నెలసరిలోనూ జీన్స్‌ వేసుకుంటున్నారా?

నెలసరి సమయంలో సాధారణంగానే అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అందుకే ఈ రోజుల్లో వదులైన దుస్తులు కాస్త ఉపశమనాన్నిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులు ధరించాల్సి రావచ్చు. అలాంటప్పుడు లోదుస్తులు, ప్యాడ్‌ లైన్స్‌.. వంటివి బయటికి కనిపిస్తాయేమోనన్న భయం....

Published : 20 Aug 2022 20:00 IST

నెలసరి సమయంలో సాధారణంగానే అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అందుకే ఈ రోజుల్లో వదులైన దుస్తులు కాస్త ఉపశమనాన్నిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులు ధరించాల్సి రావచ్చు. అలాంటప్పుడు లోదుస్తులు, ప్యాడ్‌ లైన్స్‌.. వంటివి బయటికి కనిపిస్తాయేమోనన్న భయం చాలామందిని వెంటాడుతుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యామ్నాయాలు పాటించమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

‘కప్‌’తో కంఫర్ట్‌గా..!

పిరియడ్స్‌ సమయంలో ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు శ్యానిటరీ ప్యాడ్స్‌కి బదులుగా మెన్‌స్ట్రువల్‌ కప్‌ని ఎంచుకుంటున్నారు. అటు సౌకర్యంతో పాటు ఇటు పరిశుభ్రతను మెయింటెయిన్‌ చేయచ్చన్న ఉద్దేశమే ఇందుకు కారణం! అయితే జీన్స్‌, లెగ్గింగ్స్‌.. వంటి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు మరక పడకుండా, ప్యాడ్‌ లైన్స్‌ కనిపించకుండా ఉండాలంటే.. కప్‌ని ఎంచుకోవడమే సురక్షితం అంటున్నారు నిపుణులు. పైగా ఇవి ప్యాడ్స్‌ కంటే ఎక్కువ సమయం రక్షణనిస్తాయి కూడా! ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. బ్లీడింగ్‌ని బట్టి కప్‌ని 6-12 గంటలకోసారి తొలగించి.. శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇక కప్‌కి బదులుగా ట్యాంపూన్స్‌ని సైతం వాడచ్చంటున్నారు నిపుణులు.

పిరియడ్‌ ప్యాంటీ

నెలసరి సమయంలో బిగుతైన దుస్తులు ధరించాల్సి వచ్చినప్పుడు.. ప్యాడ్‌ లైన్స్‌ కనిపించకుండా ఉండడానికి ‘పిరియడ్‌ ప్యాంటీ’ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. సాధారణ లోదుస్తుల్లా ఉండే దీనిలో మూడు లేయర్లుంటాయి. లోపలి నుంచి మొదటి లేయర్‌ ప్యాడ్‌ అమర్చుకునేందుకు వీలుగా ఉంటుంది.. రెండో లేయర్‌ బ్లీడింగ్‌ లీక్‌ కాకుండా రక్షణనిస్తుంది. ఇక ఈ రెండు లేయర్లను కప్పి ఉండే మూడో లేయర్‌ మనం నెలసరిలో ఉన్నామన్న ఫీలింగ్‌ లేకుండా మనల్ని మరింత సౌకర్యవంతంగా ఉంచుతుంది. పైగా దీన్ని ధరించి బిగుతైన దుస్తులు వేసుకున్నా.. ఈ మూడు లేయర్ల కారణంగా ప్యాడ్‌ లైన్స్‌ బయటికి కనిపిస్తాయని భయపడాల్సిన పని కూడా లేదు. ఇక ఇందులోనూ రక్తస్రావాన్ని బట్టి అవసరమైతే లోపలి వైపు అమర్చుకున్న శ్యానిటరీ ప్యాడ్‌ను మార్చుకోవచ్చు. ఈ పిరియడ్‌ ప్యాంటీలు కాస్త ఖరీదైనవే అయినప్పటికీ.. నెలసరి సమయంలో అటు రక్షణను, ఇటు సౌకర్యాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు.

పలుచగా ఉన్నవి..!

మనం ఉపయోగించే శ్యానిటరీ ప్యాడ్స్‌ ఎంత మందంగా ఉంటే అంత ఎక్కువగా బ్లీడింగ్‌ని పీల్చుకుంటాయనుకుంటారు చాలామంది. కానీ అది అపోహ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ సమయం సురక్షితంగా ఉండేందుకు వీలుగా, సౌకర్యంగా ఫీలయ్యేలా పలుచటి ప్యాడ్సే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. వాటిలోనూ సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన బయోడిగ్రేడబుల్‌ న్యాప్‌కిన్స్‌ సైతం లభిస్తున్నాయి. వాటిని ఎంచుకుంటే అటు ఆరోగ్యంగా, ఇటు సౌకర్యవంతంగా గడిపేయచ్చు. పైగా బిగుతైన దుస్తులు వేసుకున్నప్పుడు ప్యాడ్‌ లైన్స్‌ బయటికి కనిపిస్తాయని భయపడాల్సిన పని కూడా లేదు.

ఇవి ప్రయత్నించండి!

నెలసరి సమయంలో జీన్స్‌ వంటి బిగుతైన దుస్తులు వేసుకున్నప్పుడు ప్యాడ్‌ లైన్స్‌ కనిపించకుండా ఉండేందుకు లోపల ఫుల్‌ లెగ్‌ స్టాకింగ్స్‌, అండర్‌షార్ట్స్‌.. వంటివి ధరించచ్చు.

ప్రింటెడ్‌ దుస్తులు కూడా ప్యాడ్‌ లైన్స్‌ని బయటికి కనిపించకుండా దాచేస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ తరహా జీన్స్‌లు, లెగ్గింగ్స్‌.. వంటివి ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటిని ఎంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ముదురు రంగులు, గీతలున్నవి కూడా ఎంచుకోవచ్చు.

మనం ఎంచుకునే దుస్తుల సైజును బట్టి కూడా ప్యాడ్‌ లైన్స్‌ కనిపించే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మరీ బిగుతుగా ఉండే జీన్స్‌, లెగ్గింగ్స్‌, బాడీ హగ్గింగ్‌ డ్రస్సులు ఎంచుకుంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృథా అంటున్నారు. కాబట్టి సరైన సైజు దుస్తులు ఎంచుకుంటే సౌకర్యవంతంగా కనిపించేయచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని