కాబోయే వధువు కోసం ఆ స్పెషల్ పార్టీ.. ఇలా!

పెళ్లంటే వేడుకలే కాదు.. వివిధ రకాల పార్టీలూ ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ‘బ్యాచులరెట్ పార్టీ’ కూడా అలాంటిదే! సింగిల్‌హుడ్‌కి సెండాఫ్‌ చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోన్న తమ నెచ్చెలికి స్నేహితురాళ్లంతా కలిసి ఇచ్చే స్పెషల్‌....

Published : 10 Feb 2023 19:43 IST

పెళ్లంటే వేడుకలే కాదు.. వివిధ రకాల పార్టీలూ ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ‘బ్యాచులరెట్ పార్టీ’ కూడా అలాంటిదే! సింగిల్‌హుడ్‌కి సెండాఫ్‌ చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోన్న తమ నెచ్చెలికి స్నేహితురాళ్లంతా కలిసి ఇచ్చే స్పెషల్‌ పార్టీ ఇది! ఎంతో సరదా, ఎన్నో భావోద్వేగాలు మిళితమై ఉన్న ఈ ప్రి-వెడ్డింగ్‌ పార్టీని జరుపుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు! ఏదేమైనా ఈ ప్రత్యేక సందర్భం ఇటు మీలో, అటు నవ వధువులో కొత్త జోష్‌ నింపాలంటే, కొత్త పెళ్లి కూతురు ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

సర్‌ప్రైజ్‌ మీద సర్‌ప్రైజ్!

మీరిచ్చే పార్టీ ఎప్పుడు, ఎక్కడ అనే విషయాలు మీ నెచ్చెలికి ఎలాగూ ముందే చెప్పి పెడతారు. అలాగని ప్రతిదీ చెప్తామంటే అందులో సర్‌ప్రైజ్‌ ఏముంటుంది చెప్పండి! అందుకే కాబోయే వధువుకు కొన్ని విషయాలు అప్పటికప్పుడు రివీల్‌ చేస్తూ ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తమంటున్నారు నిపుణులు. సాధారణంగానైతే ఈ పార్టీలో గర్ల్‌ గ్యాంగ్‌కే చోటుంటుంది.. కానీ మీరు ఓ అడుగు ముందుకేసి.. వరుడిని ఈ పార్టీకి ఆహ్వానించి మీ స్నేహితురాలిని సర్‌ప్రైజ్‌ చేయచ్చు. మీరంతా ఒకే తరహా డ్రస్సింగ్‌లో ముస్తాబై.. మీ స్నేహితురాలి అభిరుచుల మేరకు ఓ లవ్లీ డ్రస్‌ డిజైన్‌ చేయించి.. పార్టీలో ఆమెను అందంగా ముస్తాబు చేయండి.. తన మనసు నిండిపోతుంది. ఇలా ఈ క్రమంలో మీరు ‘బ్యాచులరెట్ పార్టీ’/ ‘బ్రైడ్‌ స్క్వేర్‌’/ ‘బ్రైడ్స్ మెయిడ్‌’, ‘టీమ్‌ బ్రైడ్‌’.. వంటి పదాలున్న కస్టమైజ్డ్‌ దుస్తుల్ని ఎంచుకోవచ్చు.. లేదంటే మీరే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవచ్చు. ఇక మీ నెచ్చెలికి నచ్చిన బహుమతులూ ఆమెకు అందించి సర్‌ప్రైజ్‌ చేయచ్చు.

థీమ్‌కు అనుగుణంగా!

కాబోయే వధువుకు బ్యాచులరెట్ పార్టీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే మీరు ఎంచుకునే వేదిక, దాని అలంకరణా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అయితే ఇది పూర్తిగా మీ నెచ్చెలి అభిరుచులకు తగినట్లుగా ఉంటే తన ఆనందానికి అవధులుండవు. ఈ క్రమంలో కొందరికి ఇంట్లోని తమ ప్రైవేట్ ప్లేస్‌లో చేసుకోవడం ఇష్టముండచ్చు.. ఇంకొందరు హోటల్స్‌, బీచ్.. వంటి ప్రదేశాల్ని ఎంచుకోవచ్చు.. మరికొందరు విదేశంలో ప్లాన్‌ చేసుకోవచ్చు.. ఇలా ఎక్కడ చేసుకున్నా ఓ చక్కటి థీమ్‌ను ఎంచుకుంటే మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఈ క్రమంలో డిస్నీ థీమ్‌, బీచ్‌ థీమ్‌, పర్యావరణాన్ని ఇష్టపడే వారు ఎకో-ఫ్రెండ్లీ థీమ్, కలర్‌ కోడింగ్‌ థీమ్.. ఇలా మీ స్నేహితురాలి అభిరుచులు, మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఓ అంశాన్ని ఎంచుకొని.. దాని ప్రకారమే వేదికను అలంకరించాలి. అలాగే మీరు, కాబోయే వధువు వేసుకునే అవుట్‌ఫిట్స్‌ కూడా అలంకరణను బట్టే ఉండాలి. అంటే థీమ్‌ కాస్త మోడ్రన్‌గా ఉంటే ట్రెండీ అవుట్‌ఫిట్స్‌, కాస్త హోమ్లీగా ఉంటే సంప్రదాయ దుస్తులు.. వంటివి ధరించేలా ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇక ‘బ్రైడ్‌ టు బి’, ‘వధూవరుల పేర్లతో క్రియేట్‌ చేసిన హ్యాష్‌ట్యాగ్‌’.. వంటి వాటితో ప్రత్యేకమైన పేపర్‌/బెలూన్ బ్యానర్స్ ఏర్పాటు చేయడం, థీమ్‌కు అనుగుణంగా బ్రైడల్‌ కేక్‌ను ప్రత్యేకంగా తయారుచేయించడం.. ఇవన్నీ ఇందులో భాగమే!

‘ఫొటోషూట్‌’తో వైరల్!

సాధారణంగా ఏ అకేషనైనా ఫొటోషూట్‌ చేయించుకోవడం ఇప్పటి ట్రెండ్! ఇది బ్యాచులరెట్ పార్టీకీ వర్తిస్తుంది. కాబట్టి ఈ పార్టీలోని జోష్‌ను సెల్ఫీలు, మీ మొబైల్స్‌లో బంధించడంతో పాటు ఈ మెమరీస్‌ని మరింత న్యాచురల్‌గా క్లిక్‌మనిపించడానికి ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ సహాయం తీసుకోవాల్సిందే! ఈ క్రమంలో క్యాండిడ్‌ ఫొటోషూట్‌కి ప్రాధాన్యమిస్తే ఫొటోలన్నీ రియాల్టీకి తగినట్లుగా వస్తాయి.

నా గురించి నీకెంత తెలుసు?

బ్యాచులరెట్ పార్టీ అంటే ముస్తాబవడం, ఫొటోలు దిగడమే కాదు.. సరదా ఆటలు కూడా ఇందులో భాగమైతేనే పార్టీ మజాను పూర్తిగా ఆస్వాదించచ్చు. ఈ క్రమంలో మీ క్రియేటివిటీని బట్టి ఫన్నీ గేమ్స్‌ ప్లాన్‌ చేయచ్చు. మీ నెచ్చెలి వధువుగా ప్రమోషన్‌ పొందబోతోంది కాబట్టి.. ఆమెనే థీమ్‌గా తీసుకొని గేమ్‌ ప్లాన్‌ చేయచ్చు. అదెలాగంటే.. ‘నా గురించి నీకెంత తెలుసు?’ అనే అంశాన్ని తీసుకొని.. కాబోయే వధువు గురించి మీకు తెలిసిన విషయాలు, ఆమెలో మీకు నచ్చిన అంశాలు.. ఒక్కొక్కరుగా చెప్పచ్చు. లేదంటే మీ గర్ల్‌ గ్యాంగ్‌లో వరుడికి చోటిచ్చి.. కాబోయే దంపతులిద్దరితో ఓ ఫన్నీ గేమ్‌ ఆడించచ్చు. ఒకరి ఇష్టాయిష్టాలపై మరొకరికి ప్రశ్నలు సంధిస్తూ సమాధానం రాయమనచ్చు. ఇవన్నీ ఇటు మీకు, అటు వారికి బోలెడంత సరదాను పంచుతాయి.

ఇలా మీ నెచ్చెలికి మీరిచ్చే పార్టీ ఆమెకు జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది మీ స్నేహబంధాన్నీ పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్