Updated : 01/07/2021 19:27 IST

ఛాతీ ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ఛాతీ పాత్ర కీలకం. అయితే మనం వేసుకునే బిగుతైన దుస్తులు, తీసుకునే ఆహారం, లైఫ్‌స్త్టెల్.. వంటివన్నీ వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఓ రకంగా చెప్పాలంటే.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఛాతీ అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనల్ని రొమ్ము క్యాన్సర్ వూబిలోకి లాగుతున్నాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఛాతీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ క్రమంలో ఛాతీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

సరిపడినంత నిద్ర..

మీరు నిద్రపోయేటప్పుడు ఎలా పడుకుంటారు?? వెల్లకిలా పడుకున్నా, కాసేపు పక్కకి తిరిగి పడుకున్నా ఫర్వాలేదు. కానీ బోర్లా పడుకునే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానుకోవడానికి ప్రయత్నించండి. దీని కారణంగా ఛాతీ ఆకృతి దెబ్బతినే అవకాశాలు లేకపోలేవు. అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో హార్మోన్లన్నీ సమతౌల్య స్థితిలోకి వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది అధిక స్థాయిలో ఉంటే ఛాతీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కాబట్టి రోజూ ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర కలిగి ఉండడం చాలా అవసరం. అందుకే ఇకపై ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను పక్కన పెట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా నిద్రపోవడానికి ఉపక్రమించండి.

క్రమంతప్పని వ్యాయామం..

మన శరీరంలో అధిక స్థాయుల్లో ఉండే కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది మరీ ఎక్కువ స్థాయిలో ఉంటే పలు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు కణాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఫలితంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. వారంలో కనీసం 150ని||ల పాటు (క్రమం తప్పకుండా రోజూ ఎంతో కొంత సమయం) మరీ కఠినమైనవి కాకుండా మధ్యస్థంగా ఉండే వ్యాయామాలు చేయడం ద్వారా కొవ్వు కణాల సంఖ్య తగ్గుతుందని, ఫలితంగా క్యాన్సర్ సమస్య తలెత్తే అవకాశాలు తగ్గుతాయని చెబుతోంది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ. ఒకవేళ వారానికి 150ని|| సమయం వ్యాయామానికి కేటాయించలేని పక్షంలో 75ని||ల పాటు కఠినమైన వ్యాయామాలు చేసినా ఇదే ఫలితం దక్కించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తగినంత ఫోలిక్‌యాసిడ్..

మనం తీసుకునే ఆహారం ద్వారా తగినంత ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందకపోయినా క్యాన్సర్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీరంలో ఫోలిక్ యాసిడ్ స్థాయులు తగ్గిన కారణంగా డీఎన్ఏ తనని తాను రిపేర్ చేసుకునే స్వభావం మీద ప్రభావం పడుతుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ మనం తీసుకునే ఆహారంలో భాగంగా 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అందేలా జాగ్రత్తపడడం చాలా అవసరం. ఇందుకోసం పాలకూర, నిమ్మజాతికి చెందిన పండ్లు, బీన్స్, అవకాడో.. మొదలైన వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి.

సరిపడినంత విటమిన్ డి..

ఛాతీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా జరిపిన ఒక అధ్యయనంలో భాగంగా కోలన్ క్యాన్సర్ సోకిన 2,50,000 కేసులు, రొమ్ముక్యాన్సర్ సోకిన 3,50,000 కేసులు పరిశీలించారు. వీటిలో చాలావరకు సరిపడినంత విటమిన్ డి పొందడం ద్వారా సమస్య నుంచి బయటపడే అవకాశాలున్నాయట! ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయాల్సిన పని లేదు. లేలేత సూర్యకిరణాలు చర్మంపై ప్రసరించేలా కాసేపు ఉదయాన్నే ఎండలో నిలబడితే చాలు..! ఒకవేళ వాతావరణ పరిస్థితుల కారణంగా సూర్యరశ్మి నుంచి విటమిన్ డి పొందడానికి ఇబ్బంది పడేవారు వాళ్లు తీసుకునే ఆహారంలో ఫెర్మెంటెడ్ కాడ్ లివర్ ఆయిల్ భాగం చేసుకుంటే సరిపోతుంది. అలాగే వైద్య నిపుణులను సంప్రదించి అవసరమైతే విటమిన్ డి సప్లిమెంట్లను వాడడం కూడా మంచిది.

మనల్ని మనం ప్రేమించుకోవాలి..

ప్రస్తుత జీవనశైలి కారణంగా మన పనులు మనం చేసుకోవడానికే క్షణం తీరిక దొరకడం కష్టం అవుతోంది. ఇక మనల్ని మనం ప్రేమించుకునే సమయం ఎక్కడిది అంటారా?? నిజమే కావచ్చు.. కానీ మనల్ని మనం ప్రేమించుకోవడం.. లేదా మన మనసుకు నచ్చే పనులు చేయడం ద్వారా శరీరంలోని నాడీ వ్యవస్థ ప్రభావితమై మనం మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవడం, నచ్చిన పుస్తకం చదవడం.. ఏదైనా సరే.. నచ్చిన పని చేయడానికి రోజూ కాస్త సమయం కేటాయించుకోవాలి.

మృదువుగా మసాజ్..

రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఎంపిక చేసుకునే మార్గాల్లో మసాజ్ ఒకటి. చేతులతో మృదువుగా మసాజ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఛాతీని పొందవచ్చంటున్నారు నిపుణులు. రోజూ ఐదు నిమిషాల పాటు చేతులతో ఛాతీపై మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా వాటికి చక్కటి ఆకృతిని ఇవ్వడమే కాదు.. ఏవైనా గడ్డలు, నొప్పి.. వంటి సమస్యలు ఉన్నా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు కూడా..

* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..

* తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం..

* మరీ ఎక్కువ లేదా తక్కువ కాకుండా ఆరోగ్యవంతమైన బరువును మెయింటెయిన్ చేయడం..

* సౌకర్యవంతంగా ఉండే బ్రాలను ధరించడం..

* బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం.. మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా ఛాతీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని