వల్ల.. మనసులోని బాధలన్నీ దూరమవుతాయి. మీలో కొత్త ఉత్సాహం జనిస్తుంది. ఇదే మిమ్మల్ని సానుకూలంగా ముందుకు నడిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని