Updated : 25/10/2022 20:00 IST

ఛాతీ ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ఛాతీ పాత్ర కీలకం. అయితే మనం వేసుకునే బిగుతైన దుస్తులు, తీసుకునే ఆహారం, లైఫ్‌స్త్టెల్.. వంటివన్నీ వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఓ రకంగా చెప్పాలంటే.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఛాతీ అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనల్ని రొమ్ము క్యాన్సర్ వూబిలోకి లాగుతున్నాయంటున్నారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఛాతీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ క్రమంలో ఛాతీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

సరిపడినంత నిద్ర..

మీరు నిద్రపోయేటప్పుడు ఎలా పడుకుంటారు?? వెల్లకిలా పడుకున్నా, కాసేపు పక్కకి తిరిగి పడుకున్నా ఫర్వాలేదు. కానీ బోర్లా పడుకునే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానుకోవడానికి ప్రయత్నించండి. దీని కారణంగా ఛాతీ ఆకృతి దెబ్బతినే అవకాశాలు లేకపోలేవు. అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో హార్మోన్లన్నీ సమతుల్య స్థితిలోకి వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది అధిక స్థాయిలో ఉంటే ఛాతీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కాబట్టి రోజూ ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర పోవడం చాలా అవసరం.

వ్యాయామం.. క్రమం తప్పకుండా..!

మన శరీరంలో అధిక స్థాయుల్లో ఉండే కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది మరీ ఎక్కువ స్థాయిలో ఉంటే పలు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు కణాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఫలితంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా అదుపులో ఉంటుంది. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. అయితే మరీ కఠినమైనవి కాకుండా మధ్యస్థంగా ఉండే వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలోని కొవ్వులు కరుగుతాయని, ఫలితంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది.

తగినంత ఫోలిక్‌యాసిడ్..

మనం తీసుకునే ఆహారం ద్వారా తగినంత ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందకపోయినా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు. శరీరంలో ఫోలిక్ యాసిడ్ స్థాయులు తగ్గడం వల్ల డీఎన్ఏ తనని తాను రిపేర్ చేసుకునే స్వభావం మీద ప్రభావం పడుతుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ మనం తీసుకునే ఆహారంలో భాగంగా 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అందేలా జాగ్రత్తపడడం చాలా అవసరం. ఇందుకోసం పాలకూర, నిమ్మజాతికి చెందిన పండ్లు, బీన్స్, అవకాడో.. మొదలైన వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి.

సరిపడినంత విటమిన్ ‘డి’..

ఛాతీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా జరిపిన ఒక అధ్యయనంలో భాగంగా.. పెద్ద పేగు క్యాన్సర్ సోకిన 2,50,000 కేసులు, రొమ్ముక్యాన్సర్ సోకిన 3,50,000 కేసులు పరిశీలించారు. వీటిలో చాలావరకు సరిపడినంత విటమిన్ ‘డి’ పొందడం ద్వారా సమస్య నుంచి బయటపడే అవకాశాలున్నాయని తేలింది. అందుకే లేలేత సూర్యకిరణాలు చర్మంపై పడేలా కాసేపు ఉదయాన్నే ఎండలో నిలబడడం మంచిది. ఒకవేళ వాతావరణ పరిస్థితుల కారణంగా సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ పొందలేకపోతే ఈ పోషకం అధికంగా ఉండే చేపలు, కమలాఫలాలు.. వంటి పదార్థాలు ఆహారంలో చేర్చుకోవాలి. మరీ అత్యవసరమైతే వైద్య నిపుణులను సలహా మేరకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్లను వాడడం కూడా మంచిది.

మృదువుగా మసాజ్..

రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు మసాజ్‌ చక్కగా తోడ్పడుతుంది. చేతులతో మృదువుగా మసాజ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఛాతీని పొందవచ్చంటున్నారు నిపుణులు. రోజూ ఐదు నిమిషాల పాటు చేతులతో ఛాతీపై మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల వాటిని తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడంతో పాటు.. ఏవైనా గడ్డలు, నొప్పి.. వంటి సమస్యలు ఉన్నా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు కూడా..

⚛ తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం..

⚛ బరువు అదుపులో ఉంచుకోవడం..

⚛ సౌకర్యవంతంగా ఉండే బ్రాలను ధరించడం..

⚛ బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం.. మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా ఛాతీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని