Published : 20/02/2023 20:32 IST

ఐలైనర్‌ రోజంతా నిలిచి ఉండాలంటే..!

కంటిని ఇంపుగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతో కష్టపడి ఐలైనర్‌ పెట్టుకుంటాం. కనురెప్పల చివర ‘Wing’ తరహా రూపమిస్తాం. మరి, ఇంత చేసీ రోజంతా ఐలైనర్‌ అలాగే నిలిచి ఉంటుందా అంటే.. కష్టమే అని చెప్పాలి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇది సాధ్యమేనంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసుకునే క్రమంలో కళ్లు, కనురెప్పల చుట్టూ కూడా అప్లై చేసుకొని.. ఆపై ఐలైనర్‌ పెట్టుకుంటుంటారు చాలామంది. అయితే దీనివల్ల ఐలైనర్‌ త్వరగా చెదిరిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి కళ్లకు ఐలైనర్‌ పెట్టుకోవాలనుకుంటే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్‌ రాసుకోకపోవడమే మంచిది.

పదే పదే ముఖం కడుక్కోవడం, చెమటలు రావడం వల్ల కూడా ఐలైనర్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండదు. అలాంటప్పుడు వాటర్‌ ప్రూఫ్‌ లేదా జెల్‌ తరహా ఐలైనర్‌ ఎంచుకోవడం మేలు.

కాటుక పెట్టుకున్నాక అది చెరిగిపోకుండా దానిపై నుంచి టాల్కమ్‌ పౌడర్‌ ఎలాగైతే అద్దుతామో.. ఐలైనర్‌ చెరిగిపోకుండా ఉండేందుకు కూడా ఇదే చిట్కాని పాటించచ్చంటున్నారు నిపుణులు. అయితే అద్దీ అద్దనట్లుగా కొద్ది పాటి పౌడర్‌ని ఉపయోగిస్తే ఐలైనర్‌ మెరుపు తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే ముందు పౌడర్‌ రాసుకొని ఆపై ఐలైనర్‌ అప్లై చేసుకున్నా ఫలితం ఉంటుంది.

ముఖానికి మేకప్‌ వేసుకునే ముందు ప్రైమర్‌ ఎలాగైతే రాసుకుంటామో.. ఐలైనర్‌ పెట్టుకోవడానికి ముందు కూడా ఐ ప్రైమర్‌ అప్లై చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే అది కూడా తక్కువ మొత్తంలో రాసుకుంటే ఐలైనర్‌ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ఐషాడో కూడా ఐలైనర్‌ని ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు సహకరిస్తుంది. ఈ క్రమంలో ఐలైనర్‌ వేసుకోవడం పూర్తయ్యాక.. బ్రష్‌ సహాయంతో కనురెప్పలపై షాడోని పైపైన తీర్చిదిద్దితే సరిపోతుంది.

ఐలైనర్‌ రోజంతా నిలిచి ఉండాలంటే కనురెప్పల్ని తీర్చిదిద్దుకునే మస్కారా కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎలాగైతే నీటిలో కరగని ఐలైనర్‌ని ఎంచుకుంటామో.. అదేవిధంగా మస్కారా కూడా వాటర్‌ ప్రూఫ్‌దైతే ఫలితం ఉంటుంది.

ఏదో అలా పైపైన ఐలైనర్‌ పెట్టుకున్నా.. అది ఎక్కువ సమయం నిలిచి ఉండకపోగా.. కంటి అందం ఇనుమడించదు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లేయర్లు అప్లై చేసుకోవడం వల్ల ఐలైనర్‌ త్వరగా చెదిరిపోకుండా కాపాడుకోవచ్చు.

ఐలైనర్‌ అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కన్సీలర్‌తో టచప్‌ ఇచ్చినా చక్కటి ఫలితం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని