Updated : 30/12/2021 20:41 IST

చలికాలంలో ఇలా ఆరోగ్యంగా ఉండండి!

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అయితే వేడివేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలను, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. పైగా ఈ కాలంలో చలికి ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్, లంచ్.. ఇలా అన్నీ ఆలస్యంగానే జరుగుతుంటాయి. వీటికి తోడు 'అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే..' అంటూ చాలామంది ఎక్సర్‌సైజ్‌ను వాయిదా వేస్తుంటారు. చలికాలంలో ఎదురయ్యే ఇలాంటి పరిణామాల వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు. మరి, ఈ కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

విటమిన్ 'డి' కోసం..

మన ఆరోగ్యానికి 'డి' విటమిన్ చాలా అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. సూర్యోదయం తర్వాత దాదాపు ఉదయం ఎనిమిది గంటలలోపు వచ్చే లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయాన్నే కాసేపు ఎండలో నిల్చోమంటారు ఆరోగ్య నిపుణులు. అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఫలితంగా ఎముకల్లో నొప్పి, కండరాల బలహీనత, విపరీతమైన అలసట తలెత్తుతాయి. అందుకే సూర్యకిరణాల నుంచి పొందలేని ఈ విటమిన్‌ను ఆహార పదార్థాల రూపంలో తీసుకోమంటున్నారు నిపుణులు. ఇందుకోసం విటమిన్ 'డి' అధికంగా లభించే పాలు, పాల పదార్థాలు; చేపలు, గుడ్లు.. వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నిపుణుల సలహా మేరకు విటమిన్ 'డి' సప్లిమెంట్స్‌ని కూడా తీసుకోవడం మంచిది. తద్వారా ఈ కాలంలోనూ ఎలాంటి అనారోగ్యాలు బాధించకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

రోగనిరోధక శక్తి పెంపొందాలంటే..

చలికాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ కాలంలో కాస్త చల్లటి పదార్థం లేదంటే శరీరానికి పడనిది.. ఇలా ఏది తిన్నా జలుబు, దగ్గు.. వంటి పలు అనారోగ్యాలు త్వరగా దరిచేరతాయి. ఇలాంటి అనారోగ్యాల్ని కలగజేసే క్రిములు, బ్యాక్టీరియాను రోగనిరోధక శక్తి బయటికి పంపించి వేస్తుంది. తద్వారా వాటి నుంచి బయటపడచ్చు. అందుకే ఈ కాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునే ఆహార పదార్థాల్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందుకోసం క్యాబేజీ, బ్రకలీ, నిమ్మజాతి పండ్లు, చిలగడ దుంప.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాల్ని ఆహారంగా తీసుకోవాలి. అలాగే చేపలు, గుడ్లు, మాంసం, పాలు, గింజలు, తృణధాన్యాలు.. వంటి జింక్ అధికంగా లభించే పదార్థాల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే రోజూ ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు గ్రీన్‌టీ తాగడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.

శక్తి స్థాయులు తగ్గకుండా..

చలికాలంలో మెదడులోని సెరటోనిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనం స్థాయులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరి, దీన్ని పెంచుకోవడానికి కార్బోహైడ్రేట్లు నిండి ఉన్న ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. అయితే ఇందులో చక్కెరలు అధికంగా ఉండే సాధారణ కార్బోహైడ్రేట్లు కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా నిండి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. దీంతో ఎక్కువ సమయం వరకు శరీరంలో శక్తి స్థాయులు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం గుమ్మడి కాయలు, చిలగడదుంప, ఆకుపచ్చని కూరగాయలు, ఓట్‌మీల్, పాస్తా, కార్న్.. వంటివి ఆహారంగా తీసుకోవచ్చు. తద్వారా మెదడులో సెరటోనిన్ స్థాయులు పెంచుకోవడంతో పాటు ఎక్కువ సేపు శక్తిని కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.

వ్యాయామం తప్పనిసరి..

'అసలే బయట విపరీతమైన చలి ఉందంటే.. రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయమంటారేంటి..' అని విసుక్కోకండి. ఏ కాలమైనా శరీరానికి వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల జలుబు, దగ్గు.. వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. అంతేకాదు.. ఈ కాలంలో బాగా బద్ధకించి, ఇష్టం వచ్చినట్లుగా తినడం వల్ల శరీర బరువు క్రమంగా పెరుగుతుంది. కాబట్టి మన శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆటలాడడం.. ఇలా శరీరానికి పని చెప్పడం తప్పనిసరి. దీనివల్ల ఇటు శారీరకంగా, అటు మానసికంగా ఎలాంటి అనారోగ్యాలు బాధించవు.

ఇవి తినాలి..

* చలికాలంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే వేడివేడిగా ఆహార పదార్థాల్ని తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా సూప్స్ ఈ విషయంలో మరింత బాగా పనిచేస్తాయి. తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, మాంసం.. వంటి పలు పదార్థాలతో వేడివేడిగా సూప్స్ తయారుచేసుకొని తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* బయట చల్లగా ఉంది కదా.. నీళ్లేం తాగుతాంలే అనుకుంటుంటారు చాలామంది. కానీ ఎప్పటిలాగే చలికాలంలోనూ బరువును బట్టి నిర్ణీత మోతాదులో నీరు తాగడం, ఇతర పండ్ల రసాలు తీసుకోవడం మర్చిపోవద్దు.

* శరీరానికి సోకే పలు ఇన్ఫెక్షన్లను ఎదిరించే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిని మనం తీసుకునే ఆహార పదార్థాల్లో, కూరల్లో వేసుకోవడం తప్పనిసరి. అలాగే దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాల్నీ పొందచ్చు.

శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తదితర అంశాల గురించి తెలుసుకున్నారు కదా! మరి, మీరూ వీటిని పాటించి ఈ కాలంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని